బృంద చర్చలో సత్తా చూపిస్తారా?

ఐఐఎంలూ, ఇతర ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ చేయాలని ఎంతోమంది విద్యార్థులు ఆకాంక్షిస్తారు. అది  నెరవేరాలంటే తగిన సన్నద్ధత ఎంతో అవసరం.

Published : 05 Dec 2022 00:23 IST

ఐఐఎంలూ, ఇతర ప్రతిష్ఠాత్మక మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ చేయాలని ఎంతోమంది విద్యార్థులు ఆకాంక్షిస్తారు. అది  నెరవేరాలంటే తగిన సన్నద్ధత ఎంతో అవసరం. దాంట్లో భాగంగా బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌)లో మెరుగైన ప్రతిభను ప్రదర్శించాలి. అందుకోసం ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందామా!

ఎంబీఏ కోర్సుకు అర్హత సాధించాలంటే బృంద చర్చల రౌండ్‌లో అర్హత సాధించడం ఎంతో ముఖ్యం. దీనిలో వివిధ స్థాయుల్లో అభ్యర్థి ప్రతిభను అంచనా వేస్తారు.

సాధారణంగా 8-10 మంది అభ్యర్థులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఓ నిర్దిష్ట అంశంమీద విశ్లేషణాత్మకంగా చర్చించమని అడుగుతారు. 12 నుంచి 15 నిమిషాల్లో చర్చను ముగించాలి. దీన్ని నిపుణుల ప్యానల్‌ పరిశీలిస్తుంది. చర్చ ద్వారా అభ్యర్థుల సంభాషణ నైపుణ్యాలనూ, నాయకత్వ లక్షణాలనూ అంచనా వేస్తారు. వ్యక్తీకరించే అభిప్రాయాలను బట్టి వారి ప్రతిభను మూల్యాంకనం చేస్తారు.

ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి బృంద చర్చ విభాగంలో అర్హత సాధించడం ఎంతో ముఖ్యం. దీనిలో వివిధ స్థాయుల్లో అభ్యర్థి ప్రతిభను అంచనా వేస్తారు. ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి, భావవ్యక్తీకరణ సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం.. వీటన్నింటినీ పరీక్షిస్తారు.
‘టెక్‌ లే ఆఫ్స్‌’, ‘ఇండియన్‌ డిజిటల్‌ రుపీ’, ‘5జీ టెలికాం సర్వీసెస్‌ ఇన్‌ ఇండియా’ ‘ఈజ్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఎ నెసెసరీ ఈవిల్‌?’ లాంటి తాజా అంశాలను చర్చనీయాంశాలుగా నిర్ణయించవచ్చు.

వర్తమానాంశాలు

అభ్యర్థులకు వీటి మీద మంచి పట్టు ఉండాలి. అందుకోసం వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లను చదువుతుండాలి. ముఖ్యంగా ఎడిటోరియల్స్‌ (సంపాదకీయాలు)లో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తారు. చదివిన తర్వాత వాటిని అలాగే వదిలేయకుండా ముఖ్యాంశాలను నోటు పుస్తకంలో రాసుకోవాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచించి అభిప్రాయాలను స్వేచ్ఛగా బయటకు చెప్పడాన్ని సాధన చేయాలి. ఇందులో భాగంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ముఖ్యాంశాలను చర్చించొచ్చు. అప్పుడు మీ హావభావాలు ఎలా ఉన్నాయనేదీ గమనించుకోవాలి. గొంతు మరీ పెద్దగా ఉన్నా, పక్కవాళ్లకు కూడా వినిపించనంత చిన్నగా ఉన్నా మార్చుకోవాలి. 

భావవ్యక్తీకరణ:

మీ ఆలోచనలు, అభిప్రాయాలను వీలైనంత మర్యాదగా, సున్నితంగా తెలియజేయాలి. కొందరు కొట్టినట్టుగా మాట్లాడతారు. వాళ్లు చెప్పేదాంట్లో వాస్తవం ఉండొచ్చు. కానీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రత్యేక విధానమంటూ ఉంటుంది. దాని ప్రకారం ఎదుటివారు ఏమాత్రం నొచ్చుకోకుండా మర్యాదగా అభిప్రాయాలను వెల్లడించాలి. ప్రముఖులు పుస్త్తకాల్లో ఉపయోగించిన పదబంధాలపై అవగాహన ఉంటే వాటిని మీ మాటల్లో ఉపయోగించొచ్చు. ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటానికి ప్రయత్నించొచ్చు. సందర్భానికి తగినట్లుగా సామెతలను వాడితే సంభాషణకు అదనపు ఆకర్షణను
అందిస్తాయి.

వినగలిగే నైపుణ్యం:

బృంద చర్చల్లో వినగలిగే నైపుణ్యాన్ని కూడా పరీక్షిస్తారు. ఎదుటివాళ్లు చెప్పింది శ్రద్ధగా విని అర్థంచేసుకుంటేనే మీరు సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. వినడం, విన్నదాన్ని అప్పటికప్పుడు అర్థంచేసుకుని అబిప్రాయాన్ని చెప్పడం.. ఇవన్నీ వెంటవెంటనే జరగాలి. మీ అభిప్రాయాలను అదేపనిగా చెప్పుకుంటూ వెళ్లిపోకుండా... ఇతరుల అభిప్రాయాలనూ ఓపిగ్గా వినాలి.

సమస్యా పరిష్కారం:

బృంద చర్చల్లో భాగంగా సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. చర్చల స్వరూపం మారిపోయి.. వాతావరణం కాస్త తీవ్రంగానూ మారొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి వాతావరణాన్ని సహనంతో మార్చే నైపుణ్యం అవసరం. చర్చలు పక్కదారి పట్టినా సమస్యా పరిష్కర సామర్థ్యంతో నెట్టుకురాగలిగే నేర్పు అభ్యర్థులకు ఉండాలి.

ఆత్మవిశ్వాసం అవసరం:

అభిప్రాయాలను ఆత్మవిశ్వాసంతో వెల్లడించగలగాలి. అలాగని ‘నేను చెప్పిందే వేదం’ అన్నట్టుగా అతి విశ్వాసాన్ని ప్రదర్శించకూడదు. నసుగుతూ మాట్లాడకూడదు. ఒక్కోసారి చర్చించే అంశం మీద మీకు పూర్తిగా పట్టులేకపోవచ్చు. అలాంటప్పుడు మీకు పరిజ్ఞానం ఉన్నంత వరకే వివరించాలి. తెలియని విషయం గురించి కూడా అంతా నాకే తెలుసన్నట్టుగా చెప్పడం మంచి పద్ధతి కాదు.


చొరవ

 

చర్చల్లో చురుగ్గా పాల్గొనాలి. అలాగని ఎదుటివారు మాట్లాడుతుండగా అత్యుత్సాహంతో అడ్డు తగలకూడదు. అలాగే మిగతా సభ్యులు మాట్లాడుతుంటే మీరు ఏమీ పట్టనట్టుగా కూర్చోకూడదు. వారి అభిప్రాయాలను ఏకీభవిస్తూనో, ఖండిస్తూనో మాట్లాడొచ్చు. ‘మీరు చెప్పింది తప్పు.. ఖండిస్తున్నాను’ అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేకంటే.. ‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు.. ఎందుకంటే..’ అని కారణాన్ని మర్యాదగా వివరించొచ్చు.


ఏ రకమైన అంశాలు?

బృంద చర్చలో భాగంగా.. ఏ అంశాలను చర్చించమంటారనే విషయంలో విద్యార్థులకు అనేక సందేహాలు వస్తుంటాయి. వ్యాపార, ఆర్థిక, సామాజిక అంశాలను చర్చించమని అడగవచ్చు.

వ్యాపార, ఆర్థికాంశాలు: దీంట్లో వర్తమాన వ్యాపార సరళి, ఆర్థిక వ్యవస్థపైన విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించేవిధంగా చర్చాంశాలు ఉంటాయి.  
* ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
* ఆన్‌లైన్‌ షాపింగ్‌ వల్ల భారత్‌లోని చిన్నవ్యాపారులు ఏ విధంగా నష్టపోతున్నారు?
* భారతీయ పౌరులుగా గుర్తింపు పొందడానికి ఆధార్‌ అర్హత సరిపోతుందా?
* బ్యాంకుల విలీనం వల్ల ఆర్థిక వ్యవస్థకు లాభమా? నష్టమా?
* ప్రైవేటీకరణ వల్ల ప్రయోజనాలు... 

వర్తమాన అంశాలు: జాతీయ, అంతర్జాతీయ విధానాలు, లాభనష్టాల గురించి చర్చించమనొచ్చు.
* మీడియా స్వేచ్ఛ వల్ల లాభనష్టాలు
* సైబర్‌ వేధింపులకు కారణాలేమిటి?
* జీఎస్టీ అనేది సంస్కరణేనా?
* ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఎంతవరకు సమర్థనీయం?
* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ అనేది అభివృద్ధా, అవరోధమా?
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌-15 ఏం చెబుతుంది?

సామాజికాంశాలు: విద్యార్థులకు సామాజిక చైతన్యం అవసరం కాబట్టి బృంద చర్చల ద్వారా వివిధ సామాజిక అంశాలపై వారి దృక్పథాన్ని తెలుసుకుంటారు.
* మహిళలపై జరిగే హింసను అరికట్టడానికి మహిళా సాధికారత పరిష్కారం చూపుతుందా?
* నగర ప్రజలు మానసిక అనారోగ్యం బారినపడటానికి కారణం?
* మన దేశంలోని రాష్ట్రాలు పేదరికంతో మగ్గుతున్నాయా?
* స్త్రీ పురుష సమానత్వం
* మరణశిక్షలు విధించడం వల్ల లైంగిక అత్యాచారాలు తగ్గుతాయా?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని