SSC Exams: పదో తరగతి పరీక్షలకు రెడీనా? ఈ జాగ్రత్తలు మరవొద్దు!

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్న వేళ విద్యార్థులకు కొన్ని సూచనలు..

Published : 16 Mar 2024 10:32 IST

SSC Exms | ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మార్చి 18 నుంచి జరగబోయే ఈ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించే లక్ష్యంతో విద్యార్థులు సర్వసన్నద్ధమవుతున్నారు. పరీక్షలంటే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో రాస్తే మంచి మార్కులు సాధించవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అయితే, విద్యార్థులు చేసే చిన్న చిన్న పొరపాట్లు మార్కులకు గండికొట్టే ప్రమాదం ఉంటుందని.. అందువల్ల ఈ కింది జాగ్రత్తలతో మంచి స్కోరు సాధించవచ్చని సూచిస్తున్నారు.

ఏపీ టెన్త్‌ హాల్‌ టికెట్లు.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

  • పరీక్షలు రాసేవారిలో ఎక్కువ మంది ప్రశ్నపత్రం ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే జవాబులు రాయడం మొదలు పెట్టేస్తారు. అలా కాకుండా ప్రశ్నల్ని పూర్తిగా చదవండి. అడిగిన ప్రశ్న, దానికి ఎన్ని మార్కులు? జవాబు ఎలా? ఎంత మేరకు రాయాలో ముందుగానే నిర్ణయించుకోండి.
  • ప్రశ్నపత్రంలో సరైన సమాధానం రాయగలమన్న నమ్మకం ఉన్న ఏ ప్రశ్నకైనా తొలుత సమాధానం రాయొచ్చు.  ఆ ప్రశ్న నంబరును ఎడమ వైపు మార్జిన్‌లో తప్పక రాయాలి. ప్రశ్నల నంబర్లను తప్పుగా వేయడం, మర్చిపోవడం వంటివి చేయొద్దు. అవసరమైతే చివర్లో మరోసారి చెక్‌ చేసుకోండి.
  • ప్రశ్నపత్రంలో ఛాయిస్‌ ఉన్నప్పుడు ప్రశ్నల ఎంపిక సరిగా ఉండేలా చూసుకోండి. కఠినంగా ఉన్న ప్రశ్నలపై ఆందోళన చెందొద్దు. తొలుత సులభంగా ఉన్న ప్రశ్నలకు జవాబులు రాసిన తర్వాత కఠిన ప్రశ్నలకు వెళ్లండి.
  • ఎరుపు సిరా పెన్నులు నిషేధం. నీలం, నలుపువి మాత్రమే వాడాలి. సమాధాన పత్రాలతో కూడిన బుక్‌లెట్‌లో ప్రతి పేజీకి ఎడమ వైపు 2 లేదా 2.5 సెంటిమీటర్ల మార్జిన్‌ను వదలాలి.
  • ప్రశ్నల గురించి ఎక్కువ ఆలోచించొద్దు. మార్కుల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాసేలా జాగ్రత్త పడండి. పెద్దపెద్ద అక్షరాలతో మరీ ఎక్కువ మార్జిన్‌ వదిలేసి ఎక్కువ పేజీలు నింపితే ప్రయోజనం ఉండదు. సమాధాన పత్రాలు దిద్దేటప్పుడు ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యే అవకాశముంది.

తెలంగాణ టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

  • పేజీ చివర కొంత ప్రదేశం మిగిలిందని మరో జవాబు రాయడం, పదాన్ని విడకొట్టి రాయడం చేయొద్దు. సాధ్యమైనంత వరకు జవాబులు వ్యాసంలా రాయకుండా పాయింట్ల రూపంలో రాస్తే ప్రయోజనం. సైడ్‌ హెడ్డింగ్‌లను పెన్నుతో అండర్‌లైన్‌ చేయండి. మార్జిన్లను పాటించండి. కోడ్‌ పదాలను రాయొద్దు. పదాలు, వాక్యాలు పూర్తిగా రాయండి. 
  • ముఖ్యంగా చేతి రాత బాగుంటేనే మూల్యాంకనం చేసే ఉపాధ్యాయుడికి మీ పేపర్‌ పట్ల మంచి ఇంప్రెషన్‌ ఏర్పడటంతో పాటు మీరు రాసే జవాబుల్ని త్వరగా గుర్తించగలుగుతారు.
  • బిట్‌ పేపర్‌లో కొట్టివేతలు, దిద్దివేతలు లేకుండా జాగ్రత్త వహించండి.  సమయం ముగిసే 10-15 నిమిషాల ముందే పరీక్ష రాయడం పూర్తి చేసి సమాధాన పత్రాన్ని చెక్‌ చేసుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. 
  • తెలుగు, హిందీ, ఆంగ్లంలో వ్యాకరణం ముఖ్యమైంది. అక్షర దోషాలు లేకుండా రాయడంలో జాగ్రత్త పడండి. గ్రాఫ్‌లు, పటాలు, బొమ్మలు వంటివి పెన్సిల్‌తోనే వేయడం మరవొద్దు.  

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని