ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?

అమెరికాలో చదువుకోబోయే విద్యార్థులు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సివస్తోంది. మరో వైపు కెనడా, యూకే వీసాల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో పాటు దరఖాస్తులు భారీగా పెరగటం, కాన్సులేట్లలో సిబ్బంది కొరత.. వీటన్నిటి కారణంగా వీసా జారీ ప్రక్రియ అసాధారణంగా ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో...

Updated : 22 Aug 2022 10:01 IST

విదేశీ విద్య

అమెరికాలో చదువుకోబోయే విద్యార్థులు వీసా అపాయింట్‌మెంట్‌ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సివస్తోంది. మరో వైపు కెనడా, యూకే వీసాల కోసం దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పేరుకుపోయాయి. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో పాటు దరఖాస్తులు భారీగా పెరగటం, కాన్సులేట్లలో సిబ్బంది కొరత.. వీటన్నిటి కారణంగా వీసా జారీ ప్రక్రియ అసాధారణంగా ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో... విదేశీ విద్య లక్ష్యంగా ఉన్న విద్యార్థులు ఏ జాగ్రత్తలు పాటించాలి? ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఏం చేయాలి?

రోనా వైరస్‌ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల ప్రగతికీ మునుపెన్నడూ ఎరగని అంతరాయం కలిగించింది. విశ్వవిద్యాలయాలు తమ పని తీరులో పెద్ద మార్పులు చేయవలసి వచ్చింది. ముందుగానే విద్యాసంస్థలను మూసివేయడం, బోధించే విధానాన్ని మార్చడం.. ఇలాంటి చర్యలు తీసుకోవాల్సివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రయాణాలు స్తంభించిపోయి పునరుద్ధరించడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుటికి వీసాల జారీ/ విదేశీ ప్రయాణం కొవిడ్‌ పూర్వస్థాయికి తిరిగి రాలేదు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరాలా వద్దా అనేది విద్యార్థులు చదవదల్చిన దేశంలోనూ, స్వదేశంలోనూ అమలవుతున్న ఆంక్షలూ, పరిమితులపై ఆధారపడి ఉంటోంది


కెనడా

కొవిడ్‌ తర్వాత స్టూడెంట్‌ డైరెక్ట్‌ స్ట్రీమ్‌ (ఎస్‌డీఎస్‌)  కేటగిరీ పరిధిలోని విద్యార్థి వీసాలకు 90 రోజులు/ అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. నాన్‌ ఎస్‌డీఎస్‌ కేటగిరీలో నిర్ణయం తీసుకోవడానికి 120 రోజులకు మించి వ్యవధి పడుతోంది. దీంతో విద్యార్థులు ప్రస్తుత ఇన్‌టేక్‌ (ఫాల్‌ 2022)ను కోల్పోతున్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ మార్గమైన ఎస్‌డీఎస్‌ కింద ఏడాది ట్యూషన్‌ ఫీజు, గ్యారెంటీడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్టిఫికెట్‌ కింద జీవన వ్యయానికయ్యే మొత్తం డిపాజిట్‌ చేయాలి. ప్రస్తుత పరిణామాలతో వీసా జాప్యం కారణంగా ఈ మొత్తం నెలల తరబడి నిలిచిపోతోంది. విద్యార్థులు తమ అడ్మిషన్లను వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలలో నిర్దిష్ట కోర్సులకు స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ అందుబాటులో లేదు. దీంతో కోర్సులో చేరలేకపోవడం వారి గ్రాడ్యుయేషన్‌లో తీవ్ర జాప్యానికి దారి తీస్తోంది. యూనివర్సిటీలు తమ కోర్సులను ఆన్‌లైన్‌లో ప్రారంభించేందుకు ఆప్షన్లు ఇవ్వడం ఆపేశాయి. వీసా దరఖాస్తుల ప్రాసెస్‌ వేగం పెంచడం విషయంలో కెనడియన్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి తాజా సమాచారమూ లభించటం లేదు.
వింటర్‌ ఇన్‌టేక్‌ సాధారణంగా జనవరి నుంచి ప్రారంభమవుతుంది. వివిధ కారణాల వల్ల ఫాల్‌ ఇన్‌టేక్‌ను కోల్పోయిన చాలామందికి ఇది రెండో అవకాశం. అనేక విశ్వవిద్యాలయాలు ఈ ఇన్‌టేక్‌లో తమ ప్రధాన ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. దీన్ని సెకండరీ ఇన్‌టేక్‌గా పరిగణిస్తారు.

విశ్వవిద్యాలయాలు/కళాశాలలు తమ అడ్మిషన్‌లను ప్రారంభిస్తున్నప్పుడు స్ప్రింగ్‌, సమ్మర్‌- 2023 ఇన్‌టేక్‌ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవడమే.. వీసా జాప్యాన్ని నివారించే ఏకైక మార్గం. దీనివల్ల 6-8 నెలల వ్యవధి దొరికి విద్యార్థులు తమ వీసాలను సకాలంలో ఫైల్‌ చేయడానికీ, తరగతి ప్రారంభ తేదీకి ముందే కెనడాకు వెళ్లటానికీ వీలవుతుంది.

ఏం చేయవచ్చు?
ఏ ఇన్‌టేక్‌ని ఎంచుకున్నా,  ఇష్టపడే విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్‌ పొందడానికి పాటించాల్సిన చర్యలు కొన్ని ఉంటాయి.  
* మీ కోర్సును ఎంచుకుని, విదేశాల్లో చదువుకోవడానికి మీ కారణాలను నిర్థారించుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో 6-8 నెలల ముందుగానే ఈ దశను ప్లాన్‌ చేయండి. సంవత్సరం ముందుగానే ప్లాన్‌ చేసుకుంటే అది మరింత మంచిది.
* మీ ప్రొఫైల్‌ను సమీక్షించుకోండి.
GRE, GMAT, IELTS, TOEFL లాంటి ప్రామాణిక పరీక్షల కోసం మెరుగ్గా సిద్ధం కండి. సమయం తీసుకుంటుంది కానీ అడ్మిషన్‌ పొందటంలో దీనికి ప్రాముఖ్యం ఉంటుందని గుర్తించండి.
* విశ్వవిద్యాలయాలను షార్ట్‌లిస్ట్‌ చేయండి. మీ ప్రొఫైల్‌ ఆధారంగా దరఖాస్తు చేస్తున్నప్పుడు వాటిని వర్గీకరించండి.
* దరఖాస్తు చేయడం మొదలుపెట్టండి…. ఆర్థిక నిధులను సమకూర్చుకోవడం ఆరంభించండి.
* యూనివర్సిటీ నుంచి మీకు లేఖ అందిన వెంటనే ఫీజు చెల్లించడం మేలు.
* తరగతి ప్రారంభ తేదీకి కనీసం 4 నెలల ముందు వీసా కోసం దరఖాస్తు చేయండి
* ప్రస్తుత ఇన్‌టేక్‌ని కోల్పోయిన విద్యార్థులు, ఫైల్‌ ప్రాసెస్‌లో ఉన్నవారు ఆలస్యం చేయకుండా సంబంధిత కళాశాలను సంప్రదించి, రాబోయే ఇన్‌టేక్‌కు మీ అడ్మిషన్‌ వాయిదా వేసేలా అభ్యర్థించి, దాన్ని నిర్థారించుకోండి.


యు.ఎస్‌.ఎ.

కొన్ని సంవత్సరాలుగా మనదేశ విద్యార్థులకు యు.ఎస్‌.ఎ. ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. ఏవో కొన్ని సంవత్సరాలు మినహా ఈ దేశం గరిష్ఠ సంఖ్యలో విద్యార్థులను ఆకర్షించగలుగుతోంది. కొవిడ్‌ తర్వాత అనేక కారణాల వల్ల వీసా స్లాట్‌లను పొందడం సవాలుగా మారింది. ప్రస్తుతం స్లాట్‌లు వచ్చే ఏడాదికి మాత్రమే ఉన్నాయి.

యు.ఎస్‌. ఎంబసీ, కాన్సులేట్‌లు వచ్చే 12 నెలల్లో దాదాపు 8 లక్షల వీసాలు జారీ చేసే లక్ష్యంతో ఉన్నాయి. సిబ్బంది కొరత, బడ్జెట్‌, నియామకాలు మొదలైన సాధారణ సమస్యల కారణంగా కొవిడ్‌ సమయంలో కాన్సులేట్‌లు పూర్తి స్థాయిలో పనిచేయలేదు. H1B, H4, L1, L2 వీసాల కోసం చాలా డ్రాప్‌బాక్స్‌ స్లాట్‌లు సమ్మర్‌లో అందుబాటులో లేవు. అవి ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అయ్యాయి. 2023 మధ్య నాటికి కాన్సులేట్‌లు పూర్తి సామర్థ్యంతో పనిచేయబోతున్నాయి.

యు.ఎస్‌. కాన్సులేట్‌లు F1 అపాయింట్‌మెంట్‌ల కేటాయింపు విషయంలో ఈ ఏడాది స్టూడెంట్‌ వీసా సీజన్‌ గత సంవత్సరం లాగా ఉండేలా విధానపరమైన మార్పు చేశాయి. గత సంవత్సరం కాన్సులేట్లు జూన్‌లో స్లాట్‌లను తెరిచాయి. చాలామంది F1 విద్యార్థి దరఖాస్తుదారులకు (తిరస్కరిస్తే) రెండో ఇంటర్వ్యూ అవకాశం రాలేదు.

ఈ సంవత్సరం F1 వీసా స్లాట్‌లు జూన్‌లో తెరిచారు. B1/B2 స్లాట్‌లు సెప్టెంబర్‌ 2022 నుంచి ప్రతిరోజూ 500 స్లాట్‌లతో ఓపెన్‌ అవుతాయని భావిస్తున్నారు.

వీసా స్లాట్‌ల ప్రస్తుత స్థితి  
దరఖాస్తుదారు
F1 వీసా స్లాట్‌ పొందడానికి 2-3 వారాలు పడుతోంది. మొదటిసారి తిరస్కరించిన కేసుల (F1 వీసాలు) వీసా స్లాట్‌లు ఆగస్టు 2022లో ఓపెన్‌ అయ్యాయి.
యూఎస్‌కి ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేయడం అంటే మీరు వీసా స్టాంపింగ్‌ పొందడానికి అపాయింట్‌మెంట్‌ పొందవచ్చని కాదు. కాన్సులేట్లు పరిమిత అపాయింట్‌మెంట్‌లతో ఇప్పటికీ పరిమిత విధానంలోనే పనిచేస్తున్నాయి. H1B వీసాల సమీక్ష విధానం మారి దాదాపు 1-6 నెలల ప్రాసెసింగ్‌ సమయం తగ్గడానికి దారితీసింది. యూఎస్‌ ఎంబసీ డ్రాప్‌ బాక్స్‌ స్టాంపింగ్‌ కోసం 2 నుంచి 4 వారాల ప్రాసెసింగ్‌ సమయాన్ని తీసుకుంటోంది.


ఏం చేయవచ్చు?

మీరు స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ యూఎస్‌లో నమోదు చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వీటిని పాటించండి.
* కోర్సు, ఫీజు, చెల్లింపు పద్ధతి మొదలైన వాటి ఆధారంగా వివిధ విశ్వవిద్యాలయాలను ఎంచుకుని వెంటనే మీ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి.
* విశ్వవిద్యాలయాలు
IELTS, TOEFL, GRE, GMAT, SAT, ACT, PTE, DET మొదలైన పరీక్షల స్కోర్లు అడుగుతాయి. వెంటనే సంబంధిత పరీక్షకు సిద్ధమవ్వండి.
* అకడమిక్‌ రెజ్యూమె/ సీవీ, అకడమిక్‌ ట్రాన్‌స్క్రిప్ట్‌లు, ఆంగ్ల భాషా ప్రావీణ్య సర్టిఫికెట్‌,  
SAT/GMAT/ACT/GRE స్కోర్‌లు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ), సిఫార్సు లేఖ మొదలైన పత్రాలతో విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోండి.
* విశ్వవిద్యాలయం నుంచి అంగీకార పత్రం వచ్చాక పాస్‌పోర్ట్‌, ఐడీ ప్రూఫ్‌, దరఖాస్తు రుసుము చెల్లింపు రసీదు, ఫోటో మొదలైన పత్రాలతో
F1-విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
* వెంటనే దరఖాస్తు చేసుకుని, ఐ 20ని అక్టోబరులోగా ఆశించడం ఉత్తమం. దీనివల్ల మీ వీసా స్లాట్‌ను బుక్‌ చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ను మిస్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
* ఫాల్‌ ఇన్‌టేక్‌ మిస్‌ అయిన విద్యార్థులు కూడా స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమిత పోటీతో, అవాంతరాలు లేని విధంగా విదేశీ విద్యాభ్యాసాన్ని మార్చుకునే అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అగ్ర విశ్వవిద్యాలయాలు స్ప్రింగ్‌ ఇన్‌టేక్‌లో తక్కువ కోర్సులే అందిస్తాయని చాలామంది విద్యార్థుల నమ్మిక. కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి కోర్సు కరిక్యులమ్‌ అన్ని ఇన్‌టేక్‌ల కోసం రూపొందిస్తారనేది!

ఇవి గమనించండి!
1 అన్ని అడ్డంకులనూ దృష్టిలో ఉంచుకుని, వీలైనంత ముందుగానే విదేశీవిద్యను ప్లాన్‌ చేసుకోవడం మంచిది.
2 కనీసం ఏడాది ముందుగానే విదేశీ విద్యకు ప్రణాళికను ప్రారంభించండి.
3 వీసా కోసం కనీసం 3 నెలల ముందుగానే దరఖాస్తు చేయటం అవసరం.
4 ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవడానికి వీసాను ముందుగానే పొందివుండటం ఎల్లప్పుడూ మంచిది.
5 ముందుగానే మేల్కొంటే విమాన టిక్కెట్‌ ఛార్జీ ఆదా చేయవచ్చు. అడ్మిషన్‌ వాయిదా అవసరం ఉండదు కాబట్టి ముందస్తు చెల్లింపుపై వడ్డీని ఆదా చేయవచ్చు.
6 వీటితో పాటు- విశ్వవిద్యాలయంలో వసతిని ఎంచుకునే వీలుంటుంది. మనశ్శాంతితో విద్యాభ్యాసం ఆరంభించవచ్చు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు