Canada: నిజ్జర్‌ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో

Canada: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందించారు.

Updated : 05 May 2024 14:45 IST

టొరంటో: కెనడాలో చట్టబద్ధమైన పాలన ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) అన్నారు. తమ దేశం స్వతంత్ర, బలమైన న్యాయవ్యవస్థ కలిగి ఉందన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు వ్యవహారంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ట్రూడో తెలిపారు. కెనడాలో (Canada) ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందన్నారు. వివక్షాపూరిత, హింసాయుత వాతావరణం నుంచి రక్షణ వారి హక్కు అని వ్యాఖ్యానించారు. నిజ్జర్‌ మృతి తర్వాత కెనడాలోని ఓ వర్గం అభద్రతతో జీవిస్తోందని చెప్పుకొచ్చారు.

నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ గత ఏడాది సెప్టెంబరులో ట్రూడో (Trudeau) చేసిన నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. తాజాగా నిజ్జర్‌ కేసులో భారత్‌కు చెందిన ముగ్గురు నిందితులు కరణ్‌ప్రీత్‌ సింగ్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ముగ్గురు నిందితులకు పాక్‌లోని ఐఎస్‌ఐతో సంబంధాలున్నట్లు భారత వర్గాలు అనుమానిస్తున్నాయి. కొంతమంది గ్యాంగ్‌స్టర్లు కెనడాలో (Canada) ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడినట్లు పలు సందర్భాల్లో బహిర్గతమైంది. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్‌ ఐఎస్‌ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నట్లు సమాచారం. దీని గురించి పలుసార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని ప్రభుత్వంలోని ఉన్నతవర్గాలు వెల్లడించాయి. తాజా కేసులో మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది.

ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని (Canada) అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని