ఐటీ కొలువులు తగ్గి.. విదేశీ చదువులకు మొగ్గు!
ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికై ఏడాది దాటినా కంపెనీల నుంచి పిలువులు రావడం లేదు.. చదువు పూర్తయి సంవత్సరం అయినా శుభవార్త చెవిన పడటం లేదు.
అమెరికా, కెనడా, యూకే తదితర దేశాల వైపు విద్యార్థుల చూపు
ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికై ఏడాది దాటినా కంపెనీల నుంచి పిలువులు రావడం లేదు.. చదువు పూర్తయి సంవత్సరం అయినా శుభవార్త చెవిన పడటం లేదు. ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అధికసంఖ్యలో విద్యార్థులు విదేశీవిద్యకు మొగ్గు చూపుతున్నారు. ఒకటీ రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత విదేశీవిద్యపై ఆలోచిద్దాం అనుకున్నవారూ ఇక ఆలస్యం చేయకుండా వీసాలకు దరఖాస్తు చేస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాలల వర్గాలు చెబుతున్నాయి. 2022 జూన్‌లో బీటెక్ పూర్తయిన వారికి 2021 జులై నుంచి డిసెంబరు వరకు విడతలవారీగా పలు కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. ఆర్థిక మాంద్యం భయంతో ఐటీ రంగంలో గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొనడంతో వివిధ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను, ఖర్చును తగ్గించుకునే భాగంగా జాయినింగ్‌లను పెండింగ్‌లో పెట్టాయని ప్రాంగణ నియామకాల అధికారులు చెబుతున్నారు. దీంతో ఆఫర్ లెటర్లు అందుకున్నవారిలో చాలామంది ఇంతవరకు కొలువుల్లో చేరలేదు. నెలల తరబడి వేచిచూసి.. ఇక ప్రయోజనం లేదని విదేశీవిద్యకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గతేడాది కంటే ఎక్కువగానే ఉండొచ్చు!
అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లి ఎంఎస్ చేసేందుకు విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021లో చాలామంది విద్యార్థులు ఆగిపోవడంతో గత సంవత్సరం అత్యధికంగా 7.50 లక్షల మంది విదేశీవిద్యకు వెళ్లారు. ఒక ఏడాదిలో ఇంత అధికసంఖ్యలో వెళ్లడం ఇదే రికార్డు. వారిలో అమెరికాకు 1.90 లక్షలు, కెనడాకు 1.85 లక్షలు, యూకేకు 1.32 లక్షల మంది వెళ్లారు. అమెరికా, కెనడాకు వెళ్లేవారిలో 20-25 శాతం మంది తెలుగు రాష్ట్రాల వారు ఉంటున్నారని అంచనా. ఈ ఏడాది (2023) మే/జూన్ నాటికి ఇంజినీరింగ్ పూర్తయినవారూ తమకు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాల్లోకి తీసుకోవడం ఆలస్యం కావచ్చని ఎక్కువమంది భావిస్తున్నారు. ఫలితంగా ఈ సంవత్సరం విదేశీ చదువులకు వెళ్లేవారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘కొలువులు రానివారే కాదు.. మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా వదులుకుని వెళ్లేవారూ ఈసారి ఎక్కువగా కనిపిస్తున్నారు’ అని సీబీఐటీ ప్రాంగణ నియామకాల అధికారి ఎన్.ఎల్.ఎన్.రెడ్డి చెప్పారు.
అప్పటికి మాంద్యం ముగిసిపోవచ్చని..!
అమెరికాలో ఎంఎస్‌కు.. వచ్చే ఆగస్టు/సెప్టెంబరు ఫాల్ సీజన్‌లో వెళ్లినా 2025 ఏప్రిల్‌కు చదువు పూర్తవుతుంది. ఆర్థిక మాంద్యం, అనిశ్చిత పరిస్థితులు ఉన్నా అక్కడ చదువు పూర్తయ్యేలోపు ముగిసిపోవచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా అమెరికాలోని పలు కంపెనీలు ఉద్యోగులను తొలగించినా.. నియామకాలు ఆలస్యమైనా.. సాధారణ పరిస్థితి తర్వాత మళ్లీ ప్రాజెక్టులు పెరిగి ఉద్యోగులను ఎక్కువ మందిని నియమించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వెళ్లేవారికి.. ఆర్థిక మాంద్యం సమస్య కాదని విదేశీ కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా కాన్సులేట్ కార్యాలయాలు సైతం ఈసారి సంఖ్య పెరగవచ్చని అంచనాకు వచ్చి వీసాలు త్వరగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థులపై ఒత్తిడి..
విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చిన కొన్ని కంపెనీలు జాయినింగ్ తేదీలను ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయి. దానివల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ఎందుకు ఖాళీగా ఉన్నావు? ఉద్యోగం వచ్చిందన్నారు కదా?’ అంటూ బంధువులు, తెలిసినవారు తరచూ అడుగుతుంటారు. దీంతో ఒకటీ రెండేళ్లు కొలువు చేసిన తర్వాత వెళ్లొచ్చని అనుకున్నవారూ ఇప్పుడు విదేశీ చదువులకు వెళుతున్నారు. ఈ సంవత్సరం విదేశీ చదువులకు వెళ్లేవారి సంఖ్య కనీసం 10 శాతం పెరగొచ్చు. అయితే సైబర్ టెక్నాలజీ, ఐఓటీ, డేటాసైన్స్, ఏడబ్ల్యూఎస్ లాంటి తాజా టెక్నాలజీలపై పట్టున్న వాళ్లకు ఐటీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వారికి ఎక్కడైనా ఉద్యోగాలకు కొదవలేదు.
హెచ్.విజయకుమార్ ప్రాంగణ నియామకాల అధికారి, వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్‌పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక