Rana: ఇది రజనీకాంత్‌ స్టైల్‌ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌ హీరో రజనీకాంత్‌, ప్రభాస్‌ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే?

Published : 05 May 2024 10:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వేట్టయాన్‌’ రజనీకాంత్‌ స్టైల్‌లో సాగే సినిమా కాదని, అదొక విభిన్నమైన చిత్రమని టాలీవుడ్‌ నటుడు రానా (Rana Daggubati) తెలిపారు. ఆ మూవీలో తాను భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విశేషాలు పంచుకున్నారు. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898AD) సినిమా, రాజమౌళి సక్సెస్‌పైనా స్పందించారు.

‘‘రజనీకాంత్‌ సర్‌తో కలిసి నటించాలని ఎప్పుడూ అనుకునేవాణ్ని. ఆ కల ‘వేట్టయాన్‌’ (vettaiyan)తో నెరవేరింది. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జె. జ్ఞానవేల్‌ (TJ Gnanavel) కథ చెప్పగానే ఇంప్రెస్‌ అయ్యా. జ్యుడిషియల్‌, పోలీసు వ్యవస్థ తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఎంతో పరిశోధించి ఈ స్టోరీ రాశారు. రజనీకాంత్‌ (Rajinikanth) స్టైల్‌ సినిమా కాదిది. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన్న చిత్రాన్ని ఎంపిక చేసుకున్నందుకు, అందులో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) సర్, ఫహద్‌ ఫాజిల్‌ కూడా ఇందులో నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉంది. అక్టోబరులో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు’’ అని వివరించారు.

‘కల్కి 2898 ఏడీ’ గురించి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ‘కల్కి’కి అందరూ కనెక్ట్‌ అవుతారు. హాలీవుడ్‌ ‘అవెంజర్స్‌’ రేంజ్‌లో ఉంటుంది. ఓ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో నేను పాల్గొనడం వల్ల ఈ చిత్రంలో నటించానని అనుకున్నారు. కానీ, నేను ఇందులో యాక్ట్‌ చేయలేదు’’ అని తెలిపారు. రాజమౌళి విజయ రహస్యంపై మాట్లాడుతూ.. ‘‘నేను ఆయన (Rajamouli)తో కలిసి ఆరేళ్లు ప్రయాణించా. మార్కెట్‌ ఎలా ఉంది? రెమ్యూనరేషన్ ఎంత? అనే విషయాలను ఆయన పట్టించుకోరు. అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనుకుంటారు. దాని కోసం రెండేళ్లైనా, పదేళ్లైనా కష్టపడతారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని