నేర్పుగా.. నేర్చుకో!

రాత పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ లాంటి ప్రక్రియల్లో నెగ్గేందుకు విద్యార్థులు కళాశాల దశ నుంచే సాధన చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియలకు అతీతంగా కార్పొరేట్‌ సంస్థలు విద్యార్థుల్లో కొన్ని ప్రత్యేక నైపుణ్యాల కోసం ఎదురుచూస్తుంటాయి. అలాంటివాటిలో విధేయత, వినయం ముఖ్యమైనవి. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అంతర్లీనంగా నియామక

Published : 07 Apr 2022 00:39 IST

ప్రజెంటేషన్‌ స్కిల్స్‌:19

రాత పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ లాంటి ప్రక్రియల్లో నెగ్గేందుకు విద్యార్థులు కళాశాల దశ నుంచే సాధన చేస్తుంటారు. అయితే ఈ ప్రక్రియలకు అతీతంగా కార్పొరేట్‌ సంస్థలు విద్యార్థుల్లో కొన్ని ప్రత్యేక నైపుణ్యాల కోసం ఎదురుచూస్తుంటాయి. అలాంటివాటిలో విధేయత, వినయం ముఖ్యమైనవి. ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అంతర్లీనంగా నియామక సంస్థలు అభ్యర్థి వైఖరిని పరీక్షిస్తాయి. ఇతర అంశాలతో పాటు ఈ నైపుణ్యాన్నీ గమనిస్తాయి.

కొన్నిసార్లు సమావేశాల్లోనో, వ్యక్తిగత చర్చల్లోనో మన ప్రమేయం లేకుండా కొన్ని అర్థం లేని పదాలూ, విషయాలూ సంభాషణల్లో దొర్లుతుంటాయి. ఈ మాటలు ఎదుటివారిని నొప్పించి మీలో వినయ విధేయతలు లోపించాయనే భావన వారికి కలిగించే అవకాశాలున్నాయి. చెడు పేరు యాదృచ్ఛికంగా, మీ ప్రమేయం లేకుండా రావడమంటే మీ ప్రవర్తనపై మీ నియంత్రణ తప్పిందని చెప్పవచ్చు. వినయ విధేయతలను నైపుణ్యంగా భావించి, అభివృద్ధి చేసుకుంటే ప్రతి వ్యవహారంలోనూ విజయం సాధించడానికి ఒక వనరుగా ఉపయోగపడుతుంది.  

ఏమిటివి?

చాలామంది శక్తిసామర్థ్యాలు సరిపోవని తెలిసినా కార్యక్రమాలు ప్రారంభిస్తుంటారు. లక్ష్యంలో విఫలమైతే దాన్ని ఇతర పరిస్థితులకు ఆపాదిస్తుంటారు. ఇతరుల సహాయ సహకారాలను పొందడం, విశాల దృక్పథంతో ఇతరులను తన పరిధిలోకి ఆహ్వానించడం ఒక అనుకూల సంకేతం.  

వినయంగా ఉండటమంటే తగ్గి ఉండటమనీ, ఆత్మవిశ్వాసం లేకపోవడమనీ కాదు. మనకు తెలియని విషయాలను తెలుసుకోవడానికీ, ఇతరుల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికీ ఈ నైపుణ్యం అవసరం. ఇది నాయకత్వానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.  

ఈ నైపుణ్యాన్ని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని మెలకువలు పాటించాలి.

ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం

మీరు చేపట్టే పనుల సాధనకు ఇతరుల అభిప్రాయాలను ఆహ్వానించి, వారి సూచనలూ, సలహాలూ తీసుకోడానికి అంగీకరించండి. వారి అభిప్రాయాలు అనుకూలమైనవైనా కాకపోయినా పర్వాలేదు. ప్రతికూల అభిప్రాయాలు మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తాయి. వృత్తిలో ఎదగడానికీ, మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని ఇతరులతో ఎలా మెరుగ్గా పని చేయాలో తెలుసుకోవడానికీ ఈ ‘ఫీడ్‌ బ్యాక్‌’ ఉపయోగపడుతుంది. మీ స్థాయిని పెంచుకోవడానికి సహాయపడుతుంది.


* మీ బలాలూ, బలహీనతలూ, పరిమితులను గుర్తించండి.  

* లక్ష్య సాధనలో మీ అహాన్ని నియంత్రిస్తూ ఇతరుల బలాలూ, సామర్థ్యాలను మాత్రమే తీసుకుని వారి సహకారాన్ని పొందండి.

‌* ఇతరుల నుంచో, బయటి ప్రపంచం నుంచో నిరంతరం నేర్చుకోవాలనే తపనతో ఉండండి.


పొరపాట్ల నుంచి నేర్చుకోవడం

వృత్తిలోనూ, దినచర్యలోనూ పొరపాట్లు సహజం. అయితే ప్రతి పొరపాటు నుంచీ నేర్చుకోగలగాలి. మీరు ఒక బృందంతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏ సభ్యుని పొరపాటుకైనా మీతో పాటు జట్టులోని సభ్యులందరూ బాధ్యత తీసుకోగలగాలి. శిక్షణలోని లోపం వల్లనో, కమ్యూనికేషన్‌ లోపం వల్లనో పనిలో తప్పులు జరగొచ్చు. పొరపాటు నుంచి నేర్చుకోవడం, దాన్ని మళ్లీ దొర్లనీయకుండా చూడటం మీ దృక్పథాన్నీ, ఆలోచనా పరిధి విస్తృతినీ తెలియజేస్తుంది.  

భిన్నాభిప్రాయాలను స్వీకరించడం  
విద్యార్ధులైనా, ఉద్యోగులైనా ఒక జట్టుగా పనిచేస్తున్నపుడు ప్రతి వ్యక్తిలోనూ విభిన్న దృక్కోణాలు కనిపిస్తుంటాయి. వాటిని గుర్తించడం ముఖ్యం. ఒక లక్ష్య సాధనలో ఇతరులకు మీకంటే భిన్నాభిప్రాయాలుంటే వారి అభిప్రాయాలను తీసుకుని మీ అభిప్రాయాలతో, ఆలోచనలతో క్రోడీకరించండి. ఇది మీరు ఇతరుల అభిప్రాయాలను అంగీకరిస్తున్నారని తెలుపుతుంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని