logo

దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు.

Updated : 05 May 2024 11:25 IST

ఈనాడు, చిత్తూరు, పలమనేరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ పలమనేరు వస్తున్నారని వైకాపా నేతలు సంబరపడ్డారు. స్థానిక సమస్యలు లేవనెత్తి ప్రజల మనసులు చూరగొంటారని ఆశపడ్డారు. రానున్న వారం రోజుల ప్రచారంలో వీటినే అస్త్రాలుగా మలుచుకుని ప్రజలకు వివరించాలనుకున్నా వారి ఆశలపై సీఎం నీళ్లు చల్లారు. ఒక్క అంశాన్నీ ప్రస్తావించకపోవడంతో జనసమీకరణ చేసి రప్పించిన వ్యక్తులు సైతం ఉసూరుమంటూ వెనుదిరిగారు. దీంతో అధికార పార్టీ నాయకులు సైతం ఢీలాపడ్డారు. జగన్‌ పర్యటన సందర్భంగా శనివారం పలమనేరు పట్టణంలో ఇదీ పరిస్థితి. ఏనుగుల సమస్యను అరికడతానని, సాగునీటి సమస్యను నివారిస్తానని, పట్టణంలో నీటిఎద్దడి లేకుండా చూస్తానని సీఎం జగన్‌ హామీ ఇస్తారని భావించినా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుదిరిగారు. ప్రసంగం ఆసాంతం సొంత డప్పు కొట్టుకోవడానికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేల్చడానికే పరిమితమయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట కు జగన్‌ వస్తారని వైకాపా నేతలు చెప్పినప్పటికీ ఆయన దాదాపు గంటన్నర ఆలస్యంగా వచ్చారు. ఎండ వేడిమిని తట్టుకోలేక కొందరు, ఆ తర్వాత కురిసిన వర్షంతో మరికొందరు తిరుగుముఖం పట్టారు. సభా ప్రాంగణం దాదాపు సగం ఖాళీ అయింది.

సభా స్థలి నుంచి వెనుతిరుగుతున్న జనం


సీఎం సభతో ప్రజలకు కష్టాలు

రోడ్డు మీద ఆగిన వాహనాలు

గంగవరం హెలిపాడ్‌ నుంచి సీఎం పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చారు. ఈ సందర్భంగా మదనపల్లెరోడ్డు, బెంగళూరురోడ్డు, చిత్తూరు రోడ్లను పోలీసులు పూర్తిగా మూసేశారు. పట్టణంలోకి రావడానికి దారి లేకుండా చేశారు. ఇక పట్టణంలోని రెక్కమాను సర్కిల్‌ వద్ద కూడా ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాలను దారి మళ్లించి బైపాస్‌ మీదుగా పంపారు. మరోవైపు సీఎం సభ వద్ద విచిత్ర పరిస్థితి కనిపించింది. ఆయన మాట్లాడుతుండగానే ప్రజలు వెనుదిరిగారు. సభాస్థలి నుంచి వారు పెద్దసంఖ్యలో తిరుగుముఖం పట్టారు. అది కూడా ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు.


సభ జరుగుతుండగానే ఏరులై పారిన మద్యం

పంపిణీకి మద్యం బాక్సులు తీసుకొస్తున్న వైకాపా నాయకులు

ఓ పక్క సీఎం సభ జరుగుతుండగానే ఇతర ప్రాంతాల నుంచి కార్యకర్తలకు పట్టణానికి సమీపంలో మద్యం సీసా, బిర్యానీ ప్యాకెట్‌ అందించారు. ఓ సీఎం ప్రసంగిస్తుండగా మందు బాబు సమీపంలోని ఖాళీ ప్రదేశాలు, చెట్ల పక్కన మద్యం తాగుతూ కనిపించారు. కర్ణాటక టెట్రాప్యాకెట్లు పెద్దసంఖ్యలో అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని