ఏకాగ్రతను నిలపలేకపోతున్నారా?

చదవాల్సిన అంశాలెన్నో ఉన్నా... పాఠాల మీద దృష్టిసారించలేరు కొంతమంది విద్యార్థులు. సమయం కరిగిపోతున్నా శ్రద్ధగా చదవలేకపోతుంటారు. ఈ చిక్కుల నుంచి బయటపడటానికి ఏయే

Published : 19 Jan 2022 11:06 IST

చదవాల్సిన అంశాలెన్నో ఉన్నా... పాఠాల మీద దృష్టిసారించలేరు కొంతమంది విద్యార్థులు. సమయం కరిగిపోతున్నా శ్రద్ధగా చదవలేకపోతుంటారు. ఈ చిక్కుల నుంచి బయటపడటానికి ఏయే మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!  

ఏకాగ్రత లోపించడం అనేది... ఎంతోమంది విద్యార్థులను వేధిస్తోన్న సమస్య. దీంతో విపరీతమైన ఒత్తిడికి గురై అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటోన్నవాళ్లూ ఉన్నారు. దీన్నుంచి బయటపడాలంటే..

స్పష్టత అవసరం: చదవాల్సిన అంశాలూ, చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అన్నింటినీ త్వరగా ముగించాలనుకుంటారు కొందరు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పుస్తకం పట్టుకుంటే ఆలోచనలన్నీ వివిధ విషయాల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి అనే విషయాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాతే చదవడం మొదలుపెడితే మంచిది. స్పష్టత లేకపోతే ఏకాగ్రత ఎంతమాత్రం కుదరదు. రకరకాల విషయాల మీదకు దృష్టి మరలుతుంది.

ప్రణాళిక ఉండాలి: ఏ పని చేయడానికైనా ముందుగా ప్రణాళిక వేసుకుంటే సానుకూల ఫలితాలను సాధించవచ్చు. సాధారణంగా చదవాల్సిన సబ్జెక్టులు చాలా ఉంటాయి. సమయం తక్కువగా ఉంటుంది. లేదా కొన్ని సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. మరికొన్నింటికి తక్కువ సమయం అవసరం పడొచ్చు. కాబట్టి ముందుగా టైమ్‌టేబుల్‌ వేసుకుంటే దాని ప్రకారం సమయాన్ని విభజించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక సబ్జెక్టు చదువుతుంటే మరో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి. దీంతో దేని మీదా దృష్టిని నిలపలేక ఇబ్బందిపడొచ్చు. ఇలాంటి అవాంతరాలు రాకుండా ఉండాలంటే ప్రణాళిక వేసుకోవడమే సరైన పద్ధతి.

రాసుకుంటే మంచిది: రకరకాల ఆలోచనలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. కానీ వాటి వల్ల ఏకాగ్రత లోపించి ఒక్కోసారి చదువు ముందుకు సాగదు. ఇలాంటప్పుడు ఒక పని చేయొచ్చు. వచ్చిన ఆలోచనలు ఒకచోట రాసుకోవచ్చు. వాటిలో నుంచి పనికి వచ్చే వాటిని అమలు చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఒత్తిడికి గురిచేసేవి ఉంటే.. వాటిని పదేపదే గుర్తుచేసుకోకుండా ఉండాలి.

పెద్ద లక్ష్యాలు వద్దు: చదవడానికి సరైన పద్ధతిని ఎంచుకోవడం వల్ల ఏకాగ్రతకు భంగం కలగకుండా చూసుకోవచ్చు. అలాగే ఒకేసారిగా పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడం వల్ల ఒత్తిడికి గురై ఏకాగ్రతను కోల్పోవచ్చు. ఉదాహరణకు ప్రతి సబ్జెక్టులోనూ ఒక్కో పాఠం చదివేయాలి అనే పెద్ద లక్ష్యానికి బదులుగా.. ఒక సబ్జెక్టులో ఒక పాఠం పూర్తిచేయాలనే చిన్న లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దాన్ని సాధించిన తర్వాతే మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఇబ్బంది ఉండదు.  

విశ్రాంతీ తీసుకోవాలి: తగినంత విశ్రాంతి, నిద్ర లేకుండా చదివితే సమయం ఆదా అవుతుందనుకుంటారు కొందరు విద్యార్థులు. ఇలా ఆలోచించడం సరికాదు. ఎప్పుడు చేయాల్సిన పనులను అప్పుడే పూర్తిచేయాలి. సరైన సమయానికి విశ్రాంతి తీసుకోకుండా ఏకధాటిగా చదవడం వల్ల కూడా బాగా అలసిపోతారు. దీంతో చదువు మీద దృష్టి పెట్టలేరు. మరింత సమయం వృథా అవుతుంది. కాబట్టి వేళకు విశ్రాంతి తీసుకోవడానికీ ప్రాధాన్యమివ్వాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని