ఇండియన్‌ ఎకానమీ.. ఇలా చదువుదాం!

గ్రూప్స్‌ సన్నద్ధతలో అభ్యర్థులంతా కాస్త భయపడేది ఎకానమీ విషయంలోనే. నిజానికి సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. మరి గ్రూప్స్‌ పరీక్షలకు ఇండియన్‌

Updated : 13 Apr 2022 06:25 IST

గ్రూప్స్‌ ప్రత్యేకం

గ్రూప్స్‌ సన్నద్ధతలో అభ్యర్థులంతా కాస్త భయపడేది ఎకానమీ విషయంలోనే. నిజానికి సరైన ప్రణాళిక ఉంటే ఈ సబ్జెక్టు చదవడం అంత కష్టమేమీ కాదు. ఏది, ఎంతవరకు, ఎలా చదవాలనే విషయం తెలుసుకుంటే ప్రిపరేషన్‌ సులువుగా సాగిపోతుంది. మరి గ్రూప్స్‌ పరీక్షలకు ఇండియన్‌ ఎకానమీ (భారత ఆర్థిక వ్యవస్థ)ను ప్రిలిమ్స్‌ కోసం ఎలా చదువుకోవాలో తెలుసుకుందామా! 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి భారతదేశ ఆర్థిక పయనం మొదలయింది. అందుకే విద్యార్థులు కూడా చదవటం అక్కడి నుంచే మొదలుపెట్టాలి. స్వాతంత్య్ర కాలం నాటి ఆర్థిక పరిస్థితులూ, పంచవర్ష ప్రణాళికలూ మనకు ఎందుకు అవసరమయ్యాయి, అవి ఎలాంటి విజయాలు సాధించాయి, ఏ విషయాల్లో వెనకబడ్డాయి... ఇలా ప్రతిదీ చదవాల్సి ఉంటుంది. జాతీయాదాయం, జీడీపీ లెక్కింపు, తలసరి ఆదాయం, తలసరి వినియోగం, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానాలు, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. 

ఆ తర్వాత 1991 కాలం నాటి ఆర్థిక సంస్కరణలు మరో ప్రధానమైన అంశం. దేశ దశనూ, దిశనూ మార్చిన నాటి ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయాలి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌), భూ సంస్కరణలు ముఖ్య విషయాలు. ఆనాటి ఆ విధానాలే నేటి మన ఆర్థిక పరిస్థితికి పునాది. అందువల్ల వాటి గురించి ప్రతి అభ్యర్థీ క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

నీతిఆయోగ్‌ ఏర్పాటు, విధివిధానాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థ, వ్యవసాయం అంశాలపై పట్టు సాధించాలి. దేశంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల గురించి గ్రహించాలి. కేంద్రప్రభుత్వ పథకాలైన నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి వాటి గురించి చదవాలి. బడ్జెట్‌,ఎకనమిక్‌ సర్వేలో ముఖ్యమైన అంశాలు, కేటాయింపుల గురించి అవగాహన అవసరం. 

సొంత నోట్సుతో..

ఎకానమీ అనే కాదు, ఏ సబ్జెక్టు చదివినా సొంత నోట్సు రాయడం తప్పనిసరి. అయితే చాలామంది అభ్యర్థులు నోట్సు రాసుకునేటప్పుడు ఏది ముఖ్యమైన పాయింటో, ఏది అవసరం లేనిదో తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. ఒక అంశం ప్రాధాన్యం మనకు అర్థం కావాలంటే పాత ప్రశ్నపత్రాలు చూడటం ఒక్కటే దారి. తొలుత సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ సిలబస్‌లో ఏ సంవత్సరం, ఏ టాపిక్‌ నుంచి, ఎన్ని మార్కులకు ప్రశ్నలొచ్చాయనే విషయాన్ని గుర్తించాలి. దీనివల్ల మనం టాపిక్స్‌కు అలవాటుపడతాం. ఆ తర్వాత ఏ పాఠం ఎంతవరకు చదవాలనే విషయం మనకే అర్థమైపోతుంది. దానివల్ల అనవసర విషయాల జోలికి పోకుండా విలువైన సమయం ఆదా అవుతుంది. 

చాలామంది అభ్యర్థులు ‘కోచింగ్‌ సెంటర్లలో ఇచ్చే మెటీరియల్‌ ప్రిపరేషన్‌కు సరిపోతుంది’ అనుకుంటారు. ఇది పొరపాటు. పాఠ్యపుస్తకాలు చదవడం తప్పనిసరి. మొత్తం అన్ని టాపిక్స్‌నూ పూర్తిగా నేర్చుకున్నాక వీలైనన్ని మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు సాధన చేయాలి. ఏదైనా బిట్‌ తప్పుగా జవాబు రాశామంటే ‘ఎందుకు పొరపాటు చేశాం?’ అనే విషయాన్ని గుర్తించాలి. అవసరం అయితే మళ్లీ ఆ చాప్టర్‌ చదవాలి. ఇలా తప్పుల నుంచి నేర్చుకుంటూ సమగ్రంగా సన్నద్ధమై పరీక్ష రాస్తే విజయం సిద్ధిస్తుంది. లక్ష్యంగా పెట్టుకున్న పోస్టుల్లో ఒకటి కచ్చితంగా మీదవుతుంది!

అపోహ: ఎకానమీలో చాలా అంకెలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. 

నిజం: అన్నీ అవసరం లేదు, ముఖ్యమైనవి గుర్తుంటే చాలు. ఉదాహరణకు స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో స్త్రీ,పురుష నిష్పత్తి, శిశు మరణాల సగటు వంటివి ఈ కోవలోకి వస్తాయి.  

అపోహ: బడ్జెట్‌ గణాంకాలు మొత్తం కంఠస్థం చేయాలి. 

నిజం: ప్రధాన శాఖలకు ఇచ్చిన కేటాయింపులు మాత్రమే అవసరం. అలా కాకుండా బడ్జెట్‌లో ప్రతి అంశమూ చదివితే ఏదీ పూర్తిగా గుర్తుపెట్టుకోలేక ఇబ్బంది పడాల్సివస్తుంది!

చదవాల్సిన పుస్తకాలు

ఇంగ్లిష్‌ మీడియం 

 * ఇండియన్‌ ఎకానమీ బై దత్‌ అండ్‌ సుందరమ్‌

తెలుగు మీడియం

 * ఇంటర్‌ రెండో ఏడాది అర్థశాస్త్రం 

 *భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు (తెలుగు అకాడెమీ)  

 * యూనియన్‌ (కేంద్ర) బడ్జెట్‌ - 2022-23

 * యోజన 

 * ఎకనమిక్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 2021-22 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని