TS Exam 2022: ఆహ్లాదం కలిగించినా.. అల్లకల్లోలం సృష్టించినా!

భూవాతావరణంలో వీచే గాలులు విభిన్న వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంటాయి. రుతుపవనాలు వచ్చేందుకు, వర్షాలు కురిసేందుకు ఇవే ప్రధాన కారణం. వాతావరణం ఆహ్లాదంగా మారినా, తుపానుల వల్ల అల్లకల్లోలాలు ఏర్పడినా వీటి ప్రభావమే.

Updated : 15 Aug 2022 13:07 IST

జనరల్‌ స్టడీస్‌

ప్రపంచ భూగోళ శాస్త్రం

భూవాతావరణంలో వీచే గాలులు విభిన్న వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంటాయి. రుతుపవనాలు వచ్చేందుకు, వర్షాలు కురిసేందుకు ఇవే ప్రధాన కారణం. వాతావరణం ఆహ్లాదంగా మారినా, తుపానుల వల్ల అల్లకల్లోలాలు ఏర్పడినా వీటి ప్రభావమే. ఈ పవనాలు ఎలా మొదలవుతాయి? ఎటు నుంచి ఎటు పయనిస్తాయి? నైసర్గిక స్వరూపాలకు అనుగుణంగా ఎప్పుడు ఎక్కడ ఎలా వర్షాలు కురిపిస్తాయి? తదితర అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.

పవనాలు

భూమికి క్షితిజ సమాంతరంగా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వీచే వాయు అణువుల సమూహాన్ని పవనం (wind) అంటారు. భూ ఉపరితలం నుంచి వాతావరణంలో ఊర్ధ్వముఖంగా కదిలే వాయు అణువుల సమూహాన్ని గాలి ప్రవాహం అని పిలుస్తారు. పవనాలకు కారణం ఉష్ణశక్తి తీవ్రతలోని వ్యత్యాసం. గాలి ప్రవాహానికి కారణం కొరియాలిస్‌ బలాలు (ఒక చోటు నుంచి మరో చోటుకు స్వాభావికంగా కదులుతున్న ప్రతి వస్తువు ఉత్తరార్ధ గోళంలో దాని కుడి పక్కకు, దక్షిణార్ధ గోళంలో దాని ఎడమ పక్కకు కదులుతుందని ఫెర్రల్‌ సిద్ధాంతం తెలుపుతుంది. దీన్ని కొరియాలిస్‌ బలం అంటారు).

ప్రతి పవనానికి దిశ, వేగం అనే లక్షణాలు ఉంటాయి. పవనాలు వీచే దిశ ఆధారంగా వాటికి నామకరణం చేస్తారు. ఉదాహరణకు తూర్పు నుంచి వీచే పవనాలను తూర్పు పవనాలు, ఈశాన్యం నుంచి వీచే పవనాలను ఈశాన్య పవనాలని అంటారు. పవన వేగాన్ని ఎనిమోమీటర్‌, బీఫార్ట్‌ స్కేల్‌తో కొలుస్తారు. పవనం వీచే దిక్కును పవన సూచీ అనే పరికరంతో తెలుసుకుంటారు.

మూడు రకాలు

పవనాలను వేగం, దిశ, అవి వీచే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి 3 రకాలుగా విభజించారు.

ప్రపంచ పవనాలు: అధిక పీడన మేఖలల నుంచి అల్పపీడన మేఖలలకు భూమండలంపైన, భూమి చుట్టూ ఒక క్రమపద్ధతిలో స్థిరంగా, నిర్ణీత దిశలో వీచే పవనాలను ప్రపంచ పవనాలు అంటారు. భూమండలంపై ఉన్న రకరకాల ఉష్ణోగ్రతలు, పీడనాల విస్తరణను అనుసరించి ఇవి వీస్తుంటాయి. వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు.

ఎ) వ్యాపార పవనాలు: ఇవి ఉప అయన రేఖ అధిక పీడన ప్రాంతం నుంచి భూమధ్యరేఖ అల్పపీడన ప్రాంతం వైపు 5 నుంచి 35 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలు. ఈ పవనాలు ఉత్తరార్ధ గోళంలో ఈశాన్య దిశలో మొదలై నైరుతి వైపు కదులుతూ ఉండటం వల్ల అక్కడ వీటిని ఈశాన్య వ్యాపార పవనాలు అని, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయ దిశలో మొదలై వాయవ్యం వైపు వీస్తున్నందున అక్కడ ఆగ్నేయ వ్యాపార పవనాలు అని పిలుస్తారు. ఇవి వ్యాపార సంబంధమైన నాటు పడవల ప్రయాణానికి ఉపయోగకరంగా ఉండటం వల్ల వీటికి వ్యాపార పవనాలు అని పేరు వచ్చింది.

లక్షణాలు

ఇతర పవనాలతో పోలిస్తే ఇవి అత్యంత స్థిరంగా, వేగంగా, ప్రశాంతంగా వీస్తుంటాయి. వీటి వేగం గంటకు సుమారు 75 కి.మీ.

ఖండాలపై నుంచి వీచే పవనాలు పొడిగా ఉంటాయి. సముద్రంపై నుంచి వీచే వాటిలో నీటిఆవిరి ఉంటుంది. ఇవి ఖండాల తూర్పు వైపు మాత్రమే వర్షాన్నిస్తూ, పశ్చిమం వైపు వర్షచ్ఛాయ ప్రాంతాలు, ఎడారులు ఏర్పడేందుకు కారణమవుతున్నాయి. ఈ ఎడారులకు ఉప అయన రేఖా ప్రాంత ఎడారులు అని పేరు.

ఉదా: సహారా, అటకామా, థార్‌, కాలిఫోర్నియా, పశ్చిమ ఆస్ట్రేలియా, కలహారి ఎడారులు

ఇవి ఉష్ణమండలంలో ఉండటం వల్ల అధిక బాష్పీభవనాన్ని కలుగజేస్తాయి. భూమధ్యరేఖ నుంచి 23 డిగ్రీల ఉత్తర, దక్షిణాలుగా వ్యాపించి ఉన్న ప్రాంతానికి ఉష్ణమండలం అని పేరు.

వీటితో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది.

మహాసముద్ర ప్రవాహాలు, పూర్వకాలంలో వ్యాపారాభివృద్ధికి ఈ పవనాలే కారణం.

బి) పశ్చిమ లేదా ప్రతి వ్యాపార పవనాలు: ఇవి 35 నుంచి 65 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉప అయన రేఖా అధిక పీడన ప్రాంతం నుంచి ఉప ధ్రువ అల్పపీడన ప్రాంతం వైపు వీచే పవనాలు. ఫెరల్స్‌ లేదా కొరియాలిస్‌ ప్రభావాన్ని అనుసరించి ఉత్తరార్ధ గోళంలో నైరుతి దిశలో మొదలై ఈశాన్యం వైపు, దక్షిణార్ధ గోళంలో వాయవ్యంలో మొదలై ఆగ్నేయం వైపు వీస్తాయి. అంటే వ్యాపార పవనాలకు వ్యతిరేక దిశలో వీస్తుంటాయి. అందుకే వీటికి ప్రతి వ్యాపార పవనాలు అని పేరు వచ్చింది. దక్షిణార్ధ గోళంలో జలభాగం అధికంగా ఉండటం వల్ల వీటి వేగం మరింత ఎక్కువయ్యేందుకు దోహదపడుతుంది. అందువల్ల వీటిని దక్షిణార్ధ గోళంలో వివిధ పేర్లతో పిలుస్తారు. 40 డిగ్రీల దక్షిణ అక్షాంశంపై వీచే పశ్చిమ పవనాలను గర్జించే నలభైలు అని, 50 డిగ్రీల దక్షిణ అక్షాంశంపై వీచే పశ్చిమాలను బలోపేతమైన యాభైలు అని, 60 డిగ్రీల దక్షిణ అక్షాంశంపై వీచే పశ్చిమాలను విధ్వంసకర అరవైలు అంటారు.

లక్షణాలు

వ్యాపార పవనాలతో పోల్చి చూస్తే వీటికి స్థిరత్వం, వేగం తక్కువ.

ఉష్ణమండలం నుంచి అతిశీతల మండలం వైపు వీస్తున్న ఈ పవనాలు ఎక్కువ నీటిఆవిరితో ఉండి, ఖండానికి పశ్చిమం వైపున అధిక వర్షాన్ని కలగజేస్తాయి. అందువల్ల ఈ అక్షాంశాల మధ్య ఖండాల తూర్పు ప్రాంతమంతా శీతల ఎడారులు ఏర్పడి ఉన్నాయి.

ఉదా: మంగోలియా, చైనాలో విస్తరించి ఉన్న గోబీ ఎడారి; అర్జెంటీనాలోని పెటగోనియా ఎడారి - సముద్ర ప్రవాహాలు, వాటి వృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

సి) ధ్రువ లేదా తూర్పు పవనాలు: ధ్రువ అధిక పీడన ప్రాంతం నుంచి ఉప ధ్రువ అల్పపీడన ప్రాంతం వైపు 90 నుంచి 65 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే ప్రపంచ పవనాలే ధ్రువ పవనాలు.

ఫెర్రల్‌ సూత్రం ప్రకారం ఉత్తరార్ధ గోళంలో ఈశాన్యం నుంచి, దక్షిణార్ధ గోళంలో ఆగ్నేయం నుంచి ఇవి వీచడం వల్ల క్రమంగా వీటికి ఈశాన్య ధ్రువ పవనాలు, ఆగ్నేయ ధ్రువ పవనాలు అని పేరు వచ్చింది.
లక్షణాలు: - వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలతో పోలిస్తే వీటి వేగం, స్థిరత్వం తక్కువ. - ధ్రువ ప్రాంతం నుంచి వీయడంతో ఇవి చల్లగా ఉంటాయి. అధిక బాష్పీభవనాన్ని కలగజేయవు. - అతిచల్లగా వీచే ఈ పవనాలు, ఉష్ణ పశ్చిమ పవనాలను కలుసుకున్న చోట భయంకరమైన తుపానులు వస్తాయి

గౌణ లేదా కాలాన్ని బట్టి వీచే పవనాలు: రుతువును లేదా సమయాన్ని లేదా భూ, జల భాగాల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలోని తేడాను అనుసరించి తమ దిశలో ఒక సమయంలో జల భాగం నుంచి భూభాగానికి, మరొక సమయంలో భూభాగం నుంచి జల భాగానికి మార్పులు చేసుకుంటూ వీచే పవనాలను కాలాన్ని బట్టి వీచే పవనాలు అంటారు.

స్థానిక పవనాలు: భూగోళంపై వివిధ ప్రాంతాల్లోని నైసర్గిక స్థితి, భూ,జల విస్తరణ, ఉష్ణోగ్రత లాంటి భౌతికాంశాలు ఒకే విధంగా లేకపోవడంతో వాయుపీడనంలో మార్పులు కలిగి వివిధ రకాలైన పవనాలు ఏర్పడటానికి దోహదం చేస్తున్నాయి. ఇవి కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమై ఉండటం వల్ల స్థానిక పవనాలు అని  పిలుస్తారు. వీటిని వెచ్చని, శీతల పవనాలు అని రెండు రకాలుగా విభజించారు.

https://tinyurl.com/bc5j9spe

రచయిత: సక్కరి జయకర్‌


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఎకానమీలోని సామాజిక ఆర్థిక సమస్యల అధ్యయనంలో భాగంగా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, జనాభా టాపిక్‌లపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రాథమికాంశాలను తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన వర్తమాన గణాంకాలనూ తప్పనిసరిగా చదవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని