IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పుర్‌లో గతేడాది 33% మందికి దక్కని కొలువులు

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివిన 33 శాతం మందికి కొలువులు దక్కలేదని ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది.

Published : 29 Apr 2024 20:23 IST

IIT Kharagpur | ఖరగ్‌పూర్‌: ప్రఖ్యాత సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌కు (IIT Kharagpur) సంబంధించి ఆసక్తికర విషయం వెలుగు చూసింది. సాధారణంగా ఐఐటీల్లో చదివిన వారికి ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగం, రూ.లక్షల్లో ప్యాకేజీ వంటివే వింటూ ఉంటాం. అందుకు భిన్నంగా గతేడాది (2022-23) ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న విద్యార్థుల్లో 33 శాతం మందికి కొలువులు రాకపోవడం గమనార్హం. గ్లోబల్‌ ఐఐటీ అలుమ్ని సపోర్ట్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు ధీరజ్‌ సింగ్‌ సమాచార హక్కు చట్టం (RTI) కింద కళాశాలను వివరాలు కోరగా ఈవిషయం వెల్లడైంది.

2022-23 ప్లేస్‌మెంట్‌ సీజన్‌కు 2,490 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. అందులో 1675 మందికే కొలువులు దక్కాయి. అందులో 574 మందికి ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌ రావడం గమనార్హం. 2021-22లో 2,256 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 1615 మంది విద్యార్థులు కొలువులు సాధించారు. 404 మంది ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్స్‌కు ఎంపికైనట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22 ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వారి సగటు వేతనం ఏడాదికి రూ.16 లక్షలు కాగా.. 2022-23లో ఆ మొత్తం రూ.18 లక్షలుగా ఉందని విద్యా సంస్థ పేర్కొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని