సన్నద్ధతకు తుది మెరుగులు!

ఈ సంవత్సరం ఆగస్టు 28న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది.  జేఈఈ మెయిన్స్‌- 2022  ఫలితాల్లో  విజేతలైన ఆలిండియా ర్యాంకర్లలో 2,50,000 మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత సాధించారు. పూర్వ ప్రశ్నపత్రాల పరిశీలన, అధ్యయనాలతో ఈ పరీక్షకు తుది సన్నద్ధత ఎలా సాగించాలో తెలుసుకుందాం!  

Published : 10 Aug 2022 00:58 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ -2022

ఈ సంవత్సరం ఆగస్టు 28న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది.  జేఈఈ మెయిన్స్‌- 2022  ఫలితాల్లో  విజేతలైన ఆలిండియా ర్యాంకర్లలో 2,50,000 మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత సాధించారు. పూర్వ ప్రశ్నపత్రాల పరిశీలన, అధ్యయనాలతో ఈ పరీక్షకు తుది సన్నద్ధత ఎలా సాగించాలో తెలుసుకుందాం!  

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసే అభ్యర్థులు ఐఐటీ బాంబే 2007, 2015 సంవత్సరాల్లో నిర్వహించిన ప్రశ్నపత్రాల సరళిని పరిశీలించటం, ఆకళింపు చేసుకోవడం చాలా ప్రయోజనకరం. ఈ పరీక్షను 2007లో ఐఐటీ- జేఈఈగానూ, 2015లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గానూ నిర్వహించారు.

ఐఐటీ జేఈఈ- 2007 సరళి

ఐఐటీ- జేఈఈని 2007 నుంచి రెండు పేపర్ల విధానంతో ప్రారంభించారు. అదే పద్ధతి ఇప్పుడూ కొనసాగుతోంది. అయితే అప్పట్లో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం.

పేపర్‌-1:  ఒక్కొక్క దానిలో 22 ప్రశ్నలతో మొత్తం మూడు సబ్జెక్టులకు కలిపి 66 ప్రశ్నలున్నాయి. సబ్జెక్టుకు 81 మార్కుల చొప్పున మొత్తం 243 మార్కులు కేటాయించారు.  

పేపర్‌-2: పేపర్‌- 1 మాదిరిగా పేపర్‌-2లోనూ సెక్షన్లు, మార్కులు ఇచ్చారు. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో రెండు పేపర్లతో పరీక్ష నిర్వహించిన జేఈఈ చరిత్రలో పేపర్‌- 1, పేపర్‌- 2 రెండూ ఒకే మాదిరిగా నిర్వహించడం ఇదే మొదటిసారి, చివరిసారి కూడా.

సబ్జెక్టుల వారీగా వెయిటేజి

ఫిజిక్స్‌: సింహభాగం అంటే 33 శాతం మెకానిక్స్‌, ఆ తర్వాత 30 శాతం ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నటిజమ్‌లోని అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మోడ్రన్‌ ఫిజిక్స్‌ 11 శాతంతో, ఆప్టిక్స్‌ 13 శాతంతో మార్కుల వెయిటేజి ఇచ్చారు. మిగిలిన అన్ని అంశాల నుంచి మిగతాశాతం ప్రశ్నలు ఇచ్చారు.

కెమిస్ట్రీ: 40 శాతం ప్రశ్నలు జనరల్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలోని అంశాలపైనా, 30 శాతం ప్రశ్నలు మిగిలిన ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌లో ఇచ్చారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఎనర్జిటిక్స్‌, బాండింగ్‌, పి-బ్లాక్‌ ఎలిమెంట్స్‌, జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలకు అధిక ప్రాధాన్యం లభించింది. ఫిజిక్స్‌తో పోల్చుకుంటే కెమిస్ట్రీ కాస్త కష్టంగా ఉందనే చెప్పాలి. ఇదంతా 2007లోని విద్యార్థుల సన్నద్ధత స్థితులను బట్టి అప్పట్లో ఆ ప్రశ్నల స్థాయి అని గుర్తుంచుకోవాలి.

మ్యాథ్స్‌: ఎప్పటిలాగానే 33 శాతం ప్రశ్నలతో కాలిక్యులస్‌ నుంచి ప్రశ్నలు అడగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో ఆల్జీబ్రా, కోఆర్డినేట్‌ జామెట్రీ ఉండటం విశేషం. ఎప్పుడూలేని విధంగా కోఆర్డినేట్‌ జామెట్రీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి. మిగిలిన ట్రిగనామెట్రి, వెక్టార్స్‌ నుంచి సుమారు 6 శాతం ప్రశ్నల చొప్పున ఇచ్చారు.

మొత్తం 486 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కెమిస్ట్రీ పేపర్‌ కొంత కష్టంగా, తర్వాతి స్థానంలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఉన్నాయని ఎక్కువమంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రతి సెక్షన్‌లో రుణాత్మక మార్కులు ఉండటం, కొత్తగా నాలుగో సెక్షన్‌లోని ప్రశ్నలు వినూత్నంగా ఉండటం అప్పట్లో ఈ పరీక్షకు ప్రాధాన్యం సంతరించిపెట్టింది.

ఈ పరీక్ష తర్వాత నుంచీ ఐఐటీ- జేఈఈ పరీక్షకు సిద్ధమయ్యేవారికి విభిన్న తరహా బహుళైచ్ఛిక ప్రశ్నలపై నెలకొన్న సందిగ్ధతలకు సమాధానం దొరికింది.

జేఈఈ- అడ్వాన్స్‌డ్‌- 2015

పేపర్‌-1: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 20 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు వచ్చాయి. 264 మార్కులతో ప్రతి సబ్జెక్టుకు 88 మార్కుల చొప్పున కేటాయించారు.

సెక్షన్‌-1లో పూర్ణాంక సమాధానం గల ప్రశ్నలు 8, ఒక్కొక్కదానికి 4 మార్కులు. రుణాత్మక మార్కులు లేవు. మార్కులు 32. సెక్షన్‌-2లో ఒకటికన్నా ఎక్కువ సమాధానం కల్గిన సరళ బహుళైచ్ఛిక ప్రశ్నలు 10, ఒక్కొక్కదానికి 4 మార్కులు, తప్పు సమాధానం రాసిన ప్రతి ప్రశ్నకు ‘2’ రుణాత్మక మార్కులు వెరసి 40 మార్కులు. సెక్షన్‌-3లో మ్యాచింగ్‌ ప్రశ్నల్లో కరెక్టుగా జతపరచిన ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, తప్పుగా జతపర్చిన దానికి ఒక రుణాత్మక మార్కుతో మొత్తం 16 మార్కులు.

పేపర్‌-2: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 20 ప్రశ్నల చొప్పున 240 మార్కులకు నిర్వహించారు. ఇందులో-

సెక్షన్‌-1లో 8 పూర్ణాంక సమాధానం గల ప్రశ్నలు, ఒక్కింటికి 4 మార్కుల చొప్పున రుణాత్మక మార్కులు లేకుండా మొత్తం 32 మార్కులతో ప్రశ్నలు ఇచ్చారు. సెక్షన్‌-2లో ఒకటికన్నా ఎక్కువ సమాధానం కలిగిన సరళ బహుళైచ్ఛిక ప్రశ్నలు 8, ఒక్కొక్కదానికి 4 మార్కుల చొప్పున తప్పుగా గుర్తించిన సమాధానానికి ‘2’ రుణాత్మక మార్కులతో మొత్తం 32 మార్కులు.

సెక్షన్‌-3లో పేరాగ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలు. ఇందులో రెండు పేరాగ్రాఫ్‌ ప్రశ్నలు, ఒక్కొక్కదాని కింద రెండు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు గల బహుళైచ్ఛిక ప్రశ్నలతో మొత్తం 4 ప్రశ్నలు, తప్పు సమాధానం గుర్తించినవాటికి 2 రుణాత్మక మార్కులతో మొత్తం 16 మార్కులతో ప్రశ్నలు ఇచ్చారు.

సబ్జెక్టులు..  అంశాలవారీగా వెయిటేజి

పేపర్‌- 1, పేపర్‌- 2లు కలిపి 504 మార్కులకు పరీక్ష నిర్వహించారు. సీబీఎస్‌ఈ బోర్డు 11వ తరగతి నుంచి 45 ప్రశ్నలతో, 196 మార్కులు, 12వ తరగతి నుంచి 75 ప్రశ్నలతో 322 మార్కులకు పేపర్‌ ఇచ్చారు. గమనించాల్సిన విషయం- 12వ తరగతి సిలబస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనేది. 21 శాతం ప్రశ్నలు సులువుగా, 37 శాతం ప్రశ్నలు మధ్యస్థంగా, మిగిలిన 42 శాతం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి.  
* ఫిజిక్స్‌ పేపర్‌ : ప్రశ్నల స్థాయి మధ్యమం నుంచి కఠినంగా ఉన్నాయి. ఎక్కువ భాగం ప్రశ్నలన్నీ గణిత ఆధారితమే. అంటే కాన్సెప్టుల కంటే కాల్‌క్యులేషన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కువశాతం ప్రశ్నలు 12వ తరగతి నుంచే అడిగారు. అందులోనూ, మోడ్రన్‌ ఫిజిక్స్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌ అండ్‌ మాగ్నటిజమ్‌, రే ఆప్టిక్స్‌, ఎర్రర్‌ అండ్‌ డైమెన్షనల్‌ అనాలిసిస్‌కి ప్రాముఖ్యం లభించింది.
* కెమిస్ట్రీ పేపర్‌: మొత్తం మీద మూడు సబ్జెక్టుల్లో కెమిస్ట్రీ కాస్త మధ్యస్థంగా ఉంది. కొన్ని ప్రశ్నలు మాత్రం సంక్లిష్టంగా ఎక్కువ సమయాన్ని తీసుకునేవిగా ఉన్నాయి. ఆర్గానిక్‌, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలలో అధికశాతం ప్రశ్నలు తేలిక నుంచి మధ్యమస్థాయిలో ఉంటే, కొన్ని ఫిజికల్‌ కెమిస్ట్రీ ప్రశ్నలు కాస్త కఠినంగా, ఎక్కువ సమయాన్ని తీసుకునేలా ఉన్నాయి.
*  మ్యాథ్స్‌ : ప్రశ్నల స్థాయి ఉగాది పచ్చడిని పోలి ఉంది. అంటే తేలిక నుంచి కఠినస్థాయి వరకు ప్రశ్నలున్నాయి. పెద్దపెద్ద కాల్‌క్యులేషన్స్‌తో, స్టెప్స్‌తో కూడిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మాట్రిక్స్‌ మ్యాచింగ్‌ ప్రశ్నలు బహుళ సంబంధిత అంశాల ఆధారితంగా ఉన్నాయి. ఎప్పటిలాగా కాల్‌క్యులస్‌, ఆల్జీబ్రాల నుంచి వచ్చే అంశాలకే పెద్దపీట వేశారు. మిగిలిన అధ్యాయాల నుంచి ఇదివరకు మాదిరిగానే అడిగారు.

రాబోయే కొద్దిరోజుల్లో ...

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయబోతున్నవారు 2007, 2015 సంవత్సరాల్లో ఐఐటీ బాంబే రూపొందించిన ప్రశ్నపత్రాల సరళినిని పరిశీలించి, అందులోని ఉమ్మడి అంశాలపై దృష్టి సారించటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే... జేఈఈ అడ్వాన్స్‌డ్‌- 2022లో ప్రశ్నలతోపాటు పేపర్‌- 1, పేపర్‌- 2 ప్రశ్నపత్రాల శైలి కూడా విజయానికి ఎక్కువ దోహదపడుతుంది.

* ప్రశ్నల స్థాయికన్నా, ఆయా సెక్షన్లలో అడిగే ప్రశ్నలకు కేటాయించిన ధనాత్మక, రుణాత్మక మార్కులూ విజయాన్ని శాసిస్తాయి. 2007లో కన్నా 2015 పేపర్‌లోని ఎక్కువ శాతం ప్రశ్నలు ఒకటి కంటే ఎక్కువ సమాధానం గల బహుళైచ్ఛిక, మాట్రిక్స్‌ మ్యాచింగ్‌ విధానం గల ప్రశ్నలు, వాటికున్న రుణాత్మక మార్కులను గమనించాలి.

* జరగబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-1, పేపర్‌-2లలో కూడా.... ఒకటి కంటే ఎక్కువ సమాధానం గల ప్రశ్నలు, పూర్ణాంక, సంఖ్యాత్మక విలువ గల ప్రశ్నలు ఉండొచ్చు. ఈ తరహా ప్రశ్నలనే పేరాగ్రాఫ్‌, మాట్రిక్స్‌ మ్యాచింగ్‌ ప్రశ్నలతో అనుసంధానం చేసి ప్రాక్టీసు చేయండి.

* గత రెండు సంవత్సరాల జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పేపర్లను చూస్తే ప్రతి పేపర్‌లో, ప్రతి సబ్జెక్టులో గరిష్ఠంగా 20 ప్రశ్నల కంటే ఎక్కువ ఇవ్వడం లేదు.

* పేపర్‌- 1లోని సెక్షన్లు, పేపర్‌- 2లోని సెక్షన్లు- అందులో అడిగే ప్రశ్నల సరళిలో ఎంతో కొంత మార్పు కచ్చితంగా ఉంటుందనే విషయం మరవొద్దు.

* కనీసం ఒక గంటలో 15 నుంచి 20 విభిన్న కాన్సెప్టులతో కూడిన ప్రశ్నలకు సిద్ధపడి సాధన చేయాలి. .

* బాగా వెయిటేజి ఉన్న అంశాల్లో డైరెక్ట్‌ ప్రశ్నలకు బదులు మల్టిపుల్‌ కాన్సెప్చువల్‌ ప్రశ్నలను సాధన చేయండి.

* ఏ సబ్జెక్టులోనైనా, ఏ చాప్టర్‌లోనైనా భావనలు (కాన్సెప్టులు) పరిమితం, ప్రాబ్లమ్స్‌ అపరిమితం అనేది వాస్తవం.

* పరీక్షలో ఎన్ని ప్రాబ్లమ్స్‌ పరిష్కరించారమన్నది కాదు, ఎన్ని కరెక్టుగా చేశామన్నది ముఖ్యం.

* విద్యార్థుల సౌలభ్యం కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌లో రెండు మాక్‌టెస్టులను ఉంచారు. వాటిని ప్రాక్టీసు చేయడం మరవొద్దు.

* కనీసం రోజు మార్చి రోజు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ చివరి పరీక్ష తరహాలో 6 గంటల పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో ప్రాక్టీసు చేయడం అలవర్చుకోవాలి.

* ప్రశ్నపత్రంలో జవాబులు గుర్తించేముందు సూచనలను తప్పక చదవండి.

* అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది- ఒక పేపర్‌ ప్రభావం ఇంకోదానిపై పడనీయకూడదు.

* పేపర్‌- 1 బాగా రాస్తే పేపర్‌- 2 ఇంకా బాగా రాయాలి. ఒకవేళ పేపర్‌- 1 బాగా రాయలేకపోతే పేపర్‌- 2 ఇంకా బాగా రాస్తాననే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. రెండు పేపర్లలోని మొత్తం మార్కులపై వచ్చే మార్కులతో నిర్ధారిస్తారన్నది విస్మరించొద్దు.

* పరీక్ష హాల్లో సెంటిమెంట్లను పక్కనపెట్టటం మంచిది. మీరు చూసిన మొదటి ప్రశ్నే కఠినంగా ఉంటే దాన్ని ప్రతికూల భావనతో చూడకుండా వెంటనే తెలిసిన తరువాతి ప్రశ్నపై దృష్టి పెట్టటం సబబు.

* పరీక్ష బాగా రాయగలననే సానుకూల దృక్పథం చాలా ముఖ్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని