JAM 2023: డిగ్రీతో ఐఐటీలోకి!

సాధారణ డిగ్రీతో ఐఐటీల్లో చదువుకునే అవకాశం వచ్చింది. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఒక్క ఐఐటీల్లోనే కాకుండా ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ఉన్నత విద్యలో చేరడానికి ఈ స్కోరు దారి చూపుతుంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో జామ్‌-2023 వివరాలు...

Updated : 07 Sep 2022 06:04 IST

జామ్‌-2023

సాధారణ డిగ్రీతో ఐఐటీల్లో చదువుకునే అవకాశం వచ్చింది. జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌) ప్రకటన వెలువడింది. డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు ఈ పరీక్ష రాసుకోవచ్చు. ఒక్క ఐఐటీల్లోనే కాకుండా ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ఉన్నత విద్యలో చేరడానికి ఈ స్కోరు దారి చూపుతుంది. ప్రకటన వెలువడిన నేపథ్యంలో జామ్‌-2023 వివరాలు...

ఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సులు ఉంటాయని ఎక్కువమందికి తెలిసిన సంగతే. అయితే వీటితోపాటు సైన్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ విభాగాల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ పీహెచ్‌డీ డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సులను దాదాపు ఐఐటీలన్నీ అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి జామ్‌ రాయాలి.

ఏడు సబ్జెక్టుల్లో ఈ ప్రవేశపరీక్షను నిర్వహిస్తున్నారు. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, జియాలజీ, మ్యాథమెటిక్స్‌, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌. జామ్‌-2023 పరీక్షలు ఐఐటీ గువాహటి నిర్వహిస్తోంది. వీటిలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. పరీక్ష నిమిత్తం అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్‌-1లో ఒకటి, సెషన్‌-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్‌-1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్‌లో.. బయోటెక్నాలజీ, ఎకనామిక్స్‌, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌ల్లో ఇవి ఉంటాయి.

జామ్‌ స్కోరుతో 21 ఐఐటీలతోపాటు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఇవన్నీ మేటి విద్యా సంస్థలే. అందువల్ల ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీల్లో అవకాశం వచ్చినవారు స్టైపెండ్‌ అందుకోవచ్చు.

అన్ని ఐఐటీల్లోనూ కలిపి 3000 కంటే ఎక్కువ పీజీ సీట్లు ఉన్నాయి. అలాగే ఈ స్కోరుతో ప్రవేశం కల్పిస్తోన్న ఐఐఎస్సీ, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, మిగిలిన సంస్థల్లో 2300 సీట్లు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వంద కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షలో 60 శాతం మార్కులు పొందితే చాలు ఏదైనా ఐఐటీలో సీటు పొందే అవకాశం సొంతమవుతుంది.

ఎవరు అర్హులు?

నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని సంస్థలూ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కోర్సులను ఎమ్మెస్సీలో భాగంగా అందిస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎస్సీలో కెమిస్ట్రీ కోర్సులకు డిగ్రీలో కెమిస్ట్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరిగా చదివుండాలి. ఐఐటీ ఇండోర్‌, రవుర్కెలాకు మాత్రం డిగ్రీలో కెమిస్ట్రీ చదివితే సరిపోతుంది. ఐఐటీ గాంధీనగర్‌కు ఎలాంటి నిబంధనలూ లేవు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ పీజీ కోర్సులకు డిగ్రీ స్థాయిలో ఆ సబ్జెక్టులు చదవడం తప్పనిసరి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ఐఐటీ- బాంబే, ఇండోర్‌ అందిస్తున్నాయి. వీటికోసం గ్రాడ్యుయేట్లు ఎవరైనా పోటీ పడవచ్చు. ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సును ఐఐటీ దిల్లీ, రవుర్కెలా అందిస్తున్నాయి. దిల్లీలో ఈ కోర్సులో చేరడానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్‌ విద్యార్థులు పోటీ పడవచ్చు. రవుర్కెలాలో అయితే బీటెక్‌ లేదా డిగ్రీ స్థాయిలో ఎకనామిక్స్‌/మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.  

పరీక్ష ఇలా...

జామ్‌ ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్‌ 60 ప్రశ్నలు. వంద మార్కులు. మూడు విభాగాల్లో (మల్టిపుల్‌ ఛాయిస్‌, మల్టిపుల్‌ సెలెక్ట్‌, న్యూమరికల్‌) ప్రశ్నలు అడుగుతారు. వీటిని ఎ, బి, సి సెక్షన్లుగా విభజించారు.

సెక్షన్‌-ఎ: ఇందులో మొత్తం 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు ఇరవై వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 ఆప్షన్లు, ఒకటి మాత్రమే సరైన సమాధానం. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఒక మార్కు ప్రశ్నకు  1/3, రెండు మార్కుల ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు.

సెక్షన్‌-బి: ఇందులో పది మల్టిపుల్‌ సెలక్ట్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ రెండు మార్కులు. నాలుగు ఆప్షన్లు ఇస్తారు. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆప్షన్లు సరైన సమాధానాలుగా ఉండవచ్చు. సరైన ఆప్షన్‌/ ఆప్షన్లను గుర్తిస్తేనే పూర్తి మార్కులు వస్తాయి. పాక్షిక సమాధానానికి మార్కులు కేటాయించరు. రుణాత్మక మార్కులు లేవు.

సెక్షన్‌-సి: ఇందులో 20 న్యూమరికల్‌ ఆన్సర్‌ ప్రశ్నలు వస్తాయి. వీటికి వాస్తవ సంఖ్య సమాధానంగా ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఆప్షన్లు ఉండవు. ఒక మార్కు ప్రశ్నలు పది, రెండు మార్కుల ప్రశ్నలు పది వస్తాయి. రుణాత్మక మార్కులు లేవు.


పరిశోధనల దిశగా అడుగేయాలనుకున్నవారికీ జామ్‌ చక్కని అవకాశం. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఐఐఎస్‌ఈఆర్‌ల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరడానికి జామ్‌ స్కోరే ప్రామాణికం


ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: అక్టోబరు 11 వరకు

పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కి  రూ.900 రెండు పేపర్లకు రూ.1250. మిగిలిన అభ్యర్థులు అందరికీ ఒక పేపర్‌కు రూ.1800. రెండు పేపర్లకు రూ.2500

పరీక్ష తేదీ: ఫిబ్రవరి 12

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://jam.iitg.ac.in/


సన్నద్ధత  

ఇతర పీజీ ప్రవేశ పరీక్షలతో పోలిస్తే జామ్‌ విభిన్నం. ఇందులో ప్రాథమికాంశాలకు ప్రాధాన్యం ఎక్కువ. పరీక్ష రాసే సబ్జెక్టులో అధ్యయనం వీటితోనే ప్రారంభించాలి. ఇందుకోసం దిగువ తరగతుల పాఠ్యపుస్తకాలు బాగా చదవాలి. ఆపై డిగ్రీ స్థాయి పుస్తకాలపై దృష్టి పెట్టాలి.

అభ్యర్థికి సబ్జెక్టులో ఉన్న విస్తృత అవగాహన పరిశీలించేలా ప్రశ్నలు రూపొందిస్తారు. వీటిని నేరుగా అడగరు. పలు అంశాలు జోడించి ప్రశ్నగా రూపొందిస్తారు. సబ్జెక్టుల్లో అవగాహన, అనువర్తన, విశ్లేషణ, పరిజ్ఞానం పరీక్షించేలా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల సమగ్ర అధ్యయనం తప్పనిసరి. పూర్తి పట్టుంటేనే సరైన జవాబు ఇవ్వగలం.

పరీక్ష రాయాలనుకున్న సబ్జెక్టులో ముందు ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. అనంతరం డిగ్రీ పాఠ్యాంశాలపై దృష్టి సారించాలి.

సబ్జెక్టు/ పేపర్లవారీ సిలబస్‌ వివరాలను జామ్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వాటిని పరిశీలించి..ఆ ప్రాధాన్యం ప్రకారం పాఠ్యపుస్తకాల్లోని అంశాలు అధ్యయనం చేయాలి. సిలబస్‌లో ప్రస్తావించిన అంశాలు పాఠ్యపుస్తకంలో లేకపోతే రిఫరెన్స్‌ పుస్తకాలను ఆశ్రయించాలి.

సన్నద్ధతలో పాతప్రశ్నపత్రాలు దిక్సూచిలా ఉపయోగపడతాయి. వీటి నుంచి.. ప్రశ్నల తీరు, సంబంధిత సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలవారీ పరీక్షలో లభిస్తోన్న ప్రాధాన్యం, ప్రశ్నల స్థాయి తెలుసుకోవచ్చు. దీంతో వేటిని చదవాలి, ఎలా సన్నద్ధం కావాలో స్పష్టత వస్తుంది. పరీక్షపై అవగాహన ఏర్పరచుకోవచ్చు. వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు పొందుపరిచారు.

అధ్యయనం పూర్తయిన తర్వాత పరీక్షకు నెల ముందు నుంచి వీలైనన్ని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీటి ఫలితాలు సమీక్షించుకుని, సన్నద్ధతను మెరుగుపరచుకోవాలి.

పరీక్షలకు కొద్ది రోజుల ముందు మాక్‌ టెస్టును జామ్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. దాన్ని రాయడం వల్ల అసలు పరీక్ష ఎలా ఉండవచ్చో అంచనాకు రావచ్చు.  

సంబంధిత సబ్జెక్టుల్లో సీయూ సెట్‌ పీజీ ప్రశ్నపత్రాలు పరిశీలించడం ఉపయోగం. అలాగే గతంలో వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ సాధన చేయడం మంచిదే.

సబ్జెక్టులవారీగా...

కెమిస్ట్రీ: ఫిజికల్‌, ఆర్గానిక్‌ విభాగాలపై అధిక దృష్టి సారించాలి. ఆర్గానిక్‌ విభాగంలో జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, రియాక్షన్‌ మెకానిజం, స్పెక్ట్రోస్కోపీ, స్టీరియో కెమిస్ట్రీ, నేమ్‌డ్‌ రియాక్షన్‌, రియేజెంట్స్‌ తదితర పాఠ్యాంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనటిక్స్‌, ఎల‌్రక్టో కెమిస్ట్రీ, సాలిడ్‌ స్టేట్‌ అంశాలను బాగా చదవాలి. ఇనార్గానిక్‌లో సంశ్లిష్ట సమ్మేళనాలు, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, రసాయన బంధం అంశాలపై దృష్టి సారించాలి.

ఫిజిక్స్‌: ఫిజికల్‌ ఆప్టిక్స్‌, క్వాంటమ్‌ మెకానిక్స్‌, థర్మోడైనమిక్స్‌, వేవ్స్‌ అండ్‌ ఆసిలేషన్స్‌, హీట్‌, ఆప్టిక్స్‌, మోడ్రన్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌, అటామిక్‌ ఫిజిక్స్‌, క్వాంటమ్‌ థియరీ, స్పెక్ట్రోస్కోపీ అంశాలను బాగా చదవాలి.  

మ్యాథ్స్‌: మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, కాలిక్యులస్‌, వెక్టార్స్‌, ట్రిగనోమెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీలపై అధిక దృష్టి సారించాలి.

బయోటెక్నాలజీ: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అంశాలను ఇంటర్మీడియట్‌ స్థాయిలో చదవాలి. బయాలజీ, కెమిస్ట్రీ అంశాలను డిగ్రీ స్థాయిలో అధ్యయనం చేయాలి.

జియాలజీ: ప్లానెట్‌ ఎర్త్‌, జియోమార్ఫాలజీ, స్ట్రక్చరల్‌ జియాలజీ, పాలియాంథాలజీ, స్ట్రాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్‌ జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీ అంశాలు అధిక ప్రాధాన్యంతో చదవాలి.

స్టాటిస్టిక్స్‌: మ్యాథ్స్‌ అంశాలతోపాటు ప్రాబబిలిటీ, వివిధ డిస్ట్రిబ్యూషన్లు, లిమిట్‌ థీరమ్‌, ఎస్టిమేషన్‌, హైపోథెసిస్‌ అంశాలపై దృష్టి సారించాలి.

ఎకనామిక్స్‌: మైక్రో ఎకనామిక్స్‌, మ్యాక్రో ఎకనామిక్స్‌, ఇండియన్‌ ఎకానమీ, స్టాటిస్టిక్‌ ఎకానమీ, మ్యాథమెటికల్‌ ఎకానమీ అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని