ఈ నైపుణ్యాలుంటే.. విదేశీ విద్య సులువు!

ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళుతోన్న  విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఎంతో కష్టపడి చదివి ఫారిన్‌ వర్సిటీల్లో  సీటు సంపాదిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకూ పెరిగిన వాతావరణం, పరిస్థితులు వేరు.

Published : 05 Oct 2022 00:04 IST

ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళుతోన్న  విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఎంతో కష్టపడి చదివి ఫారిన్‌ వర్సిటీల్లో  సీటు సంపాదిస్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకూ పెరిగిన వాతావరణం, పరిస్థితులు వేరు. అక్కడకు వెళ్లిన తర్వాత కనిపించేవి వేరు. అక్కడి జీవన, విద్యా విధానాలు, సంస్కృతి అన్నీ కొత్తగానే కనిపిస్తాయి. ఒకపక్క చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగమూ చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో కుటుంబసభ్యుల మీద బెంగపెట్టుకోవడం, భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోవడం లాంటి సమస్యలూ ఎదురుకావచ్చు. కొన్ని నైపుణ్యాలను పెంచుకుంటే వీటి నుంచి త్వరగా బయటపడొచ్చు.

పరిచయాలు పెంచుకోవడం 1
విదేశాల్లో చదువుకునే వారికి ఈ నైపుణ్యం తప్పనిసరి. స్థానిక వసతి, రవాణా, మార్కెట్లు, కరెన్సీ విషయాల్లో అవగాహన ఉండటం ఎంతో అవసరం. రోజువారీ పనులు సక్రమంగా సాగాలంటే ఈ విషయాలన్నీ తెలిసుండాలి. అందుకోసం ఇతరులతో పరిచయాలు పెంచుకోగలిగే నేర్పు ఉండాలి. అందరితో త్వరగా కలిసిపోగలిగితే చాలా విషయాలు తెలుస్తాయి. నలుగురితో కలిసిపోయే నేర్పు అనేది కొత్త పరిస్థితులు, వాతావరణానికి అలవాటు పడటానికి బాగా తోడ్పడుతుంది. అలాగే కోర్సులో భాగంగా వివిధ ఇంటర్న్‌షిప్‌లు, ట్రైనింగ్‌ పోగ్రామ్‌లు, సెమినార్లు, గ్రూప్‌ ప్రాజెక్టుల్లో పనిచేయాల్సి వస్తుంది. వీటన్నింటి వల్లా నలుగురితో కలిసిమెలిసి పనిచేయగలగడం ఎంతో అవసరం. త్వరగా ఉద్యోగంలో స్థిరపడటానికీ ఈ నైపుణ్యం ఎంతగానో తోడ్పడుతుంది.

త్వరగా అలవాటుపడటం 2

వెళ్లిన దేశంలోని వాతావరణ పరిస్థితులు, సంస్కృతీ, భాష, వంటకాలు.. ఇలా అన్నీ కొత్తగానే ఉంటాయి. వీటన్నింటికీ నెమ్మదిగా అలవాటు పడగలగాలి. అప్పటివరకు మనకు తెలిసిన, చిన్నతనం నుంచీ అలవాటు పడిన ప్రపంచం సహజంగానే సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ పరిధి దాటి బయటకు వెళ్లినప్పుడు కాస్త అసౌకర్యంగానే ఉంటుంది. ఇవన్నీ జీవితంలో మార్పు తీసుకొచ్చే అనుభవాలే. వీటిని అర్థం చేసుకుంటూ, అలవాటుపడుతూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటుపడగలిగితే ఏకాగ్రతతో చదవడానికి అకాశం ఉంటుంది.

నిర్వహణ సామర్థ్యం 3
ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. తరగతులకు హాజరుకావాలి, అసైన్‌మెంట్లు సమర్పించాలి, గ్రూప్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. మరోపక్క పార్ట్‌టైమ్‌ ఉద్యోగమూ చేయాల్సి ఉంటుంది. చదువుకుంటూనే ఇవన్నీ చేయాలంటే నిర్వహణ సామర్థ్యం ఎంతో అవసరం. ఈ నైపుణ్యం లేకపోతే పనుల ప్రాధాన్యాలను గుర్తించలేక విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. దాంతో అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. సమయ పాలన, అంచనా వేయగలిగే సామర్థ్యంతో పనులన్నింటినీ ప్రణాళికబద్ధంగా పూర్తిచేయొచ్చు. అలాగే వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఖర్చులను అదుపులో ఉంచుకుంటే కొత్తచోట ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. సొంతంగా వండుకోవడం, ప్రజారవాణా సదుపాయాలను వినియోగించడం, నలుగురితో కలిసి బయటకు వెళ్లడం వల్ల ఖర్చులను చాలావరకు నియంత్రణలో పెట్టుకోవచ్చు.

పరిశోధనాసక్తి 4
విదేశీ యూనివర్సిటీలన్నీ తమ విద్యా నాణ్యతను పెంచుకోవడానికే ప్రయత్నిస్తాయి. వివిధ అంశాల బోధనకు అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి. ఈ విద్యలో పరిశోధన కూడా అంతర్లీనంగా ఉంటుంది. తమ పరిజ్ఞానాన్నీ, తార్కిక ఆలోచనా నైపుణ్యాన్నీ పెంచుకునే అవకాశాలు విద్యార్థులకు విస్తృతంగా ఉంటాయి. కాబట్టి ప్రత్యేకాసక్తి ఉన్న సబ్జెక్టుని ఎంచుకుని దాంట్లో పరిశోధనలు చేసే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అలాగే లెక్చరర్లు ప్రతి నిమిషం మీ వెన్నంటే ఉండరు. తరగతిలో లెక్చరర్లు బోధించే సమయం వారానికి కొన్ని గంటలపాటు పరిమితంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత నేర్చుకోవడం, అవసరమైన సమాచారాన్ని సేకరించగలగడం లాంటివన్నీ సొంతంగానే చేయగలగాలి.

స్వీయ అవగాహన 5
ఈ నైపుణ్యం లేకపోతే మీ విషయంలో మీరే ఒక అవగాహనకు రావడం కష్టమవుతుంది. విద్యార్థిగా మీ బలాలు, బలహీనతలను స్పష్టంగా గుర్తించగలగాలి. అప్పుడే ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకుని వాటిని మెరుగుపరుచుకునే వీలుంటుంది. బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం, వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం లాంటివి చేయొచ్చు.

భాషా నైపుణ్యాలు 6
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంగ్లిష్‌ చక్కగా మాట్లాడే, రాసే నైపుణ్యం తప్పనిసరి. లెక్చర్లు అర్థంకావడానికీ, పరీక్షలు, అసైన్‌మెంట్లను సమర్థంగా పూర్తిచేయడానికీ ఆంగ్ల భాషా నైపుణ్యం ఎంతో తోడ్పడుతుంది. దీంతోపాటుగా స్థానిక భాషను అర్థంచేసుకోవడం, మాట్లాడటానికీ ప్రయత్నిస్తే స్థానికులతోనూ త్వరగా కలిసిపోగలుగుతారు. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినా భాషాపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పైగా కొత్త భాషను నేర్చుకోవడం అంటే మెదడుకు పదునుపెట్టినట్లే.

తొలి ప్రాధాన్యం 7
చదువు నిమిత్తం కుటుంబానికీ, స్నేహితులకూ దూరంగా ఇతర దేశాలకు వెళతారు. ఈ సమయంలో మీ దృష్టిని మళ్లించే అంశాలెన్నో ఎదురుకావచ్చు. కొత్త స్నేహితులు, అప్పటివరకూ చూడని కొత్త ప్రపంచం ఆకర్షణలో పడి చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి లెక్చరుకూ హాజరుకావడం, సకాలంలో అసైన్‌మెంట్లు పూర్తిచేయడం.. ఇవన్నీ మంచి విద్యార్థిగా మీరు చేయాల్సిన పనులు. మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ చదువే కావాలి.. ఆ తర్వాతే మిగిలినవన్నీ. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటే విదేశీ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు