close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అంతర్మథనం

వంకమామిడి వెంకటరావు

విశ్వం ఆఫీసు నుండి బయటపడి బస్‌స్టాపుకి వచ్చేసరికి అతను ఎక్కవలసిన పదో నంబర్‌ బస్సు అప్పుడే వచ్చి బస్‌స్టాపులో ఆగింది. బస్సు ఆగీ, ఆగంగానే అప్పటికే బస్‌స్టాపు నిండా ఉన్న జనం, సీటు ఎక్కడ దొరకదో అనే ఆతృతలో ఒకళ్లని ఒకళ్లు తోసుకుంటూ బస్సులోకి ఎక్కటం మొదలుపెట్టారు.
విశ్వం తోసుకుంటూ, నెట్టుకుంటూ ఎక్కటానికి ఇష్టపడడు. నిదానంగా ఎక్కి సీటు దొరికితే కూర్చుంటాడు, లేకపోతే లేదు. అంతేగానీ సీటు దొరకలేదని ఎప్పుడూ నిరుత్సాహపడడు. దొరికినా కూడా తనకన్నా పెద్దవాళ్లు ఎవరైనా నుంచుని ఉంటే, లేచి తన సీటుని వాళ్లకి ఆఫర్‌ చేస్తాడు.
ప్రతిరోజులానే ఆ రోజు కూడా సీటు దొరక్కపోయేటప్పటికి, పక్కనే ఉన్న ఊచని ఆనుకుని నిలబడ్డాడు. బస్సు బయలుదేరింది. ఆలోచనలు ఇంట్లో జరగబోయే శుభకార్యం మీదకు మళ్లాయి. నెల రోజులలో పెద్ద కూతురు కుసుమ పెళ్లి. పెళ్లి పనులు జరిగిపోతున్నాయి.
ధనవంతులకి- పెళ్లి అంటే వాళ్లకున్న ఐశ్వర్యం, వాళ్ల గొప్పలూ చూపించుకోవటానికి ఒక అవకాశం. ముందూ వెనకా చూడకుండా డబ్బులు నీళ్లలాగా ఖర్చు పెడతారు.
కానీ విశ్వంలాంటి వాడికి తలకు మించిన భారం. అయినా తప్పదు, కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యత.
శుభలేఖలు నిన్ననే వచ్చాయి. పొద్దున ఆఫీసుకి బయలుదేరుతున్నప్పుడు భార్య సుజాత చెప్పింది గుర్తుకి వచ్చింది... ‘ఎల్లుండి శుక్రవారం, దశమి, మంచిది. శుభలేఖలు పంచడం మొదలుపెడదాం’ అని. పెళ్లికి ముందు ఒక వారం రోజులూ, పెళ్లి తరువాత ఒక వారం రోజులూ ఉండేటట్టు సెలవుకి అర్జీ పెట్టుకున్నాడు.
విశ్వం మామూలు దిగువ మధ్య తరగతి ఉద్యోగి. ఆదాయం తక్కువ, కుటుంబం చూస్తే పెద్దది. తల్లీ, తండ్రీ, భార్యా, ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉంది. అందంగా ఉంటుంది. మంచి రంగూ ఆకర్షణీయమైన మొహం. నవ్వితే చిరుమువ్వలు మోగినట్లూ సెలయేరు దుమికినట్లూ ఉంటుంది. దాంతో పెళ్లి కావాల్సిన మగ పిల్లలున్న తల్లిదండ్రులు మా అబ్బాయికి చేసుకుంటాం అంటే, మా అబ్బాయికి చేసుకుంటాం అని చాలా మంది ముందుకు వచ్చారు. అందుకే కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం రాకుండా మంచి సంబంధం కుదిరింది.
బేషజాలకు పోకుండా ఉన్న దాంట్లో సంప్రదాయబద్ధంగా పిల్ల పెళ్లి చేయాలని విశ్వం ఆలోచన. రెండో పిల్ల ఇంటర్‌ చదువుతోంది.
విశ్వం తండ్రి పౌరోహిత్యం చేసి సంపాదించినదంతా విశ్వం అక్కా చెల్లెళ్ల పెళ్లిళ్లకే అయిపోయింది. తల్లీ, తండ్రీ, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో అతనొక్కడే సంపాదనపరుడు. మళ్లీ జీతం వచ్చే వరకూ అప్పులు చేయకుండా జరిగిపోతే చాలు అదే పది వేలు అనిపించే జీతం, జీవితం.
విశ్వానికి కోరికలు అంటూ ఏమీ లేవు. విశ్వం అల్ప సంతోషి అని అతని ఆఫీసులో వాళ్లు అంటూ ఉంటారు. ఎప్పుడు చూసినా నవ్వు మొహంతో ఉంటాడు, అసలు ఏ కష్టాలూ లేని వాళ్లలాగా. అదేమంటే- లేని దాన్ని గురించి ‘ఏడిస్తే వస్తాయా’ అని ఎదురు ప్రశ్న వేస్తాడు.
అతడు డబ్బులకు బీదవాడేమో గానీ హృదయం చాలా విశాలమైంది.
డబ్బు లేనివాడు కాబట్టి ధన సహాయం చేయలేడుగానీ ఇతర రకాల సహాయాలు చేయటానికి ఎప్పుడూ వెనుకాడడు. ఆఫీసు వాళ్లే కాకుండా విశ్వం ఇంటి చుట్టుపక్కల వాళ్లు కూడా ఏ అవసరం వచ్చినా విశ్వాన్ని అడగటానికి ఏమాత్రం సంకోచించరు. ఆదర్శ భావాలు కలవాడు. తనకోసమే కాదు, పరులకొరకు కూడా బతకాలనీ, పుట్టినందుకు మానవ జన్మను సార్ధకపరచుకోవాలనీ మనసా, వాచా, కర్మణా నమ్మేవాడు.
విశ్వం భార్య సుజాత మామూలు మధ్య తరగతి ఇల్లాలికుండే సాధారణ మనస్తత్వం ఉన్న ఇల్లాలు. ఇల్లూ కుటుంబం... అదే ఆమె జీవితం. పెళ్లైన కొత్తల్లో విశ్వం ఆమెను కూర్చోబెట్టి ఆదర్శాలూ, పరోపకారం లాంటి వాటి గురించి చెబుతుంటే ఆమెకు వింతగా ఉండేది. భర్త తత్వం విచిత్రంగా అసహజంగా అనిపించేది ఆమెకు. కూటికీ, గుడ్డకూ పనికిరాని ఆదర్శాలు డబ్బులున్నవారికి గానీ, మనలాంటి వాళ్లకు ఎందుకు అనేది సుజాత అభిప్రాయం.
ఇంటి పనులతో, చిన్న పిల్లలతో పగలంతా పనిచేసి అలసిపోయి ఉండేదేమో, భర్త ఏదో చెబుతున్నా, విపరీతంగా నిద్ర వచ్చేసి కునికిపాట్లు పడేది. భార్య నుంచి ఎటువంటి స్పందనా రాకపోయేటప్పటికి విశ్వం కూడా భార్య దగ్గర అటువంటి విషయాల గురించి చెప్పటం మానేశాడు. కానీ, భర్త పాల్గొనే సామాజిక కార్యక్రమాలకు సుజాత ఎప్పుడూ అడ్డు చెప్పదు. సుజాత కోరుకునేది కూతుళ్లిద్దరికీ మంచి భర్తలని తీసుకురావాలని మాత్రమే.
విశ్వం అద్దెకుండేది దూరపు బంధువు వరుసకు బాబాయి అయ్యే కృష్ణమూర్తి గారింట్లో. అది మూడు అంతస్తుల మేడ. కృష్ణమూర్తిగారు హైదరాబాదులో వాళ్ల అబ్బాయి దగ్గర ఉంటాడు. అద్దెలు వసూలు చేయటం, చిన్న చిన్న రిపేర్స్‌ వస్తే చేయించటం లాంటివి విశ్వమే చూస్తూ ఉంటాడు.
పెళ్లి అనుకున్న దగ్గరనుంచీ ప్రతిరోజూ భార్యాభర్తలు రాత్రి భోజనాలప్పుడు పెళ్లి పనులు ఏమేమి అయినాయి, చేయవలసినవి ఏమి ఉన్నాయి అని చర్చించుకుంటున్నారు.
విశ్వం నివాసం ఉంటున్న కాలనీలోనే, కాలనీ వాళ్లకోసం ఒక కళ్యాణ మండపం ఉంది. కాలనీ వాసులకి చాలా తక్కువ అద్దెలో ఇస్తారు. కుమార్తె పెళ్లి అక్కడే చేద్దామని అడ్వాన్స్‌ అమౌంట్‌ కట్టి మండపం బుక్‌ చేసుకున్నారు.
మగపెళ్లి వారికి విడిది ఏర్పాటు చేయటం  ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఒక రోజు భోజనాలప్పుడు అదే విషయం గురించి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు.
‘‘ఏమండీ! మన కోసమే అన్నట్టు పై పోర్షన్‌ ఖాళీ అయింది. రెండు మూడు రోజులు వాడుకుంటామని మీ బాబాయిగారిని అడిగి చూడరాదూ!’’ ఆశగా అడిగింది సుజాత.
‘‘కరెక్టే కదా! రేపే అడిగి చూస్తాను.’’
విశ్వం మర్నాడు ఆఫీసు నుంచి రాగానే, కృష్ణమూర్తిగారికి ఫోన్‌ చేశాడు.
‘‘బాబాయ్‌! నేను విశ్వాన్ని మాట్లాడుతున్నాను. నీకు తెలుసు కదా కుసుమ పెళ్లి సంగతి. మగ పెళ్లి వారి విడిది కోసం చూస్తున్నాము. మన పై పోర్షన్‌ రెండు మూడు రోజులు వాడుకుంటామని అడగటానికి ఫోన్‌ చేశాను.’’
ఒక నిమిషం తరువాత అటునుంచి సమాధానం వచ్చింది.
‘‘ఇచ్చేవాడినే కానీ చిన్న ప్రాబ్లమ్‌ ఉందిరా విశ్వం. మీ ఇంట్లో పెళ్లికి ఇంకా పదిహేను రోజులు ఉంది. ఈ లోపల ఎవరికన్నా ఇల్లు నచ్చి, వస్తామంటే వాళ్లకి ఇరవై రోజుల తరువాతే ఇవ్వగలం అని చెప్పాల్సి వస్తుంది. అన్ని రోజులు వాళ్లు ఆగుతారో లేదో చెప్పలేము. వాళ్లు వెంటనే కావాలి అంటే మటుకు వాళ్లను వదులుకోవాల్సి వస్తుంది. వచ్చిన వాళ్లను వదులుకుంటే వేరేవాళ్లు ఎప్పుడు వస్తారో చెప్పలేము. నీకు తెలుసు కదా ఇప్పటికే రెండు నెలల నుంచీ ఆ పోర్షన్‌ ఖాళీగా ఉంది. నీకు ఇవ్వలేను అని చెప్పటానికి బాధగా ఉందిరా! ఏమీ అనుకోకు.’’

‘‘అనుకోవటానికి దీంట్లో ఏముంది బాబాయ్‌! నువ్వు అన్నది కూడా నిజమే. నువ్వేమీ బాధ పడకు. మరోచోట ప్రయత్నిస్తాను’’ నిరాశగా అన్నాడు విశ్వం.
‘‘ఇవ్వలేక పోవటానికి కారణం ఏంటట?’’ కోపంగా అడిగింది ఫోనులో జరిగిన సంభాషణ విన్న సుజాత. కృష్ణమూర్తిగారు చెప్పినదే చెప్పాడు.
‘‘రెండు నెలల నుంచి ఖాళీగానే ఉంది. ఇప్పుడే అర్జెంట్‌గా ఎవరు వస్తారుట? ఆయనకి ఇవ్వాలని లేదు. ఇవ్వాలని ఉంటే ’వాడుకోండిరా! ఈ లోపల ఎవరైనా వస్తే చూద్దాం. పది పదిహేను రోజులు ఆగమని రిక్వెస్ట్‌ చేయచ్చులే’ అని చెప్పాల్సిందిపోయి, ఇవ్వలేను అని కరాఖండిగా చెప్పటం విచిత్రంగా ఉంది. కొంతమందికి సహాయం చేయాల్సివస్తే ప్రాణం మీదకు వస్తుంది. మనకేదో ఇల్లు ఫ్రీగా ఇచ్చినట్టు, హైదరాబాదులో కూర్చుని ‘ఆ పని చూడరా, ఈ పని చూడరా’ అని ఎన్ని పనులు మీకు పురమాయించటం లేదు. వందా రెండొందలు ఏం అడుగుతాం అని ఎన్నిసార్లు మీ జేబులో డబ్బులు వదిలించుకోలేదు. మీచేత చేయించుకున్నవి అన్నీ మర్చిపోయి ఏమాత్రం మొహమాటం లేకుండా కుదరదు అనేశారు. మన పరిస్థితి వాళ్లకు తెలియదా? కొడుకు వరుసవాడు, అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నాడని కూడా చూడకుండా నో అనేశారు. మనిషి అన్న తరువాత కాస్త ద]యాగుణం, మానవత్వం అనేవి ఉండాలి. మనిషికి మనిషి తోడుగా ఉండాలి అని బోలెడన్ని నీతులు చెబుతారు మీరు. నెత్తీ, నోరూ కొట్టుకుని చెప్పాను... మీరు ఎంతమందికి సహాయం చేసినా మనకు చేయాల్సి వచ్చేటప్పటికి ఒక్కడు కూడా ముందుకు రాడు అని. నా కంఠ శోష తప్పితే మీరు నా మాట ఎప్పుడు విన్నారు?’’ కృష్ణమూర్తిగారి మీద కోపం, భర్త మీద చూపించింది.
ఇంకెవరికైనా అయితే ఇది మామూలుగా అనిపిస్తుందేమో గానీ, విశ్వం లాంటి మనస్తత్వం ఉన్నవాళ్లకి మాత్రం ఊహకి అందని విషయం. భార్య మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోయాడు.
‘‘మీకు తెలియదేమో గానీ ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు. మీ బాబాయి సంగతి మీకు తెలియదేమో గానీ నాకెప్పుడో తెలుసు. ఇటువంటివి మీ ఊహకు అందవు, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. కాసేపు అలా తిరిగి రండి, ఈ లోపల వంట చేస్తాను’’ సముదాయించినట్లుగా అంది. అనవసరంగా భర్త మీద కోపం ప్రదర్శించాను అనుకుందేమో మరి.
విశ్వం దగ్గరలో ఉన్న పార్కుకి వెళదామని బయటకు నడిచాడు. చలికాలం, సాయంకాలం ఏడు కావొస్తుంది. అయినా పెద్దగా చలి లేదు. రోడ్డుమీద జనం ఏదో అర్జెంట్‌ పని ఉన్నట్టు వడివడిగా నడుస్తున్నారు. ఎదురుగుండా పెళ్లి వాళ్ల ఊరేగింపు బ్యాండ్‌ మేళాలతో పెద్దగా సౌండ్‌ చేసుకుంటూ వస్తోంది. విశ్వం ఇవేమీ గమనించే స్థితిలో లేడు. అతని ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి.
విశ్వానికి సుజాత అన్న మాటలు అరిగిపోయిన గ్రామ్‌ఫోను రికార్డులా పదే పదే చెవులలో గింగిర్లు తిరుగుతున్నాయి. బాబాయి చెప్పిన కారణం సుజాతకు అసలేమాత్రం నచ్చలేదు. మననుంచి సహాయం పొందినవాళ్లు, మనకు అవసరం వచ్చినప్పుడు తిరిగి సహాయం చేయాలని భార్య ఆశించింది. అలా ఎందుకు కోరుకోవాలి. అలా కోరుకోవటం వలనే కదా ఈ నిరాశ, ఈ కోపం, అందుకే కదా సుజాత అంత బాధ పడింది. సుజాతే కాదు తను కూడా కొంత నిరుత్సాహానికి గురి అయిన మాట నిజం. విశ్వంకి లోలోపల అంతర్మథనం మొదలైంది.
సుజాత అన్నట్లు పరోపకారం లాంటివి మనలాంటి వారికి తగవా? పక్కింటి వాడి బాధలు పట్టించుకోకుండా ఎప్పుడూ నేనూ, నా కుటుంబం అని గిరి గీసుకుని స్వార్థంతో బతకాలా? లోకం ఏమైనా ఫరవాలేదు, నాకు నా కుటుంబమే ముఖ్యం అనుకుని జీవితం గడపాలా? ఇప్పటివరకూ తను నడచిన మార్గం తప్పా? లోకం ఎలా ఉంటే నేను కూడా అలానే ఉండాలా? నేను మారాలా? విశ్వం మనసు విపరీతమైన సంఘర్షణకు లోనైంది. అలాఅని లోకంలో అందరూ బాబాయి లాగానే ఉంటారని అనుకోవాలా? ఎక్కడో ఒకరు అలా ఉంటే లోకం అంతా స్వార్థ పూరితం అని ఎందుకనుకోవాలి? అతని అంతరంగం అతలాకుతలమైపోతోంది. అస్థిమితంగా ఉంది. పార్కులో నడుస్తున్నాడు కానీ పరిసరాలు గమనించే స్థితిలో లేడు. మననుంచి సహాయం పొందినవాళ్లు తిరిగి మనకు సహాయం చేయకపోతే వాళ్లని తప్పు పట్టటం ఎంతవరకూ సమంజసం. వాళ్లని దుర్మార్గులు అని నిందించడం అర్థం లేనిది. సాయం చేయకపోవటానికి వాళ్ల కారణాలు, వాళ్లకు ఉంటాయి. అడిగే హక్కు మనకు లేదు. మనకు సహాయం చేయాలనిపించింది, చేశాం, అంతే. అందరూ మనలాగానే ఉండాలి, మనలాగానే ఆలోచించాలి అంటే అది ఎలా కుదురుతుంది. ఏమీ ఆశించకుండా మనకు మంచి అనిపించిందీ, మనం చేయగలిగిందీ చేయటమే మన విధి.
ఇలా అనుకున్నాక విశ్వం మనసు ప్రశాంతంగా ఉంది. అప్పటివరకూ ఎంతో సంఘర్షణకులోనైన అతని మనసు- సముద్రపు అలలలో చిక్కుకుని ఊగిసలాడుతున్న పడవ అలల నుంచి బయటపడి ఒడ్డుకి చేరినట్టు- ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. టైం చూశాడు, ఎనిమిది దాటింది. ఇంట్లోవాళ్లు తనకోసం ఎదరుచూస్తూ ఉంటారు అని ఇంటికి బయలుదేరాడు.
భర్త రాక చూసి ‘‘మీరొస్తారని మామయ్యగారు కూడా భోజనం చేయకుండా ఎదరుచూస్తూ కూర్చున్నారు. తొందరగా బట్టలు మార్చుకుని రండి, భోజనం వడ్డిస్తాను’’ అంది సుజాత.
విశ్వం మౌనంగా బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు.
మౌనంగా భోజనం చేస్తున్న కొడుకుని చూసి ‘‘ఏరా! సుజాత అన్న మాటలకు ఇంకా బాధ పడుతున్నావా? ఏదో కృష్ణమూర్తి ఇల్లు ఇవ్వను అనేటప్పటికి, కొంచెం బాధ పడి వాడిమీద వచ్చిన కోపం నీమీద చూపించింది. కృష్ణమూర్తి ఇల్లు ఇచ్చి ఉంటే బావుండేది. మనకు బాగా సౌకర్యంగా ఉండేది. ఏం చేస్తాం? అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? ఊరికే మనసు పాడు చేసుకోకు. ఎక్కడో అక్కడ దొరుకుతుంది’’ అన్నాడు విశ్వం తండ్రి వయసుతో వచ్చిన అనుభవంతో.
‘‘అదేం లేదు నాన్నా. విడిది గురించి ఏం చేయాలీ అని ఆలోచిస్తున్నాను. పాపం సుజాత మాత్రం ఏం చేసింది, పెళ్లి పనులు ఒక్కతే చేసుకోలేక ఎంత కష్టపడిపోతుందో చూస్తూనే ఉన్నాం గదా! ఆ టెన్షన్‌లో ఏదో అంది. దానికి బాధేం లేదు.’’
‘‘ఏమండీ! మన వీధి చివర ఉన్న ఇంట్లో ఒక పోర్షన్‌ ఖాళీగా ఉంది అని అమ్మాయి చెప్పింది. టు లెట్‌ బోర్డు చూసిందట. వాళ్లని అడిగి చూడండి’’ భర్తతో అంది సుజాత.
‘‘సరే రేపు వెళ్లి చూస్తాను.’’
విశ్వం మర్నాడు ఉదయాన్నే టు లెట్‌ బోర్డు ఉన్న ఇంటికి వెళ్లాడు. కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. ఒకే కాలనీలోనే ఉంటున్నా అతనికి ఆ ఇంటి వాళ్లతో పరిచయం లేదు. ఇంటాయనే తలుపు తీశాడు. ఆయనకి సుమారు డెబ్భై ఏళ్లు ఉండవచ్చు. లోపలికి పిలిచి కూర్చోమన్నాడు.
‘‘నా పేరు విశ్వం అండీ. ఈ వీధిలోనే కృష్ణమూర్తిగారి ఇంట్లో ఉంటాను. చిన్న అవసరం ఉండి వచ్చాను’’ చెప్పటం ఆపాడు విశ్వం.
‘‘నా పేరు సుందరం. నాకన్నా చాలా చిన్నవాడివి. ఏకవచనంతో సంభోదిస్తాను ఏమీ అనుకోకు. నిన్ను చూశాను. ఎప్పుడూ మాట్లాడటానికి అవకాశం రాలేదు. సంవత్సరంలో అయిదారు నెలలు విదేశాలలో ఉన్న పిల్లల దగ్గరే ఉండటం వలన కాలనీ వాళ్లతో ఎక్కువ పరిచయాలు కాలేదు. ఇప్పుడు చెప్పు, ఏం పని మీద వచ్చావు?’’
‘‘మా అమ్మాయి పెళ్లి ఈ నెల ఇరవై మూడున, మన కాలనీ కళ్యాణమండపంలోనే పెట్టుకున్నాము. మగపెళ్లివారి విడిది కోసం ఖాళీగా ఉన్న మీ పై పోర్షన్‌ రెండు రోజులు ఇవ్వగలరా అని అడగటానికి వచ్చాను. విడిది దగ్గరలో ఉంటే మాకు సౌకర్యంగా ఉంటుందని అడుగుతున్నాను’’ ఏమంటారో, ఏమనుకుంటారో అని సంశయంగా అడిగాడు విశ్వం.
‘‘చాలా సంతోషం. నువ్వు అడిగే విధానం చూసి ఇంకా ఏదో అనుకున్నాను. ఇంత చిన్నదానికి అంత మొహమాటమా? రెండు రోజులు కాకపోతే నాలుగు రోజులు వాడుకోండి. ఏం ప్రాబ్లమ్‌ లేదు’’ విశ్వం మొహమాటాన్ని పోగొట్టడానికి అన్నట్లు నవ్వుతూ అన్నాడు సుందరంగారు.
‘‘థాంక్స్‌ అండీ. మీతో పరిచయం లేదు, అడగొచ్చో లేదో ఇస్తారో లేదో అని ఎంతో సంశయంతో వచ్చాను. పెళ్లివాళ్లు వెళ్లిపోగానే శుభ్రం చేసి ఇస్తాము’’ సంతోషంగా అన్నాడు.
‘‘భలే వాడివయ్యా నువ్వూ! ఒకే కాలనీలో ఉంటూ ఒకరికి ఒకరు ఈ మాత్రం సహాయం చేసుకోకపోతే ఇంకా బతికి లాభం ఏంటి? మొహమాట పడకుండా వాడుకోండి. రెండు నెలలనుంచీ ఖాళీగా ఉంది కదా! దుమ్ము పట్టింది. పెళ్లికి రెండు రోజులు ముందు కడిగిస్తాను.’’
‘‘మీరు కడిగించడం ఏంటి? నేనే మనిషిని తీసుకుని వచ్చి కడిగిస్తాను. ఇల్లు ఇస్తానన్నారు అదే మహాభాగ్యం.’’
‘‘సరే నీ ఇష్టం’’
‘‘టు లెట్‌ బోర్డు చూసి ఎవరన్నా వస్తే...’’ మధ్యలో ఆపేశాడు.
‘‘ఇరవై రోజుల తరువాతే ఇవ్వగలం అని చెబుతాము. ఇష్టమైన వాళ్లు అప్పటిదాకా ఆగుతారు. లేకపోతే లేదు. అదేం పెద్ద ఇష్యూ కాదులే!’’
అంతలోకి ఆయన భార్య కాఫీ కప్పులతో వచ్చింది.
‘‘మీ అమ్మాయి పెళ్లా... చాలా సంతోషం. మీ వాళ్లని పేరంటాలలో కలుస్తూనే ఉంటాను’’ కాఫీ కప్పు ఇచ్చి లోపలికి వెళ్లిపోయింది.
‘‘మీరు పెద్దవారు, అడగొచ్చో లేదో... అద్దె ఎంతో చెబితే ఏర్పాటు చేస్తాను.’’
‘‘అలా అడగటంలోనే నువ్వు ఎంత మంచివాడివో అర్థం అవుతోంది. మీరు వాడుకునేది మహా అయితే వారం రోజులు- అందులోనూ అమ్మాయి పెళ్లికోసం. అద్దే గిద్దే ఏమక్కరలేదు సంతోషంగా వాడుకోండి. పెళ్లికి మమ్మల్ని పిలవటం మాత్రం మర్చిపోవద్దు’’ నవ్వుతూ అన్నాడు.

‘‘సార్‌... సార్‌...’’ బయటినుంచి కేక.
‘‘వెంకటేశూ... లోపలికిరా’’
వెంకటేశు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు.
‘‘అదిగో ఆ మూల ఉన్న పేపర్లు తీసుకెళ్లు’’
వెంకటేశు అక్కడ ఉన్న పాత దినపత్రికలూ, వారపత్రికలూ అన్నీ కట్ట కట్టి తీసుకెళ్లిపోయాడు.
వెంకటేశు తూకం వేయకుండా, డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్లిపోవటంతో సుందరం గారి వైపు ఆశ్చర్యంగా చూశాడు విశ్వం.
‘‘నేను దినపత్రికలూ అవీ అమ్మను. అమ్మితే వచ్చే రెండు, మూడు వందలు నాకు అవసరమా? ఆ డబ్బు నా కంటే అతనికి అవసరం. అందుకే అలా ఇస్తాను. ఏదో నా శక్తి మేరకు, వీలైనంతలో సహాయం చేస్తుంటాను. ఇలా చేసినప్పుడు వాళ్లు చాలా సంతోషిస్తారు. వాళ్ల మొహంలో సంతోషం చూడడం నాకు చాలా బాగుంటుంది.’’
‘‘ఏమాత్రం పరిచయం లేకపోయినా అడగంగానే మీ ఇల్లు వాడుకోవడానికి ఒప్పుకున్నప్పుడే అర్థం అయింది మీ మనస్తత్వం. మీరు చేసిన సహాయానికి మేము ఎప్పుడూ ఋణపడి ఉంటాము. నేనూ నా భార్యా శుభలేఖతో వచ్చి కలుస్తాం వస్తానండీ, నమస్కారం’’ అని చెప్పి విడిది ప్రాబ్లమ్‌ తీరిందని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు విశ్వం.
విశ్వం నిన్నటి జ్ఞాపకాలలోకి వెళ్లాడు. తను ఎంత మధనపడ్డాడు. సుందరంగారిని చూసిన తరువాత తన ఆలోచనలూ, తన భావాలూ కరెక్టే అనిపించింది. లోకంలో కృష్ణమూర్తి బాబాయి లాంటివాళ్లే కాదు, సుందరంగారి లాంటి విశాల హృదయం గల వాళ్లూ, ఒకరికి ఉపకారం జరుగుతుంది అనుకుంటే కొంచెం నష్టం కష్టం అయినా భరించి సహాయం చేయడానికి వెనుకాడని వాళ్లూ కూడా ఉన్నారు అని మరోసారి నిరూపణ అయింది. సుందరం లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి గానీ, స్వార్థపరులను చూసి మనం కూడా అలా ఉండాలని ఎందుకు కోరుకోవాలి.
విశ్వం రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సుజాత, భర్త ఇంట్లో అడుగు పెట్టగానే ‘‘ఏమన్నారు? ఇస్తామన్నారా, లేకపోతే వీళ్లు కూడా ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నారా?’’ అని అడిగింది.
‘‘వాళ్లు చాలా మంచి వాళ్లు సుజాతా! పెళ్లి అనంగానే వెంటనే సంతోషంగా వాడుకోమన్నారు. అద్దె ఇస్తాను అంటే వద్దన్నారు. మనిషికి మనిషి తోడుగా ఉండాలి, మనకున్న దాంట్లో కొద్దో గొప్పో అవసరం ఉన్నవాళ్లకి సహాయం చేయాలి అని మనస్ఫూర్తిగా నమ్మటమే కాకుండా ఆచరణలో పెట్టే మనుషులు. ఆయనతో మాట్లాడుతుంటే నా అంతరంగం మరింత జాగృతం అయింది. లోకంలో మంచి మనుషులకి కొదవలేదు. సుందరం లాంటి వారు ఆదర్శంగా తీసుకోదగ్గ వారు’’ ఆనందంగా అన్నాడు విశ్వం.
సరిగ్గా అప్పుడే టీవీలో కరోనా వాక్సినేషన్‌ ప్రారంభం సందర్భంగా ప్రసారం అవుతున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీగారు, గురజాడ వారి పద్యం చదువుతున్న దృశ్యం వస్తోంది...
సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయ్‌, దేశమంటే మట్టి కాదోయ్‌,   దేశమంటే మనుషులోయ్‌. అది చూసి టైమింగ్‌ బలే కుదిరింది అని కుటుంబ సభ్యులందరూ మనసారా నవ్వుకున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు