విదేశీ వర్సిటీల్లో.. ఉచితంగా నేర్చుకుందాం!

విదేశాలకు వెళ్లి చదవాలనీ, నాణ్యమైన విద్యా బోధనను అందుకోవాలనీ చాలామంది విద్యార్థులు అనుకుంటారు. కానీ రకరకాలైన కారణాల వల్ల వెళ్లలేకపోతుంటారు. ఫీజు  ఎక్కువనే భయం ఉండనే ఉంది.

Published : 11 Jul 2023 00:32 IST

విదేశాలకు వెళ్లి చదవాలనీ, నాణ్యమైన విద్యా బోధనను అందుకోవాలనీ చాలామంది విద్యార్థులు అనుకుంటారు. కానీ రకరకాలైన కారణాల వల్ల వెళ్లలేకపోతుంటారు. ఫీజు  ఎక్కువనే భయం ఉండనే ఉంది. కానీ అక్కడికి వెళ్లకుండానే ఆ యూనివర్సిటీల్లో చదివే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సంస్థల్లో వివిధ కోర్సులు చేయవచ్చు. ఆ వివరాలేంటో చూద్దామా!

ప్రఖ్యాతిగాంచిన విదేశీ యూనివర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరి కోసం కొన్ని ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇవి వారి విద్యాసంస్థల్లో ప్రమాణాల స్థాయిని పరిచయం చేయడమే కాకుండా... విద్యార్థులు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేందుకు పనికొస్తాయి. ఇటువంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన విభాగాల్లో ప్రాథమికాంశాలు ఉచితంగా నేర్చుకోవచ్చు. అంతేకాదు, విదేశీ విశ్వవిద్యాలయం నుంచి చదివామన్న తృప్తీ లభిస్తుంది, జాబ్‌ మార్కెట్‌లో మంచి అవకాశాలూ  అందుకోవచ్చు. ఇవి అధికశాతం ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌తో అనుసంధానమై పనిచేస్తున్నాయి. అంటే సంబంధిత వర్సిటీ అధ్యాపకులే ఈ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా బోధిస్తారన్నమాట.


హార్వర్డ్‌ యూనివర్సిటీ

వీ లీగ్‌లో ముఖ్యమైన, పురాతనమైన వర్సిటీ ఇది. దాదాపు 600లకు పైగా కోర్సులను విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది. ఉన్నత స్థాయి ప్రమాణాలతో, తమ విద్యాబోధన ఎలా ఉంటుందనే విషయం తెలిసేలా ఈ కోర్సులు ఉంటాయి. ఇవి ఒకటి నుంచి పన్నెండు వారాల వ్యవధితో లభిస్తాయి. సాహిత్యం, లా, బిగ్‌డేటా, సామాజిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, ప్రోగ్రామింగ్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, చరిత్ర, న్యూరోసైన్స్‌.. ఇలా విభిన్న అంశాలను నేర్చుకునే వీలుంది. ఇవేకాక ఆధునిక సాంకేతిక కోర్సులైన మెషిన్‌ లెర్నింగ్‌, పైతాన్‌ లాంగ్వేజ్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, డేటా సైన్స్‌ వంటి వాటిలోనూ ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు.


జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ

మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ - మాక్స్‌ ద్వారా ఈ విద్యాసంస్థ ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది. అప్పటి నుంచి ముప్ఫై లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. అంతేకాదు.. ఇవన్నీ వివిధ ర్యాంకింగ్‌ సిస్టమ్స్‌లో పోటీ పడి టాప్‌ ర్యాంకులు పొందిన కోర్సులు. ఈ కాలేజ్‌ అందించే మొత్తం 30 కోర్సుల్లో బిజినెస్‌, కంప్యూటింగ్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథమెటిక్స్‌, సప్లైచెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ అనే విభాగాలు ఉన్నాయి. వీటిలో డేటా అనలిటిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, యూఎక్స్‌ డిజైన్‌, డేటా అనాలిసిస్‌, హెల్త్‌ ఇన్ఫర్మేటిక్స్‌, పైతాన్‌, జావా, డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిదమ్స్‌, మెకానిక్స్‌, మెటీరియల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెషిన్‌ డిజైన్‌, అనలిటిక్స్‌ మోడలింగ్‌, స్టాటిస్టిక్స్‌, ఇన్నోవేషన్‌ లీడర్‌షిప్‌, సప్లై చెయిన్‌ ప్రిన్సిపల్స్‌... వంటి అనేక అంశాలు చదివే వీలుంది. ఎడ్‌ఎక్స్‌, కోర్సెరా, ఉడాసిటీ వంటి ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా వీటికి ఉచితంగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు.


మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)

ఇందులో కోర్సులు గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయుల్లో  ఉన్నాయి. ఇంజినీరింగ్‌, అర్బన్‌ స్టడీస్‌, మేనేజ్‌మెంట్‌, మ్యాథమెటిక్స్‌, లిటరేచర్‌, ఆర్కిటెక్చర్‌, జాగ్రఫీ, కాగ్నిటివ్‌ సైన్స్‌, హిస్టరీ, ఏరోనాటిక్స్‌, ఫిజిక్స్‌, ఎకనమిక్స్‌, లింగ్విస్టిక్స్‌ - ఫిలాసఫీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆంత్రొపాలజీ, మీడియా స్టడీస్‌, బయాలజీ, న్యూక్లియర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌.. ఇలా దాదాపు అన్నిరకాలైన సబ్జెక్టులపై సుమారు 3 వేల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకుని చదివేవి, ఇంటరాక్టివ్‌ పద్ధతిలో లభించేవి విడివిడిగా దొరుకుతున్నాయి. సైంటిఫిక్‌ థియరీలను నేర్చుకునే క్రమంలో దీన్ని మించిన వర్సిటీ మరొకటి లేదనే ప్రఖ్యాతి ఉంది.


యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా

డ్‌ఎక్స్‌ సంస్థతో అనుసంధానమై కోర్సులు అందిస్తోందీ వర్సిటీ. 2012 నుంచి దాదాపు 150 దేశాలకు చెందిన 40 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరారు. ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్స్‌ కూడా ఇస్తుంది. బిజినెస్‌ రైటింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, జర్నలిజం, సోషల్‌ జస్టిస్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీస్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌.. ఇలా లభిస్తున్నాయి. గంటల నుంచి వారాల వ్యవధిగల ఈ కోర్సుల్లో ప్రొఫెషనల్‌ సర్టిఫికెట్‌ కావాలంటే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


మిషిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ

ఫొటోగ్రఫీ, మ్యూజిక్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, మైండ్‌వేర్‌, జర్నలిజం, రైటింగ్‌, పిక్సల్‌ ఆర్ట్‌, క్రియేటివిటీ, బిజినెస్‌ వంటి కోర్సులు చేయవచ్చు. గమనిస్తే... ఈ వర్సిటీ అందించేవన్నీ సంప్రదాయ చదువులకు భిన్నంగా ఉండే మార్గాలే! వీటి గురించి తెలుసుకోవాలనుకునే విద్యార్థులకు సులభంగా సమాచారం దొరికేలా ఈ ప్రోగ్రామ్స్‌ను అందుబాటులో ఉంచారు. ఇవి పూర్తి చేసిన తర్వాత కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. వారానికి ఎన్నిగంటలు కావాలో అలా చదువుకునే వీలుంటుంది. దాదాపుగా 6 నెలల్లో పూర్తిచేయవచ్చు.


కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ది ఆర్ట్స్‌

ఆర్ట్స్‌ కాలేజీ నుంచి విద్యార్థులు స్పెషలైజ్డ్‌ ప్రోగ్రామ్స్‌ చేసే వీలుంది. క్రెడిట్స్‌, సర్టిఫికెట్స్‌ కావాలంటే ఫీజు చెల్లించాలి. ఫ్రీలాన్సింగ్‌ బిజినెస్‌, గేమ్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, మ్యూజిక్‌ థియరీ - టెక్నాలజీ, పొయిట్రీ, యూఐ/యూఎక్స్‌ డిజైన్‌, వెబ్‌ డిజైన్‌ వంటి ప్రోగామ్స్‌ను కోర్సెరా ప్లాట్‌ఫామ్‌ నుంచి చేయవచ్చు.


యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌

యూకేలో ఉన్న టాప్‌ కాలేజీల్లో ఇదీ ఒకటి. ఇటీవల విడుదల చేసిన క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇందులో ఆంత్రొపాలజీ, సిటిజన్‌ సైన్స్‌, కల్చర్‌, హెల్త్‌... ఇలా 170కి పైగా ప్రోగామ్స్‌ ఆన్‌లైన్‌లో చదవొచ్చు. దాదాపుగా ఉచితంగా లభిస్తాయి. కొన్ని ప్రత్యేక  ప్రోగామ్స్‌కి మాత్రం ఫీజు చెల్లించాలి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని