AP SSC Results: ఏపీలో ‘పది’ ఫలితాలు.. పార్వతీపురం టాప్.. ఆఖరున నంద్యాల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. ఫలితాల్లో పార్వతీపురంమన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

Updated : 06 May 2023 12:42 IST

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి..

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో వీటిని విడుదల చేశారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 18 వరకు పరీక్షలు జరిగాయి. మొత్తంగా 6,09,081 మంది రెగ్యులర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 6,05,052 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 3,09,245 మంది బాలురు, 2,95,807 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్‌ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 72.26 శాతంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలుర కన్నా బాలికలే 6.11 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 5 శాతం ఉత్తీర్ణత పెరిగిందని బొత్స వెల్లడించారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 933 పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా, 38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్‌ కాలేదు (సున్నా శాతం). జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 60.39 శాతం ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా ఆఖరున ఉంది. ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అత్యధికంగా 95.25 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. ఇది కచ్చితంగా ప్రభుత్వం గర్వించదగిన విషయం. ఫలితాలన్నీ ఎస్‌ఎస్‌సీ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి’’

జూన్‌ 2 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ..

‘‘పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జూన్‌ 2వ తేదీ నుంచి 10 వరకు జరపాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ కూడా త్వరలోనే విడుదల చేస్తాం. అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు మే 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుంతో మే 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోరుకునే విద్యార్థులు ఈ నెల 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలి’’    

వారికి ప్రత్యేక తరగతులు..

‘‘పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా కొన్ని పాఠశాలలను గుర్తించాం. వాటిలో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది’’ అని బొత్స వివరించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు