Campus Placements: రూ.83 లక్షల వేతనంతో ఉద్యోగం.. IIIT విద్యార్థినులకు బంపర్‌ ఆఫర్‌!

ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతుండగానే ఇద్దరు అమ్మాయిలు రికార్డు స్థాయి వేతనంతో ఉద్యోగాలు సాధించి సత్తా చాటారు.

Published : 26 Feb 2024 19:03 IST

భాగల్‌పూర్‌: అనుకున్న లక్ష్యానికి కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం తోడైతే అవకాశాలు వాటంతట అవే వెతుక్కొని వస్తాయనడానికి ఈ విద్యార్థినులే ఉదాహరణ. బిహార్‌లోని భాగల్‌పూర్‌ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినులు రికార్డు స్థాయి వార్షిక వేతన ప్యాకేజీతో కొలువులు సాధించి అదరగొట్టారు. ఇటీవల జరిగిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో బీటెక్‌ మూడో సంవత్సరం (కంప్యూటర్‌ సైన్స్‌) అభ్యసిస్తున్న ఇషికా ఝా, సంస్కృతి మాలవీయ రూ.83 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికై సంచలనం సృష్టించారు. అంటే వీరిద్దరూ నెలకు దాదాపు రూ.7లక్షల చొప్పున వేతనం అందుకోనున్నారు. ఇషికా ఝా హరియాణాలోని ఓ చిన్న పట్టణానికి చెందిన అమ్మాయి కాగా..  సంస్కృతి మాలవీయది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌. తమ కోర్సు పూర్తి కాకముందే భారీ వేతనాలతో అద్భుతమైన కొలువులు సాధించి గత రికార్డుల్ని బ్రేక్‌ చేశారు. 

వాస్తవానికి ట్రిపుల్‌ ఐటీ భాగల్‌పుర్‌లో 2020-24 ఫైనల్‌ ఇయర్‌ బ్యాచ్‌ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా నిర్వహించలేదు. ఆలోపే, బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న (బ్యాచ్‌ 2021 -25)వారికి క్యాంపస్‌ సెలెక్షన్లు జరిగాయి. వీరిద్దరూ మొదటినుండి మంచి కంపెనీలో కొలువుల కోసం ప్రయత్నిస్తున్నారు. లక్ష్య సాధన కోసం ఎంతగానో శ్రమించి తగిన ప్రణాళికతో ముందుకెళ్లారు. మొదటి సంవత్సరం నుంచే కోడింగ్‌ నేర్చుకోవడంపై దృష్టిపెట్టడంతో పాటు తగిన ప్రిపరేషన్‌, సీనియర్లతో మాక్‌ ఇంటర్వ్యూలు ఇప్పించుకోవడం వంటి కార్యాచరణతో నిరంతరం పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంటర్వ్యూల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలా ప్రిపేర్‌ కావాలి? తదితర సమాచారాన్ని సీనియర్ల నుంచి తెలుసుకునేవారు. మంచి ఉద్యోగం సాధించేందుకు వారు చూపిన అంకిత భావం, కృషి ఫలితంగానే ఇంత గొప్ప విజయం సాధ్యమైందని పలువురు పేర్కొన్నారు.

తాను గూగుల్ హ్యాకథాన్‌లో పాల్గొన్నట్లు ఇషికా ఝా తెలిపారు. తనకు పర్యావరణ అంశం రాగా.. తాను రూపొందించిన ఫారెస్ట్‌ ఫైర్‌ ప్రిడెక్షన్‌ ప్రాజెక్టుకు అత్యధికంగా 2.5శాతం మార్కులు వచ్చాయన్నారు. అలాగే, సంస్కృతి మాలవీయ కూడా గూగుల్ హ్యాకథాన్‌లో మహిళా సాధికారతకు సంబంధించిన యాప్‌ను రూపొందించారు. మహిళలు తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా పబ్లిక్‌గా షేర్ చేసుకొనేందుకు సిగ్గుపడే విషయాలను ఈ యాప్‌ ద్వారా పంచుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గూగుల్‌ 2.5శాతం మార్కులు ఇచ్చిందని సంస్కృతి తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని