logo

మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు.

Updated : 05 May 2024 09:33 IST

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. ప్రధానంగా రాజమహేంద్రవరం నగరంలో బరిలో నిలిచిన అధికార పార్టీకి చెందిన నేత తాయితాల పంపిణీకి తెరలేపారు. ఎలాగైనా గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నగరంలో పలు వర్గాలను స్వయంగా ఇంటికి పిలిచి నగదు రూపంలో పంపిణీ చేస్తున్నారు. దీన్ని కొందరు వ్యతిరేకించి ఆయన ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడకపోవడం గమనార్హం. ఇన్నాళ్లూ ఏం చేయలేని ప్రభుత్వం, నాయకులు ఇప్పుడు డబ్బులు ఆశ చూపితే ఎలా వస్తామంటూ పలువురు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

కులాలు, వర్గాలవారీగా..

కులాలు, వర్గాల వారీగా ఇంటికి పిలిపించి ఎంతో కొంత ముట్టచెబుతున్నారు. రాత్రి  7 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులు, ఒప్పంద ఉద్యోగులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు జాబితాను సిద్ధం చేశారు. వారందరికీ వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి కార్యాలయానికి రప్పించి రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకూ పంపిణీ చేస్తున్నారు. నగరంలో ఆయా డివిజన్లలో ద్వితీయ శ్రేణి నాయకులకూ బేేరాలు పెడుతున్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసే విధంగా ఓటర్లను ప్రభావితం చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ఛోటా నాయకులను గుర్తించి నేత వద్దకు తీసుకురావాల్సిన బాధ్యత తీసుకోవాలి.

మేము రాం..

ఇన్నాళ్లూ తమ సమస్యలు పట్టించుకోకపోగా.. ఇప్పుడు పిలిస్తే ఎలా వస్తామా అంటూ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అంగన్‌వాడీ సిబ్బందిని రావాల్సిందిగా సంబంధిత నాయకుడి కార్యాలయం నుంచి రెండు రోజుల క్రితం సమాచారం అందించారు. అయితే వారు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. అంగన్‌వాడీల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న వారంతా డబ్బులకు ఆశపడి వచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కోవలో మరికొన్ని కార్మిక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో విస్మయం చెందిన నేతలు ఇంకా ఎక్కువ మొత్తంలో ఆశచూపినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వెళ్లేదిలేదని వారంతా నాయకుల ముఖం మీదే చెప్పేస్తున్నారు.

ఇంటివద్ద యథేచ్ఛగా పంపిణీ

నగరంలోని అధికార పార్టీ నేత ఇంటి వద్ద రెండు రోజులుగా హడావుడి కనిపిస్తోంది. ప్రతీ రోజు రాత్రి సమయంలో ఆయా వర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. చారిత్రక రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న తరుణంలో ఎన్నికల్లో గెలుపునకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నగరంలో పలు వర్గాల వ్యతిరేకతను మూటగట్టుకొన్న అధికార పార్టీ నేత.. ఇప్పుడు సొమ్ములు ఆశ చూపుతున్నారు. ఎన్నికల కోడ్‌ రాక ముందు నగరంలో సామాజిక భవనాల పేరుతో ప్రభుత్వ స్థలాలను పంచిపెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో సొమ్ములు ఆశ చూపి ఓట్లు రాబట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని