Student visa:విద్యార్థి వీసా..ఏవి ముఖ్యమో తెలుసా?
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం విద్యార్థులు వీసా ప్రక్రియ సన్నాహాల్లో మునిగిపోయిన తరుణమిది. చాలామంది విద్యార్థులు స్లాట్ల లభ్యత గురించి ఆందోళన పడుతున్నారు. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందోననే సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈ క్రమంలో వీసా ప్రక్రియకు సంబంధించి విద్యార్థులు ఏంచేయాలో తెలుసుకుందాం!
అమెరికాలో చదువుకోవాలనుకునే నాన్-ఇమ్మిగ్రెంట్స్‌కు ఎఫ్-1 విద్యార్థి వీసాను జారీచేస్తారు. ఏదైనా అమెరికా యూనివర్సిటీలో చేరడానికి విద్యార్థి దరఖాస్తు చేసి, ఆ యూనివర్సిటీ నుంచి అనుమతిని పొందినట్లయితే.. ఆ విద్యార్థి ఎఫ్-1 వీసా పొందడానికి అర్హత సాధించినట్లే. కోర్సు పూర్తయ్యేంతవరకు అమెరికాలో ఉండి చదవడానికి ఈ వీసా సాయపడుతుంది.
‘యూఎస్‌కు వెళ్లడానికి ఎఫ్-1 స్టూడెంట్ వీసా పొందడమెలా?’ అనే ప్రశ్నను ఎక్కువమంది విద్యార్థులు సాధారణంగా అడుగుతుంటారు. అంచెలంచెలుగా ఉండే స్టూడెంట్ వీసా దరఖాస్తు ప్రక్రియ గురించి ఇప్పుడు చూద్దాం.
ఐ-20 ఫామ్: ఎఫ్-1 వీసా స్లాట్ బుకింగ్ కోసం ఐ-20 ఫామ్ తప్పనిసరి. మీరు ఎఫ్-1 వీసాకు దరఖాస్తు చేస్తే మీ యూనివర్సిటీ మీకు ఐ-20 ఫామ్‌ను పంపిస్తుంది. ఈ ఐ-20 ఫామ్‌తోపాటుగా (Student and Exchange Visitor
Information System) ఐడీ కూడా వస్తుంది.
సెవిస్ ఫీజు కట్టడం: మన దేశంలోని యూఎస్ వీసా కాన్సులేట్ ద్వారా ఐ-20 ఫామ్‌ను పూర్తిచేయాలి. ఎఫ్-1 వీసా కోసం సెవిస్ ఫీజు 350 యూఎస్ డాలర్లను (సుమారు రూ.27 వేలు) చెల్లించాలి.
డీఎస్-160 ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్: తాత్కాలికంగా అమెరికాలో ఉండాలనుకునే అభ్యర్థి డీఎస్-160 ఆన్‌లైన్ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్‌ను నింపాల్సి ఉంటుంది. ఫామ్‌ను నింపిన తర్వాత డీఎస్-160 బార్‌కోడ్ నిర్థారణ షీట్‌ను ప్రింట్ తీసుకోవాలి. ఈ కన్‌ఫర్మేషన్ పేజీని మీకు మీరే ఈ మెయిల్ పంపించుకుంటే బ్యాక్‌అప్ కాపీ మీ దగ్గర ఉంటుంది.
వీసా రిజిస్ట్రేషన్ ఫీజు: యూఎస్ ఎంబసీకి స్టూడెంట్ వీసా కోసం 160 యూఎస్‌డీ+వీఎఫ్‌ఎస్ సర్వీస్ ఛార్జ్+బ్యాంక్ ఛార్జీలను చెల్లించాలి. ఈ మొత్తాన్ని నగదు లేదా డీడీ/చెక్ రూపంలో యాక్సిస్ లేదా సిటీ బ్యాంక్‌లో చెల్లించాలి. అప్పుడు వీసా ఫీజు డూప్లికేట్ రిసీట్‌ను బ్యాంకు జారీచేస్తుంది. దానిపైన 10 అంకెల బార్‌కోడ్ నంబరు అతికించి ఉంటుంది. వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ షెడ్యూల్‌కు ఈ బార్‌కోడ్ నంబరు అవసరం అవుతుంది.
యూఎస్ ఎంబసీ వీసా అపాయింట్‌మెంట్: బార్‌కోడ్, ఫీజు రిసీట్‌తో మీ వీసా అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకు ఒకరోజు ముందు వీసా అప్లికేషన్ సెంటర్- వీఏసీ (బయోమెట్రిక్స్: ఫొటోగ్రాఫ్+ఫింగర్ ప్రింట్) కోసం ఎఫ్-1 వీసా స్లాట్ బుకింగ్‌ను ప్రారంభించాలి.
వీసా ఇంటర్వ్యూకు హాజరు: యూఎస్ స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ బుకింగ్, బయోమెట్రిక్స్ తర్వాత ఎఫ్-1 యూఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. దీంట్లో మీ విద్యా నేపథ్యం, ఆర్థిక సామర్థ్యంతోపాటు అమెరికాలో ఎందుకు చదవాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. ట్రావెల్ హిస్టరీని బట్టి కొందరు విద్యార్థులకు ‘డ్రాప్ బాక్స్ వీసా’ అవకాశం లభిస్తోంది.
వీసా స్లాట్లను రెండు బ్యాచుల్లో ప్రారంభిస్తారు. జూన్, జులై మధ్యలోవి ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. జులై చివర, ఆగస్టులో జరిగే వాటిని తర్వాత తెలియజేస్తారు.
* ఇవే కాకుండా అదనపు వీసా స్లాట్లను ప్రతి వారం పది రోజులకు జోడిస్తూ ఉంటారు. విద్యార్థులు వీటిని గమనిస్తుండాలి.
* ఒకసారి వీసా తిరస్కరణకు గురైతే జూన్, జులై బ్యాచ్‌లో దరఖాస్తు చేసే వీలుండదు. జులై చివరి, ఆగస్టు బ్యాచ్‌లో దరఖాస్తు చేయొచ్చు.
కొవిడ్ తర్వాత దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అప్పటినుంచీ వీసా స్లాట్లు తగ్గాయి. అందుకే ఐ-20 పొందగానే వీసా స్లాటు బుక్ చేసుకోవటం శ్రేయస్కరం. స్ప్రింగ్ 2022 ఇన్‌టేక్ కోసం ప్రయత్నించి స్లాట్లను పొందలేకపోయిన చాలా మంది విద్యార్థులు తమ ఇన్‌టేక్‌ను 2022 వేసవికి వాయిదా వేశారు. చాలా యూనివర్సిటీల్లో సమ్మర్ ఇన్‌టేక్ లేనందున విద్యార్థులు ఫాల్ 2022 ఇన్‌టేక్‌కి వాయిదా వేయాల్సివచ్చింది.
డీఎస్-160 కోసం: https://ceac.state.gov/genniv/
వీసా కోసం: https://cgifederal.secure.force.com/
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశాలు: దిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా
సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
2022లో ఫాల్ సీజన్‌లో యూఎస్ యూనివర్సిటీల్లో చదవాలనుకునే విద్యార్థులు యూఎస్ ఎంబసీలో మార్పుల గురించి తెలుసుకోవాలి. యూఎస్ ఎంబసీ వెబ్‌సైట్లో తమ అపాయింట్‌మెంట్లను షెడ్యూల్ చేసుకోవాల్సివుంటుంది. గత సంవత్సరం విద్యార్థులు రెండు పెద్ద సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకటి... భారత్ నుంచి స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినవాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ వ్యవస్థ క్రాష్ అయ్యింది. రెండోది... నిజమైన దరఖాస్తుదారులు కానప్పటికీ కొంతమంది స్టూడెంట్ వీసా స్లాట్లను కొన్నారు. సీజన్ మొదటి భాగంలో నిజమైన విద్యార్థులే దరఖాస్తు చేశారు. కానీ వేసవిలో దరఖాస్తు చేసినవారిలో మొదటిసారి తిరస్కరణకు గురై రెండు లేదా మూడోసారి వచ్చినవారే ఎక్కువ. దీంతో కొత్త విద్యార్థులకు స్లాట్ బుకింగ్‌లో ఆలస్యం అవుతోంది. అందువల్ల యూఎస్ ఎంబసీ తమ ప్రక్రియలో కొత్తగా కొన్ని మార్పులు చేసింది.
స్టూడెంట్ వీసా సాఫ్ట్‌వేర్‌లో యూఎస్ ఎంబసీ మార్పులు చేసింది. వీటి ప్రకారం 2022 సమ్మర్- స్ప్రింగ్‌లో తిరస్కరణకు గురైనవాళ్లు ఇక ఈ ఏడాది వీసా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం లేదు. యూఎస్ యూనివర్సిటీల నుంచి సంబంధిత డాక్యుమెంట్లు వచ్చిన తర్వాత.. ఇంటర్వ్యూ తేదీల కోసం విద్యార్థులు యూఎస్ ఎంబసీ వెబ్‌సైట్‌ను తరచూ గమనిస్తుండాలి.
ముందు జాగ్రత్త చర్యలు
* ఏజెంట్ ద్వారా కాకుండా విద్యార్థులు సొంతంగా స్లాట్లను బుక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే స్లాట్‌ను ఏ ప్రదేశం నుంచి బుక్ చేశారో ఐపీ అడ్రస్‌ను ట్రాక్ చేసి, రికార్డు చేసే అవకాశం ఉంది.
* ఐ-20 వచ్చాక వీసా ఫీజు 160 యూఎస్ డాలర్లను (సుమారు రూ.12 వేలు) చెల్లించి వీసా స్లాట్‌ను బుక్ చేయాలి. ఆ తర్వాత సెవిస్ ఫీజు 350 యూఎస్ డాలర్లను చెల్లించాలి. ముందుగా ఏదైనా ఒక యూనివర్సిటీలో చేరడానికి సెవిస్ ఫీజు చెల్లించి, ఆ తర్వాత ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీలో చేరాలని నిర్ణయించుకుంటే సంబంధిత యూనివర్సిటీకి ఈ మొత్తాన్ని బదిలీ చేయాలి.
* ఇంటర్వ్యూకు హాజరవటానికి ముందే తగిన విధంగా సన్నద్ధమైతే ఇబ్బంది ఉండదు.
* వీసా ఇంటర్వ్యూకు అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచుకోవాలి.
* ఎంబసీకి ఆహారపదార్థాలు, ల్యాప్‌టాప్స్, బ్యాక్‌ప్యాక్స్, పెద్ద బ్యాగులు తీసుకెళ్లకూడదు. వీలైనన్ని తక్కువ వస్తువులు తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూ కోసం సౌకర్యవంతమైన దుస్తులను ధరించాలి.
ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు
వీసా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా ఉంటాయి.
మీ గురించి: మీ విద్యార్హతలు, అనుభవం, కుటుంబ నేపథ్యం, ఇంగ్లిష్ మాట్లాడటంలో మీ నైపుణ్యం, ఇతర పోటీ పరీక్షల్లో మీరు సాధించిన స్కోరు వివరాల గురించి అడుగుతారు.
యూనివర్సిటీ, కోర్సుల ఎంపిక: ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీనీ, కోర్సునీ ఎందుకు ఎంపిక చేసుకున్నారని అడుగుతారు. ఈ కోర్సు మీ ప్రొఫైల్‌కు ఎలా సరిపోతుంది, భవిష్యత్తులో ఎలా సాయపడుతుంది? ఇంకా ఏయే యూనివర్సిటీలకు దరఖాస్తు చేశారు? ఎన్నిచోట్ల ప్రవేశాలు లభించాయి, ఎన్ని చోట్ల లభించలేదు...లాంటి ప్రశ్నలు అడుగుతారు.
ఆర్థిక స్థోమత, స్పాన్సర్: విద్యారుణం, తల్లిదండ్రుల ఉద్యోగ వివరాలు, వారి వార్షికాదాయం, బ్యాంక్ అకౌంట్‌లో నిల్వ, ఆస్తుల వివరాల గురించి అడుగుతారు. మీ కుటుంబ, మీ స్పాన్సర్ల ఆర్థిక స్థోమత గురించి అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్నలు వేస్తారు.
భవిష్యత్తు ప్రణాళికలు: మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. చదువు పూర్తయిన తర్వాత స్వదేశానికి రావడానికి ఇష్టపడతారా? లేదా అమెరికాలో ఉద్యోగం వస్తే అక్కడే స్థిరపడాలనుకుంటున్నారా... లాంటి ప్రశ్నలనూ అడుగుతారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం
-
Movies News
Anasuya: ప్రెస్మీట్లో కన్నీరు పెట్టుకున్న అనసూయ