Updated : 21 Nov 2022 03:36 IST

అద్భుత అవకాశాలను డిజైన్‌ చేసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా మేటి డిజైనర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. సృజన, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం ఉన్నవారు ఈ విభాగంలో రాణించవచ్చు. ఆసక్తి ఉంటే జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో సంస్థలు అందించే కోర్సుల్లో చేరవచ్చు. ఇందుకోసమే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (అహ్మదాబాద్‌) ఏర్పాటైంది. దీనికి ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంల్లో శాఖలున్నాయి. ఈ సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. అలాగే నిఫ్ట్‌ల్లోనూ డిజైన్‌ కోర్సుల దరఖాస్తుకు గడువుంది!

డిజైన్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఇంటర్మీడియట్‌ తర్వాత వస్తుంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజ్‌) కోర్సులను నాలుగేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. నిడ్‌- అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో.. యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌ల్లో ఇండస్ట్రియల్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌ కోర్సులు అందిస్తున్నారు. ఏపీలో నిడ్‌ క్యాంపస్‌ విజయవాడలో ఏర్పాటైంది.  

ఎవరు అర్హులు?

బ్యాచిలర్‌ కోర్సులకు ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే. వయసు 20 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 1, 2003 తర్వాత జన్మించాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లు; దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు వర్తిస్తుంది. మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల వ్యవధి రెండున్నరేళ్లు. వీటిని అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. యూజీలో ఉన్న కోర్సులన్నీ పీజీలో ఉన్నాయి. అదనంగా అపారెల్‌ డిజైన్‌, రిటైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌, డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌, ఇన్ఫర్మేషన్‌ డిజైన్‌, ఇంటరాక్షన్‌ డిజైన్‌, లైఫ్‌ స్టైల్‌ డిజైన్‌, యాక్సెసరీస్‌ డిజైన్‌, న్యూ మీడియా డిజైన్‌, ఫొటోగ్రఫీ డిజైన్‌, స్ట్రాటజిక్‌ డిజైన్‌ మేనేజ్‌మెంట్‌, టాయ్‌ అండ్‌ గేమ్‌ డిజైన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ ఆటోమొబైల్‌ డిజైన్‌, యూనివర్సల్‌ డిజైన్‌ కోర్సులు ఉన్నాయి. ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల బీడిజైన్‌ లేదా అనుబంధ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.

పరీక్ష ఇలా..

డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టులో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఉంటాయి. ప్రిలిమ్స్‌ పేపర్‌ వంద మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. పరీక్ష పేపర్‌పై పెన్సిల్‌/ పెన్నుతో సమాధానాలు రాయాలి. ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో చూపిన ప్రతిభతో షార్ట్‌లిస్టు చేసిన అభ్యర్థులకు మెయిన్స్‌ నిర్వహిస్తారు. తుది ఎంపికలు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఉంటాయి. మాదిరి ప్రశ్నపత్రాలను నిడ్‌ వెబ్‌సైట్‌లో పొందిపరిచారు. వాటితో పరీక్షపై అవగాహనకు రావచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 16 మధ్యాహ్నం 4 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: జనవరి 8

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ.

వెబ్‌సైట్‌: http://www.nid.edu/

పేరున్న కొన్ని సంస్థలు

శ్రేష్ఠ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ; పెర్ల్‌ అకాడెమీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, విట్‌ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, రాంచీ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, గాల్గోటియా యూనివర్సిటీ.

నిఫ్ట్‌ల్లో...

దేశవ్యాప్తంగా 18 చోట్ల ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లు డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఈ సంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌లో.. ఫ్యాషన్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, యాక్సెసరీ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి.  వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. డిసెంబరు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు

ప్రముఖ సంస్థల్లో చదివినవారు ప్రాంగణ నియామకాల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. వర్ల్‌పూల్‌, విప్రో, టైటాన్‌, ఫిలిప్స్‌, టాటా, గోద్రెజ్‌, జేపీ మోర్గాన్‌, ఎల్‌జీ, మారుతీ సుజుకీ, మైక్రోసాఫ్ట్‌, మైండ్‌ట్రీ, ఒరాకిల్‌, రంగోలీ, రెడ్‌బస్‌, తనిష్క్‌, వెల్‌స్పన్‌, జొమాటో...ఇలా ఎన్నో సంస్థలు వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. చదువుకున్న స్పెషలైజేషన్‌ ప్రకారం సంబంధిత సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. పీజీ పూర్తిచేసుకున్నవారు ఆకర్షణీయ వేతనాలతో, అత్యున్నత హోదాలు సొంతం చేసుకుంటున్నారు.


ఏయే స్పెషలైజేషన్లు?

ఇండస్ట్రియల్‌ డిజైన్‌: ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారు తయారీ సంస్థల్లో వస్తువు, ఉత్పత్తిని డిజైన్‌ చేస్తారు. ఫర్నిచర్‌, ఇంటీరియర్‌, ఇంజినీరింగ్‌ ప్రొడక్టులు, సిస్టమ్స్‌, కన్జూమర్‌ గూడ్స్‌, క్రాఫ్ట్‌ బేస్డ్‌ ప్రొడక్ట్స్‌ యాక్సెసరీస్‌, పర్సనల్‌ యూజర్‌ ప్రొడక్ట్స్‌ కిచెన్‌ టూల్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌, కొత్తతరం ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీ తదితర సంస్థల్లో పనిచేయవచ్చు.    


టెక్స్‌టైల్‌ డిజైన్‌: ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరాల్లో దుస్తులు ఒకటి. ఎక్కువమంది.. దుస్తుల్లో తమ ప్రత్యేకత కనిపించాలని ఆశిస్తున్నారు. నాణ్యత, మన్నికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జనాల అవసరాలు, అభిరుచులను పరిగణనలోకి తీసుకుని టెక్స్‌టైల్‌ డిజైనర్లు వస్త్రాలను రూపొందిస్తారు. సౌకర్యవంతం, ఆకర్షణీయంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దుతారు. వీరికి టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలు, రిటైల్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.


గ్రాఫిక్‌ డిజైన్‌: ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు గ్రాఫిక్‌ డిజైనర్ల్లుగా, బ్రాండ్‌ ఐడెంటిటీ డెవలపర్‌, లోగో డిజైనర్‌, విజువల్‌ ఇమేజ్‌ డెవలపర్‌, మల్టీమీడియా డెవలపర్‌, పబ్లికేషన్‌ డిజైనర్‌గా పనిచేయవచ్చు. బహుళజాతి కంపెనీలు, అడ్వర్టైజింగ్‌, ఆన్‌లైన్‌ మీడియా, టీవీ, వినోద పరిశ్రమల్లో వీరికి విస్తృతంగా అవకాశాలు లభిస్తాయి.  


ఫ్యాషన్‌ డిజైన్‌: ఈ కోర్సులు చదివినవారికి దుస్తులు తయారుచేసే కంపెనీల్లో మేటి అవకాశాలు లభిస్తాయి. అవుట్‌లెట్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. కొంత అనుభవంతో డిజైన్‌ కన్సల్టెంట్‌, స్టైలిస్ట్‌, కస్టమర్‌ డిజైనర్‌, ఫ్యాషన్‌ ఫోర్‌కాస్టర్‌, ఇలస్ట్రేటర్‌, ఆంత్రప్రెన్యూర్‌, అకడమీషియన్‌, ఫ్యాషన్‌ మర్చండైజర్‌, బయ్యర్‌గా కొనసాగవచ్చు.  


కమ్యూనికేషన్‌ డిజైన్‌: యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రకటన, ఆన్‌లైన్‌ మీడియా, వినోద పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి.


లెదర్‌ డిజైన్‌: పాదరక్షలు, బెల్టులు, బ్యాగులకు.. ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఈ విభాగాల్లో దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి సంస్థలెన్నో ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. సోఫాలతోపాటు పలు వస్తువుల తయారీలో లెదర్‌ వినియోగం పెరిగింది. జంతువుల తోలుతో వీరు ఆకర్షణీయ ఆకృతులు డిజైన్‌ చేస్తారు. ఎక్కువగా అపారెల్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


ప్రొడక్ట్‌ డిజైన్‌: వీరు పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు రూపొందిస్తారు. మరింత సులువుగా ఉపయోగించేలా, మన్నిక ఎక్కువగా ఉండేలా, నిర్వహణ భారం లేకుండా, తక్కువ పరిమాణంలో ఉండేలా, కొద్ది మొత్తంతోనే తయారయ్యేలా ఆ ఉత్పత్తి తయారవుతుంది. వీరికి అన్ని రకాల వస్తు తయారీ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తాయి.


డిజైన్‌ విభాగంలో ఏ స్పెషలైజేషన్‌ చదివినప్పటికీ అవకాశాల పరంగా ఢోకా లేదు. సృజన, డ్రాయింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు బాగా రాణించవచ్చు. కోర్సులు చేసినవారికి స్పెషలైజేషన్‌ ఆధారంగా ప్రతి కంపెనీలోనూ అవకాశాలు ఉంటాయి. మేటి సంస్థల్లో చదువుకున్నవారిని పలు బహుళజాతి కంపెనీలు, దేశీయ సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా పెద్ద మొత్తంలో వేతనంతో అవకాశం కల్పిస్తున్నాయి.


ఆదాయంలో ఆరుశాతం ఫ్యాషన్‌కే

నదేశంలో ప్రజలు తమ ఆదాయంలో ఆరు శాతం ఫ్యాషన్‌ సంబంధిత అంశాలకు ఖర్చు చేస్తున్నారని అంచనా. మనం వేసుకునే దుస్తులు, చెప్పులు, నగలు, కేశాలంకరణల విషయంలో అందాన్ని రెట్టింపుచేసే ప్రక్రియలోని సృజనాత్మక కళ డిజైనింగ్‌. గృహిణుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను ఇది ఇనుమడింపజేస్తుంది. వారికోసం, వారి పిల్లల కోసమే కాదు, వాణిజ్యపరంగా కొనుగోలుదారులను ఆకర్షించేలా దుస్తుల రూపకల్పనకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్య ఉపయోగపడుతుంది. కోర్సులు పూర్తిచేస్తే  ఫ్యాషన్‌ కన్సల్టెంట్లుగా, ఇలస్ట్రేటర్లుగా, విజువల్‌ మర్చండైజర్లుగా అవకాశాలు పొందవచ్చు. రిటైల్‌ దుస్తుల మార్కెటింగ్‌  చేసేవారుగా, పేట్రన్‌ మేకర్లుగా, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్లుగా, కళాదర్శకులుగా విభిన్నరకాల ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉంది. పౌరాణిక, చారిత్రక సినిమాల కథాంశాలకు అనుగుణంగా దుస్తుల రూపకల్పన చేసే కళ వీరికి అవగతమవుతుంది. వ్యక్తిగత వెబ్‌సైట్ల నిర్మాణంలోనూ ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.

- లలిత జొన్నలగడ్డ హెచ్‌ఓడీ, ఫ్యాషన్‌ డిజైన్‌,
రూట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ మీడియా


విద్యకు అంతం లేదు. పుస్తకాలు చదవడం,
పరీక్షలు పాసవడం విద్య కాదు. జీవితమంతా అంటే...
పుట్టిన క్షణం నుంచి చనిపోయేంతవరకు జరిగే ప్రక్రియ మొత్తం...
నేర్చుకోవడమే

- జిడ్డు కృష్ణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు