ఉపాధికి ఔషధం!

మన ఇంట్లోనో లేదా బంధువుల ఇళ్లలోనో ఎవరో ఒకరు మందులు వాడుతూ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఔషధాల వాడకం నిత్యకృత్యం లాంటిది.

Published : 30 Aug 2022 01:08 IST

ఫార్మసీ కోర్సులు

మన ఇంట్లోనో లేదా బంధువుల ఇళ్లలోనో ఎవరో ఒకరు మందులు వాడుతూ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఔషధాల వాడకం నిత్యకృత్యం లాంటిది. అంతలా మన రోజువారీ జీవితాలతో పెనవేసుకుంది ఫార్మా రంగం. కరోనా సమయంలో అన్ని రంగాలూ కుదేలయినప్పటికీ ఈ రంగం పుంజుకుని కోట్లమంది ప్రాణాలు కాపాడింది. ఎంసెట్‌ ర్యాంకుతో బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీలో చేరవచ్చు. ఈ సందర్భంగా ఫార్మా రంగంలో ఉన్న విద్య, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం!

ఇంటర్మీడియట్‌ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్‌లో ర్యాంకు సాధిస్తే బీఫార్మసీలో ప్రవేశం పొందొచ్చు. నాలుగు సంవత్సరాల కాలవ్యవధిలో ఈ కోర్సు ముఖ్యమైన సబ్జెక్టులైన ఫార్మస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ ఎనాలిసిస్‌, ఫార్మకాలజీ, ఫార్మాకాగ్నసీ లాంటి సబ్జెక్టులను బోధిస్తారు. విద్యార్థికి ఒక డ్రగ్‌ తయారీ దగ్గర నుంచి అది అంతిమంగా మార్కెట్‌లోకి వచ్చేవరకు ఉన్న అన్ని ప్రక్రియల గురించీ అవగాహన కలుగుతుంది. ఫార్మస్యూటిక్స్‌ లాంటి సబ్జెక్టులో వివిధ ఔషధాల తయారీ విధానం, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌లో ఔషధ] నియంత్రణ పరీక్షలు, ఫార్మకాలజీలో శరీరంపై ఔషధాల ప్రభావం గురించి బోధిస్తారు.

ఉపాధి అవకాశాలు

బీఫార్మసీ పూర్తిచేసినవారికి డ్రగ్‌ ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ కంప్లెయిన్స్‌, అనలిటికల్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ లాంటి ఉద్యోగాలకు కూడా బీఫార్మసీనే ప్రామాణికంగా తీసుకుంటారు అయితే మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా రాణించాలంటే మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.

బీఫార్మసీ తర్వాత ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్టర్‌ అవడం ద్వారా అన్ని ప్రభుత్వరంగ ఫార్మసీ ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. ఉదాహరణకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, రైల్వే ఫార్మసిస్ట్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, గవర్నమెంట్‌ ఫార్మసిస్ట్‌ లాంటి ఉద్యోగాలకు బీఫార్మసీనే ప్రామాణికం. ఈ కోర్సు మెడికల్‌ కోడింగ్‌, ఫార్మకో విజిలెన్సు, క్లినికల్‌ రిసెర్చ్‌, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, ఫార్మా రెగ్యులేటరీ అఫైర్స్‌ లాంటి డిమాండ్‌ ఉన్న రంగాల్లోకి వెళ్లడానికి దోహదపడుతుంది. స్వయంగా మెడికల్‌ షాప్‌ పెట్టుకోవడం ద్వారా జీవనోపాధినీ పొందవచ్చు.

ఉన్నత విద్యావకాశాలు

బీఫార్మసీ నాలుగో సంవత్సరంలో కేంద్రప్రభుత్వ సంస్థ నిర్వహించే జీప్యాట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా/ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పీజీసెట్‌లో మంచి ర్యాంకు సాధించడం ద్వారా ఎంఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు ఎంఫార్మసీలో విభిన్న స్పెషలైజేషన్‌లుంటాయి. ఉదాహరణకు ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ. విద్యార్థులు తమ అభిరుచిని బట్టి స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. ఇది పూర్తి చేసినవారికి పరిశ్రమలో మంచి డిమాండ్‌ ఉంటుంది. వీరికి రిసెర్చ్‌ విభాగాల్లో కొలువులు వస్తాయి.

బీ ఫార్మసీ పూర్తిచేసినవారు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌/ జీఆర్‌ఈ లాంటి పరీక్షల్లో మెరుగైన స్కోరు సంపాదిస్తే ఇతర దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించవచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసినవారికి అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.

నైపర్‌ల ప్రాముఖ్యం: కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలైన 7 నైపర్‌లు (మొహాలీ, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, గువాహటి, రాయ్‌బరేలీ, కోల్‌కతా, హాజీపూర్‌) ఫార్మసీ రంగంలో ఉన్నత విద్యకు పెట్టిందిపేరు. నైపర్‌లో పీజీ సీటు సాధించాలంటే కచ్చితంగా జీప్యాట్‌లో అర్హత సాధించాలి. తద్వారా కేంద్ర ప్రభుత్వం నెలకు అందించే రూ.12,400 ఉపకార వేతనం కూడా లభిస్తుంది. అయితే నైపర్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే పోటీని తట్టుకొనే మనస్తత్వం ఉండాలి. నైపర్‌లో 16 రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చేరాలంటే బీఫార్మసీ తర్వాత జీప్యాట్‌, నైపర్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. నైపర్‌లో ఉన్నత విద్య పూర్తిచేసినవారికి భారీ వార్షిక వేతనాలతో బహుళజాతి కంపెనీల రిసెర్చ్‌ విభాగాల్లో కొలువులు లభిస్తున్నాయి.


డిప్లొమా ఇన్‌ ఫార్మసీ

ఎంపీసీ/ బైపీసీ పూర్తిచేసిన విద్యార్థులు ఇంటర్‌లో వారు పొందిన మార్కులను బట్టి రెండేళ్ల డీఫార్మసీలో ప్రవేశం పొందుతారు. ఇది పూర్తిచేసి ‘ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’లో రిజిస్టర్‌ కావడం ద్వారా  ప్రభుత్వ ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. ఉదాహరణకు డీఫార్మసీ పూర్తిచేసినవారు రైల్వే ఫార్మసిస్ట్‌, కేంద్రప్రభుత్వం నిర్వహించే అన్ని ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలకూ అర్హత సాధిస్తారు. వివిధ ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఫార్మసిస్ట్‌ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు స్వయంగా మెడికల్‌ షాప్‌ పెట్టుకోవచ్చు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి రిటైల్‌ మెడికల్‌ బిజినెస్‌లో మంచి అవకాశాలుంటాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు ఈసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధిస్తే నేరుగా బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందొచ్చు.


డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ

ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకును బట్టి ఫార్మాడీలో ప్రవేశం పొందొచ్చు. మన దేశంలో ఫార్మాడీ పూర్తిచేసినవారికి ఉపాధి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ విదేశాల్లో వీరికి ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఫార్మాడీ కోర్సు కాలవ్యవధి 6 సంవత్సరాలు. ఇందులో 5 సంవత్సరాలు థియరీ, 1 సంవత్సరం ప్రాక్టికల్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. బీఫార్మసీ పూర్తిచేసినవారు పోస్ట్‌ బ్యాచిలరెట్‌ అనే 3 సంవత్సరాల కోర్సు చేయడం ద్వారా ఫార్మాడీ డిగ్రీ సాధించవచ్చు. ఫార్మాడీ పూర్తిచేసినవారికి క్లినికల్‌ రిసెర్చ్‌ ఫార్మాకోవిజిలెన్స్‌, హాస్పిటల్‌ ఫార్మసీ లాంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని