విదేశాలకు వెళ్తున్నారా?

విదేశాలకు వెళ్లి చదువుకోవాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. ఆ కల నెరివేరినప్పుడు సంతోషంతోపాటు కాస్త బెరుకుగా కూడా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉండాలో, ఎలాంటి స్నేహితులు దొరుకుతారో అనే రకరకాలైన ఆలోచనల్లో

Updated : 26 Jul 2022 09:13 IST

విదేశాలకు వెళ్లి చదువుకోవాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. ఆ కల నెరివేరినప్పుడు సంతోషంతోపాటు కాస్త బెరుకుగా కూడా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉండాలో, ఎలాంటి స్నేహితులు దొరుకుతారో అనే రకరకాలైన ఆలోచనల్లో మునిగిపోతారు. వసతి, భోజనానికి అలవాటుపడటం మరో సమస్య. అయితే అంతగా భయపడాల్సిన పనేమీ లేదు. ముందుగానే అన్ని ఏర్పాట్లు  జాగ్రత్తగా చేసుకుంటే విదేశీ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది!

భారత విద్యార్థులు విదేశీ విద్య అనగానే మొదటగా ఎంచుకునేది అమెరికానే! ఆ తర్వాత యూకే, కెనడా, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్‌ వంటి దేశాలకు వెళ్తున్నారు. వీటిలో ఇంగ్లిష్‌ తెలిసినవారు సులువుగా నెగ్గుకు   రావచ్చు. ఈ దేశాలన్నీ ‘ఫ్రెండ్లీ ఇమిగ్రేషన్‌’ నిబంధనలతో విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికేవే. అవకాశాన్ని బట్టి దేశాన్ని ఎంచుకోవచ్చు. వీసా, పాస్‌పోర్ట్‌, ఇతర పేపర్‌ వర్క్‌ అంతా జాగ్రత్తగా చేసుకోవాలి.

బ్యాంకు ఖాతాను సరిగ్గా నిర్వహించడం మరో ప్రధానమైన అంశం. బ్యాంకులు ఇంటర్నేషనల్‌ ఛార్జెస్‌ పేరుతో అదనపు రుసుములు వసూలు చేస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలి. అలాగే వెళ్తోన్న దేశానికి సంబంధించి... డబ్బు మారకపు విలువ, వినియోగించే విధానం గురించి కనీస అవగాహన తప్పనిసరి.

వెళ్లాల్సిన కాలేజీ/యూనివర్సిటీల అత్యవసర నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ఎయిర్‌పోర్టులో ఏదైనా సమస్య తలెత్తినా, అక్కడ దిగాక దారి తెలీక ఇబ్బంది పడినా వెంటనే కాల్‌ చేసి సాయం పొందేలా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఫోన్‌లోనే కాకుండా కాగితంపై రాసుకుని సామాన్లలో ఉంచడం మంచిది.

ఫోన్‌ ప్లాన్‌ను సరిచూసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం వాడుతున్న నెట్‌వర్క్‌లో అంతర్జాతీయ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయా, ఉంటే ధర ఎలా ఉందనేది గమనించాలి. మనకు సరిపోకపోతే ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఇబ్బంది పడకుండా ఉంటాం.

ఫలానా దేశం అని నిర్ణయించుకున్నాక అక్కడి వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. దానికి తగిన విధంగా దుస్తులు సర్దుకోవాలి. ముఖ్యంగా
మంచు కురిసే సమయాల్లో అప్రమత్తత అవసరం.

వెళ్లే ముందు అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవడంతోపాటు కనీస ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే అక్కడికి వెళ్లాక అనారోగ్యం బారినపడటం, ఒంటరిగా కష్టపడటం వంటి సమస్యలు ఉండవు. తలనొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలకు తగిన మందులు ముందుగానే వైద్యుల సలహా మేరకు దగ్గర ఉంచుకోవాలి.

చాలామంది ఇంటి మీద బెంగ పెట్టుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం. ఇన్నాళ్లూ ఉన్నఊరు, ప్రేమించే అమ్మానాన్నలకు దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. ఇంటి నుంచి బాగా ఇష్టమైన ఆహారాన్ని తీసుకెళ్లడం, తరచూ తల్లిదండ్రులతో మాట్లాడటం వల్ల వారిని మిస్‌ అవుతున్నామనే భావనను కాస్తయినా తగ్గించుకోవచ్చు.

కొత్తలో అక్కడి సంస్కృతి తెలీక చిన్నచిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే వెళ్లే దేశం గురించి కొంత వివరం తెలుసుకోవాలి. అక్కడి పద్ధతులు, చట్టాలు, పౌరులు పాటించే నియమ నిబంధనల గురించి అవగాహన పెంచుకోవాలి.

ఏ పనైనా మొదటిసారి చేసేటప్పుడు భయంగానే ఉంటుంది. ఇన్నాళ్లూ సౌకర్యాల మధ్య తల్లిదండ్రుల సంరక్షణలో ఉండి, హఠాత్తుగా సొంతంగా అన్నీ చూసుకోవడం అంటే కొత్తలో కొంత ఇబ్బంది తప్పదు. కానీ ఇది అందరూ ఎదుర్కొనేదే. జీవితంలో ఇదో కొత్త అనుభవం! పక్కా ప్రణాళిక, స్థిరమైన ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయాణాన్ని సంతోషంగా మొదలుపెట్టండి!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని