నిర్బంధ చెల్లింపులతో సంక్షేమ వ్యయాలు!

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిరంతరం ఖర్చులు  పెడుతుంటాయి. పాలనావ్యవస్థను నిర్వహిస్తూ, చట్టాలను అమలు చేస్తుంటాయి. ఇందుకోసం ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయ వనరులు కావాలి.

Published : 11 Mar 2024 01:32 IST

జనరల్‌ స్టడీస్‌ - ఇండియన్‌ ఎకానమీ

ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిరంతరం ఖర్చులు  పెడుతుంటాయి. పాలనావ్యవస్థను నిర్వహిస్తూ, చట్టాలను అమలు చేస్తుంటాయి. ఇందుకోసం ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయ వనరులు కావాలి. ఆధునిక కాలంలో ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులంటే పన్నుల రాబడులే. ఈ పన్నుల్లో రకాలు, వాటిని విధించే ప్రాతిపదికలు, సామాజిక, ఆర్థిక విధానాల రూపకల్పనలో వీటి ప్రాధాన్యం గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. పన్నేతర మార్గాల్లో ఉన్న ఇతర ఆదాయ వనరులపైనా తగిన పరిజ్ఞానం పెంచుకోవాలి.

ప్రభుత్వ రాబడి

భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూరే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగంలోని 268, 300 అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. 1935 భారత ప్రభుత్వ చట్టం పాలనా విధులను ఎ) కేంద్ర జాబితా బి) రాష్ట్ర జాబితా సి) ఉమ్మడి జాబితాలుగా విభజించింది. వాటిని అనుసరించి పన్నులు విధించే అధికారాలను స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్రం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడినిచ్చే పన్నులు కేంద్రం పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులను విధించి రాబడి పొందుతున్నాయి.

ప్రభుత్వ రాబడులు, వ్యయాన్ని ప్రభుత్వ విత్త శాస్త్రం తెలియజేస్తుంది. సంప్రదాయ ఆర్థికవేత్తల్లో ఒకరైన జె.బి.సే ‘‘ప్రణాళికల్లో తక్కువ ఖర్చు చేసేది ఉత్తమ ప్రణాళిక, పన్నుల్లో తక్కువ పన్ను విధించేది మంచి పన్ను’’ అని అభిప్రాయపడ్డారు. 1936లో   జె.ఎం.కీన్స్‌ జనరల్‌ థియరీ రచనతో ప్రభుత్వ విత్తశాస్త్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ప్రభుత్వ విత్తశాస్త్రం అధ్యయనం చేసే అంశాలు:

1) ప్రభుత్వ రాబడి: ప్రభుత్వ రాబడిని పన్ను రాబడి, పన్నేతర రాబడి అని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో పన్నుల ద్వారా రాబడి ముఖ్యమైంది.
2) ప్రభుత్వ వ్యయం: ప్రభుత్వం ఏయే అంశాలపై ఖర్చు చేస్తుంది, ప్రభుత్వ వ్యయం పెరగడానికి కారణాలు; ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయంపై ప్రభుత్వ వ్యయం ప్రభావం లాంటి అంశాలను చర్చిస్తుంది.
3) ప్రభుత్వ రుణం: వ్యయానికి సరిపడా ఆదాయం సమకూర్చుకోలేనప్పుడు ప్రభుత్వం రుణం చేయాల్సి వస్తుంది. అంతర్గత, బహిర్గత రుణాలను ప్రభుత్వం తీసుకుంటుంది.
4) విత్త నిర్వహణ: బడ్జెట్‌ తయారు చేసే విధానం, చట్టసభలో దాన్ని ప్రవేశపెట్టడం, ఆమోదం పొందడం, అమలుపరచడం, ఆడిటింగ్‌ లాంటి అంశాలుంటాయి.                                                              
5) కోశ విధానం: నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వ ఆదాయ-వ్యయ రుణ విధానాలను ప్రభుత్వం ఏవిధంగా ఉపయోగించుకుంటుందో   తెలియజేసేదే కోశ విధానం.
6) ఫెడరల్‌ విత్తం: ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరులు ఏవిధంగా విభజించాలి? వనరుల పంపిణీలో అసమానతలను ఎలా తగ్గించాలి? లాంటి అంశాలను వివరిస్తుంది.

ప్రభుత్వ రాబడి వర్గీకరణ: ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ రాబడి, మూలధన రాబడి అని రెండు రకాలు. రెవెన్యూ రాబడి రెండు మార్గాల్లో లభిస్తుంది.    1) పన్ను రాబడి 2) పన్నేతర రాబడి.
1) పన్ను రాబడి: పన్నులు విధించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడిని పన్ను రాబడి అంటారు. సెలిగ్‌మన్‌ ప్రకారం ‘‘తనకు సంక్రమించిన ప్రయోజనంతో సంబంధం లేకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు, సంస్థలు చేసే నిర్బంధ చెల్లింపులే పన్నులు’’. ఇవి పలు రకాలుగా ఉన్నాయి.
ఎ) పన్ను భారాన్ని భరించే వారిని బట్టి పన్నులు రెండు రకాలు 1) ప్రత్యక్షపన్ను 2) పరోక్ష పన్ను వ్యక్తి పన్ను చెల్లించడం వల్ల కోల్పోయే ద్రవ్యమే ద్రవ్య భారం. ఈ భారం రెండు రకాలు 1) తొలి భారం 2) అంతిమ భారం. ప్రభుత్వం పన్ను విధించినప్పుడు దాన్ని మొదటగా చెల్లించిన వ్యక్తి భరించే భారమే పన్ను తొలి భారం. పన్ను చిట్టచివరగా ఎవరు చెల్లిస్తారో ఆ భారమే అంతిమ భారం.
ఉదా: వినోద పన్ను తొలి భారాన్ని థియేటర్‌ యజమాని భరిస్తే, తుది భారాన్ని ప్రేక్షకుడు భరిస్తాడు.
ప్రత్యక్ష పన్ను: పన్ను తొలి, అంతిమ భారాలు ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ప్రత్యక్ష పన్నుల భారాన్ని బదిలీ చేయడానికి వీలు కాదు.
ఉదా: ఆదాయ పన్ను, సంపద పన్ను, వృత్తి పన్ను, కార్పొరేట్‌ పన్ను, బహుమతి పన్ను, స్టాంపు డ్యూటీ, వడ్డీ పన్ను, ఎస్టేట్‌ డ్యూటీ, వ్యయంపై పన్ను,   క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌
పరోక్ష పన్ను: పన్ను తొలి భారం ఒకరిపైన, అంతిమ భారం మరొకరిపైన ఉంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. పరోక్ష పన్నుల భారాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా బదిలీ చేయవచ్చు. పన్ను మొదట ఎవరిపై విధిస్తారో వారు మరొకరికి పన్నుభారాన్ని బదిలీ చేస్తారు. ఉదా: కేంద్రఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకాలు, సేవాపన్ను, రాష్ట్ర అమ్మకం పన్ను, రాష్ట్రఎక్సైజ్‌ సుంకం, మోటారు వాహనాలపై పన్ను, విద్యుత్తుపైపన్ను, వినోదపుపన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను.
బి) పన్ను ప్రాతిపదిక, పన్ను రేటు మధ్య సంబంధం ఆధారంగా పన్నులు నాలుగు రకాలు:  పన్ను దేని ఆధారంగా విధిస్తారో తెలియజేసేది పన్ను ప్రాతిపదిక కాగా, ఎంత శాతం పన్ను విధిస్తారో తెలియజేసేది పన్ను రేటు. ఎంతమంది పన్ను చెల్లిస్తున్నారో తెలియజేసేది పన్ను పరిధి.
1) అనుపాత పన్ను: పన్ను విధించడానికి ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్ను రేటు వర్తింపజేస్తే అది అనుపాత పన్ను అవుతుంది. ఉదాహరణకు ఆదాయ పన్ను 10 శాతంగా నిర్ణయిస్తే రూ.10 వేలు ఆదాయమైనా, రూ.లక్ష ఆదాయమైనా పన్ను రేటు మారదు. ఉదా: 1) అమ్మకపు పన్ను 2) సేవా పన్ను 3) ఎక్సైజ్‌ సుంకం
2) పురోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ, పన్ను రేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు. భారత్‌లో ఆదాయ పన్ను ఈ రకానికి చెందింది. ధనికులపై అధిక పన్ను,  పేదలపై తక్కువ పన్నును సూచిస్తుంది. అంటే ‘చెల్లింపు సామర్థ్యం (ఎబిలిటీ టూ పే)’ ఆధారంగా ఈ పన్ను విధిస్తారు. పురోగామి పన్నుల వల్ల ఆదాయ అసమానతలు తగ్గడమే కాకుండా సాంఘిక న్యాయం జరుగుతుంది. ఆడంస్మిత్‌ పేర్కొన్న పన్ను నియమాల్లో సమతా నియమాన్ని పురోగామి పన్ను  తెలియజేస్తుంది. పన్ను చెల్లింపు సామర్థ్యం సూత్రంపై ఆధారపడింది.
3) తిరోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ పెరిగే కొద్దీ పన్ను రేటు తగ్గితే అది తిరోగామి పన్ను అవుతుంది. ఉదా: రూ.లక్ష - రూ.1.5 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తి 30 శాతం పన్ను, రూ.1.5 లక్షలు - రూ.2.50 లక్షల మధ్య ఆదాయం ఉన్న వ్యక్తి 20 శాతం పన్ను, రూ.2.50 లక్షల పైన ఆదాయం ఉన్న వ్యక్తి 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటే అది తిరోగామి పన్ను అవుతుంది.
4) డిగ్రెసివ్‌ పన్ను: ఆదాయం పెరిగే కొద్ది పన్ను రేటు నెమ్మదిగా పెరిగి, ఒక దశ తర్వాత పన్ను రేటులో మార్పు రాకపోతే దానిని డిగ్రెసివ్‌ పన్ను అంటారు. సాధారణంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది. 1) పన్ను ఆధారమైన ఆదాయంలో లేదా సంపద విలువలో కొంత మొత్తాన్ని పన్ను చెల్లింపు నుంచి మినహాయించి మిగిలిన మొత్తం ఆదాయంపై ఒకే రేటులో పన్ను విధించడం. 2) పన్ను ఆధారం పెరిగినంత వేగంగా పన్నురేటు పెరగకపోవడం. ఈ పద్ధతిలో అధిక ఆదాయం ఉన్న వ్యక్తి తక్కువ త్యాగం, తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఎక్కువ త్యాగం చేస్తాడు.
సి) పన్ను విధింపు కాలం ప్రాతిపదికన పన్నులు రెండు రకాలు:
1) తాత్కాలిక పన్ను:
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాత్కాలిక అవసరాలు తీర్చుకునేందుకు విధించే పన్ను తాత్కాలిక పన్ను.
ఉదా: యుద్ధ సమయాల్లో విధించే సర్‌ఛార్జిలు. (యుద్ధం ముగిసిన తర్వాత దాన్ని రద్దు చేస్తారు.)
2) శాశ్వత పన్ను: శాశ్వత ప్రాతిపదికపై విధించే పన్ను శాశ్వత పన్ను. ఉదా: అమ్మకం పన్ను. 1886 నుంచి భారత్‌లో ఆదాయ పన్నును శాశ్వత ప్రాతిపదికన విధిస్తున్నారు.
డి) పన్ను విధింపు ఆధారంగా పన్నులు రెండు రకాలు: 1) నిర్దిష్ట పన్ను 2) విలువ ఆధారిత పన్ను
1) నిర్దిష్ట పన్ను: వస్తువు విలువతో సంబంధం లేకుండా బరువు/ సంఖ్య/కొలత/పరిమాణం ఆధారంగా పన్ను విధిస్తే దాన్ని నిర్దిష్ట పన్ను అంటారు. ఉదా: వినోదపు పన్ను
2) విలువ ఆధారిత పన్ను: దీనికి మూల్యానుగత పన్ను, అడ్వలోరెమ్‌ పన్ను అనే పేర్లు కూడా ఉన్నాయి. వస్తువు ద్రవ్య విలువ ఆధారంగా పన్ను విధిస్తే అది విలువ ఆధారిత పన్ను. సాధారణంగా వస్తువు విలువలో కొంత శాతాన్ని పన్నుగా విధిస్తారు. ఉదా: సేల్స్‌ ట్యాక్స్‌, కస్టమ్స్‌. మన దేశంలో ఎక్కువ పన్నులు ఈ రకానికి చెందినవి.
ఇ) పన్నువిధింపు స్థానం ఆధారంగా పన్నులు రెండు రకాలు: 1) ఏకస్థానపన్ను 2) బహుళస్థాన పన్ను
ఏకస్థాన పన్ను: ఉత్పత్తిలో ఒక దశలో మాత్రమే పన్ను విధిస్తే దాన్ని ఏకస్థాన పన్ను అంటారు.
బహుళస్థాన పన్ను: ఉత్పత్తిలో వివిధ దశల్లో పన్ను విధిస్తే దాన్ని బహుళ స్థాన పన్ను అంటారు. ఉదా: VAT
2) పన్నేతర రాబడి:
పరిపాలన రాబడులు: ఫీజులు, జరిమానాలు, పెనాల్టీలు, అప్పులు, డిపాజిట్ల స్వాధీనం, అభివృద్ధి లెవీలు, ప్రత్యేక విధింపులు.
వాణిజ్యపర ఆదాయాలు: ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తుసేవలు విక్రయించగా వచ్చిన రాబడిని వాణిజ్య ఆదాయాలు అంటారు. ఉదా: రైల్వే రవాణా, విద్యుత్తు సరఫరా, తంతి తపాలా మొదలైనవి.
గ్రాంట్లు, కానుకలు: ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వానికి ఉదారంగా ఇచ్చే ద్రవ్యమే గ్రాంటు. ఉదా: కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంటు. ప్రజలకు, స్వచ్ఛందసంస్థలకు ప్రభుత్వం ఇచ్చే మొత్తాన్ని కానుకలు అంటారు. ఉదా: ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాల్లో ఇచ్చే కానుకలు.
ప్రభుత్వ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: భూములు, గనులు, నదుల లాంటి సహజవనరులను అద్దెకు ఇవ్వడం/వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయం.
కరెన్సీ నోట్ల ముద్రణ: ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వం సరిపడినంత ఆదాయాన్ని సమకూర్చుకోలేనప్పుడు, అంతిమంగా నూతన కరెన్సీ నోట్లు ముద్రించి ఆదాయం సమకూర్చుకుంటుంది. అయితే దీనివల్ల దేశంలో ద్రవ్య సరఫరా పెరిగి ధరలు పెరగవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని