IPL 2024: మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్‌.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్‌

భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌కు సోషల్‌ మీడియాలో బాడీ షేమింగ్‌ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.

Published : 05 May 2024 10:28 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ ఆటగాడు పార్థివ్‌ పటేల్‌ (Parthiv Patel) బాడీ షేమింగ్‌కు గురయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో బెంగళూరు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) ఘోరంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో జట్టు అద్భుత విజయం సాధించినా.. మ్యాక్సీ మాత్రం ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు విరామం కూడా తీసుకున్నాడు. దీంతో అతడి ఆటతీరుపై పార్థివ్‌ స్పందిస్తూ.. ‘‘గ్లెన్ మ్యాక్సీ.. ఐపీఎల్‌ చరిత్రలో ఓవర్‌రేటెడ్‌ ప్లేయర్‌ అతడే’’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. గత కొన్ని ఐపీఎల్‌ సీజన్లలో అతడి ప్రదర్శన తీసికట్టుగా ఉందని పార్థివ్‌ పేర్కొన్నాడు. 

దీంతో మ్యాక్స్‌వెల్ అభిమాని ఒకరు భారత మాజీ క్రికెటర్‌పై బాడీ షేమింగ్‌ కామెంట్‌ పెట్టాడు. ‘‘ఎవరైతే 5 అడుగుల 2 అంగుళాల కంటే తక్కువ ఉంటారో.. ఆ వ్యక్తి అభిప్రాయాలను పట్టించుకోరు’’ అని పోస్టు చేశాడు. దీనిపై పార్థివ్‌ పటేల్ ఘాటుగానే స్పందించాడు. ‘‘నేను 5"3... ఇప్పుడు ఓకేనా?’’ అని రిప్లయ్‌ ఇచ్చాడు. మరొకరు.. ‘‘అతడి (మ్యాక్సీ) ట్రోఫీలు నీకంటే ఎత్తు’’ అంటూ పోస్టు పెట్టాడు. దానికి బదులుగా ‘‘ఇది కూడా ఒకసారి జరిగింది. ట్రోఫీ ఎప్పటికీ నాకంటే పెద్దదే’’ అని పోస్టు చేశాడు. ‘2024ను చూద్దాం’ అంటూ సవాల్ విసిరాడు. 

కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై ఎందుకంత చర్చ?: గావస్కర్

‘‘ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) భారీగా పరుగులు చేస్తూ ఆరెంజ్‌ క్యాప్‌ను తన వద్దకు తెచ్చుకున్నాడు. కానీ, అతడి స్ట్రైక్‌రేట్‌పై మాత్రం నిరంతరం చర్చ కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో కామెంట్లను చూస్తున్నాం. కానీ, ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌లోనూ కామెంటేటర్లు ఎక్కువగా దీని గురించే మాట్లాడుతున్నారు. బెంగళూరు మ్యాచ్‌ జరిగిన తర్వాత డజన్లకొద్దీ ఆ కార్యక్రమాలను ప్రసారం చేయడం సరైంది కాదు. ఇక నుంచైనా అలాంటి చర్చలను ఆపేస్తారని ఆశిస్తున్నా’’ అని భారత మాజీ క్రికెటర్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఇలాంటి కామెంట్లపై కోహ్లీ స్పందించిన సంగతి తెలిసిందే. బయట నుంచి వచ్చే వ్యాఖ్యలను పట్టించుకోనని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు 11 మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి ఏడో స్థానానికి ఎగబాకింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని