IPL 2024: గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్

బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్‌ కూడా ప్లేఆఫ్స్‌ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది.

Updated : 05 May 2024 13:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్‌ను నడిపిస్తున్న తమ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌పై (Shumban Gill) స్టార్‌ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ప్రశంసలు కురిపించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును అద్భుతంగా నడిపించే సత్తా అతడికి ఉందని వ్యాఖ్యానించాడు. బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మిల్లర్ మాట్లాడాడు. ప్రస్తుత సీజన్‌లో తమ జట్టు ప్రదర్శన గొప్పగా లేదని.. చాలా మ్యాచుల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలవడం నిరాశకు గురి చేసిందని తెలిపాడు. 

‘‘శుభ్‌మన్‌ గిల్ అద్భుతమైన ఆటగాడు. ఇంకా అతడు కుర్రాడే. నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయితే, కెప్టెన్సీ పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడని అనుకుంటున్నా. త్వరగానే జట్టును నడిపే బాధ్యతలకు అలవాటు పడ్డాడు. మేం ఈ సీజన్‌లో చాలా స్వల్ప తేడాతో కొన్ని మ్యాచ్‌లను కోల్పోయాం. సీనియర్‌ పేసర్ మహమ్మద్ షమీ లేని లోటు కనిపిస్తోంది. పవర్‌ ప్లే ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థి రన్‌రేట్‌ను అదుపులో ఉంచగల బౌలర్. అలాంటి స్టార్‌ పేసర్‌ లేకుండా ఆడటం కూడా మాకు కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారు. బెంగళూరు జట్టు మాత్రం కట్టుదిట్టంగా బంతులేసి కట్టడి చేసింది. కేవలం మూడు ఓవర్లలోపే 50+ స్కోరు కొట్టేశారు. దాంతో మాకు అవకాశం లేకుండా పోయింది’’ అని మిల్లర్ వ్యాఖ్యానించాడు. 

180 చేసుంటే బాగుండేది: గిల్

‘‘వికెట్ చాలా క్లిష్టంగా మారింది. ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్‌కు సహకరించలేదు. కనీసం 180 పరుగులు చేసి ఉంటే మంచి లక్ష్యమయ్యేది. పవర్‌ ప్లేలో మా బ్యాటింగ్‌ బాగోలేదు. అలానే బౌలింగ్‌ కూడా దెబ్బతింది. అదే వ్యత్యాసం. తర్వాత మ్యాచ్‌లో మేం జీరో నుంచి ప్రారంభిస్తాం. ఓటమి నుంచి త్వరగా కోలుకుని ఆడాల్సిన అవసరం ఉంది’’ అని గుజరాత్ కెప్టెన్ గిల్ తెలిపాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ కేవలం 147 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరు కేవలం 13.4 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని