బాల్యానికి తీపి చేదు 

మధుమేహం పెద్దల వ్యవహారమే కాదు. ఇప్పుడిది పిల్లల సమస్య కూడా. ఒకవైపు చిన్నతనంలోనే దాడిచేసే మధుమేహం (టైప్‌1).. మరోవైపు పెద్దవారిలో కనబడే మధుమేహం (టైప్‌2).. రెండూ చిన్నారులను వెంటాడుతున్నాయి. మనదేశంలో ఇప్పటికే లక్ష మందికి పైగా పిల్లలు టైప్‌1 రకంతో బాధపడుతుండగా.. 

Published : 13 Nov 2018 04:05 IST

బాల్యానికి తీపి చేదు 

రేపు ప్రపంచ మధుమేహ దినం

బాల్యానికి తీపి చేదు 

మధుమేహం పెద్దల వ్యవహారమే కాదు. ఇప్పుడిది పిల్లల సమస్య కూడా. ఒకవైపు చిన్నతనంలోనే దాడిచేసే మధుమేహం (టైప్‌1).. మరోవైపు పెద్దవారిలో కనబడే మధుమేహం (టైప్‌2).. రెండూ చిన్నారులను వెంటాడుతున్నాయి. మనదేశంలో ఇప్పటికే లక్ష మందికి పైగా పిల్లలు టైప్‌1 రకంతో బాధపడుతుండగా.. టైప్‌ 2 సైతం శరవేగంగా విజృంభిస్తుండటం కలవరపెడుతోంది. రకమేదైనా మధుమేహాన్ని సరైన సమయంలో గుర్తించి, చికిత్స అందించటం చాలా కీలకం. లేకపోతే శారీరకంగానే కాదు మానసికంగానూ పిల్లలను కుంగదీస్తుంది. మున్ముందు గుండె, కిడ్నీ జబ్బుల వంటి తీవ్ర అనర్థాలకూ దారితీస్తుంది. కాబట్టి అంతా దీనిపై అవగాహన కలిగుండటం అత్యవసరం. నవంబరు 14న ‘బాలల దినోత్సవం’.. అలాగే ‘ప్రపంచ మధుమేహ దినం’.. రెండూ కలిసి వస్తున్న నేపథ్యంలో పిల్లల్లో మధుమేహంపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.

మొక్క ఏపుగా పెరగాలంటే నీరు, పోషకాల వంటివి సరిగా అందుతుండాలి. అప్పుడే అది శాఖోపశాఖలుగా విస్తరిస్తూ.. మహావృక్షంగా ఎదుగుతుంది. మరి తగినన్ని పోషకాలు లభించకపోతే? పోషకాలు లభించినా వేళ్లు వాటిని స్వీకరించకపోతే? ఆదిలోనే చతికిల పడిపోతుంది. మధుమేహం కూడా పిల్లలను ఇలాగే దెబ్బతీస్తుంది. మన ఒంట్లో ప్రతి కణానికీ శక్తి అవసరం. ఇది ఆహారం ద్వారానే లభిస్తుంది. మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారి, అనంతరం కణాల్లోకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియలో క్లోమగ్రంథి నుంచి విడుదలయ్యే ఇన్సులిన్‌ హార్మోన్‌ కీలకపాత్ర పోషిస్తుంది. కణాల్లోకి గ్లూకోజు చేరుకునేలా చేసేది ఇదే. దీంతో కణాలు శక్తిని పుంజుకొని.. అవయవాలన్నీ చురుకుగా పనిచేస్తాయి. ఇన్సులిన్‌ అసలే ఉత్పత్తి కాకపోయినా, అంతంతే ఉత్పత్తి అయినా.. ఉత్పత్తి అయినా అది సరిగా పనిచేయకపోయినా కణాల్లోకి గ్లూకోజు చేరుకునే ప్రక్రియ దెబ్బతింటుంది. ఫలితంగా కణాలన్నీ క్రమంగా నిర్వీర్యమైపోతూ.. నిస్తేజంతో చతికిలపడి పోతాయి. స్థూలంగా చెప్పాలంటే ఇదే మధుమేహం. చాలామంది ఇది పెద్ద వయసులోనే వస్తుందని భావిస్తుంటారు. కానీ చిన్నతనంలోనూ దాడిచేయొచ్చు. నిజానికి పిల్లల్లో మధుమేహం ఏ వయసులోనైనా మొదలవ్వచ్చు. అయితే 3-7 ఏళ్ల వయసులో.. హార్మోన్లు ఉద్ధృతంగా ఉండే 10-12 ఏళ్ల వయసులో ఎక్కువగా కనబడుతుంటుంది. అరుదుగా కొందరికి పుట్టుకతోనే మధుమేహం ఉంటుండొచ్చు. ఇలా ఆరు నెలల్లోపే దాడిచేసే మధుమేహాన్ని ‘నియోనేటల్‌ డయాబెటీస్‌’ అంటారు. దీనికి చాలావరకు జన్యుపరమైన అంశాలే దోహదం చేస్తుంటాయి. ఆరు నెలల తర్వాత మొదలయ్యే మధుమేహాన్ని ‘టైప్‌ 1’ అంటారు. మధుమేహం బారినపడుతున్న పిల్లల్లో 90% మంది ఇలాంటివాళ్లే. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఇలాంటి రకం మధుమేహం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. పెద్దవాళ్లలో వచ్చే ‘టైప్‌ 2’ మధుమేహం కూడా పిల్లల్లో తక్కువేమీ కాదు. ప్రధానంగా జీవనశైలితో ముడిపడిన ఇది పెద్దవారిలోనే కాదు.. పిల్లల్లోనూ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. ఊబకాయ పిల్లల్లో చాలామంది ముందస్తు మధుమేహ (ప్రిడయాబెటీస్‌) దశలో.. అంటే త్వరలోనే పూర్తి మధుమేహంలోకి జారిపోయే స్థితిలోనే ఉంటున్నారు. చిన్న వయసులోనే మధుమేహం బారినపడుతున్నవారి సంఖ్య గత 30 ఏళ్లలో పదింతలు పెరిగిపోయింది. పిల్లల్లో కనబడుతున్న జీవక్రియల సమస్యల్లో ఊబకాయం తర్వాత టైప్‌ 2 మధుమేహమే నిలుస్తుండటం ఆందోళనకరం.

ఏంటీ టైప్‌1? 
స్థూలంగా చెప్పాలంటే ఇన్సులిన్‌ ఉత్పత్తి కాకపోవటం. క్లోమగ్రంథిలోని బీటా కణాలు మనం తీసుకునే ఆహారానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి. ఏ కారణంతోనైనా ఈ కణాలు దెబ్బతింటే ఇన్సులిన్‌ ఉత్పత్తి పడిపోతుంది. క్రమంగా ఇన్సులిన్‌ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవచ్చు కూడా. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు బాగా పెరిగిపోతాయి. ఇదే టైప్‌ 1 మధుమేహం. బీటా కణాలు దెబ్బతినటానికి ప్రధాన కారణం రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం (ఆటోఇమ్యూనిటీ). ఇలా ఎందుకు జరుగుతుందన్నది కచ్చితంగా తెలియదు. కానీ వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటి అంశాలు దీనికి దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డప్పుడు పుట్టుకొచ్చే యాంటీబాడీలు పొరపాటున క్లోమం మీద దాడి చేసి బీటా కణాలను దెబ్బతీయొచ్చు. ఇది మధుమేహానికి దారితీయొచ్చు.

గుర్తించటమెలా? 
టైప్‌ 1 మధుమేహ లక్షణాలు ఉన్నట్టుండి.. కొద్దివారాల్లోనే మొదలవుతుంటాయి. వీటిని పసిగట్టటం చాలా అవసరం. అప్పుడే సమస్యను త్వరగా గుర్తించి, తగు చికిత్స అందించటానికి.. దుష్ప్రభావాల బారినపడకుండా చూసుకోవటానికి వీలవుతుంది.

* అతి దాహం, తరచూ మూత్రం: రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగిపోయినపుడు కణజాలంలోని నీరు బయటకు వచ్చేస్తుంటుంది. దీంతో దాహం వేయటం.. నీరు ఎక్కువగా తాగటం.. ఫలితంగా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లటం వంటివి కనబడతాయి. అంతేకాదు, ఎక్కువగా ఉన్న గ్లూకోజును బయటకు పంపించటానికి కిడ్నీలు మరింతగా పనిచేయటం మూలంగానూ తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది.

* నిస్సత్తువ, ఆకలి: తగినంత ఇన్సులిన్‌ లేకపోవటం మూలంగా కణాలకు అవసరమైన గ్లూకోజు అందదు. దీంతో కండరాలు, అవయవాల్లో శక్తి సన్నగిల్లి అలసట, నిస్సత్తువ ఆవహిస్తుంటాయి. ఈ క్రమంలో ఆకలి కూడా పెరుగుతుంటుంది.

* చిరాకు: కొందరిలో చిరాకు వంటివీ మొదలుకావొచ్చు. కొందరు హఠాత్తుగా చదువుల్లోనూ  వెనకబడిపోతుండొచ్చు.

* చూపు మసకబారటం: రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగినపుడు కళ్లలోని కటకాలు పొడిబారి చూపు తగ్గిపోవచ్చు.

* బరువు తగ్గటం: కణాలకు గ్లూకోజు అందనప్పుడు శరీరం శక్తి కోసం కండరాలను, కొవ్వును వినియోగించుకుంటుంది. ఇది బరువు తగ్గటానికి దారితీస్తుంది. కొన్నిసార్లు పిల్లలు చాలా వేగంగానూ బరువు తగ్గిపోతుంటారు. దీన్ని తొలిదశలో గుర్తించకపోతే ఒంట్లో ఆమ్లస్థాయులు పెరిగి ప్రాణాపాయానికీ దారితీయొచ్చు. ఇలాంటి స్థితిలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుంది.

* కోమా: కొన్నిసార్లు పిల్లలు అకస్మాత్తుగా స్పృహ తప్పిపోవచ్చు. ఐదేళ్లలోపు పిల్లల్లోనైతే ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు.

టైప్‌ 2 అంటే? 
ఒక్కమాటలో చెప్పాలంటే- కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించలేకపోవటం. క్లోమగ్రంథి పనిచేస్తూనే ఉంటుంది, రక్తంలో ఇన్సులిన్‌ ఉంటుంది. అయినా శరీరం దాన్ని సమర్థంగా వినియోగించుకోలేదు. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగిపోతుంటాయి. ఇదే టైప్‌ 2 మధుమేహం. దీనికి కచ్చితమైన కారణమేంటో తెలియదు. కానీ ఇది జీవనశైలితో ముడిపడిన సమస్యని తెలుసుకోవటం అవసరం. మారిపోతున్న ఆహార అలవాట్లు, ఊబకాయం, శారీరక శ్రమ తగ్గటం వంటివన్నీ దీనికి దోహదం చేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లలు ఇంట్లో వండిన ఆహారమే తినేవాళ్లు. రోజూ మూడు పూటలా భోజనం.. రెండు, మూడు సార్లు చిరుతిళ్లు తీసుకునేవారు. ఆటలంటే ఆరుబయట ఆడుకోవటమే. బడుల్లో మధ్యాహ్న భోజనం సమయమూ ఎక్కువగానే ఉండేది. దీంతో పిల్లలకు ఆడుకోవటానికి తగినంత సమయం దక్కేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పొద్దున లేస్తూనే ఉరుకులు పరుగులతో బడికి సిద్ధం కావటం.. తిరిగి సాయంత్రం ఇంటికి రావటం. ఆ తర్వాత హోంవర్కులు, ట్యూషన్లు సరే సరి. అవి అయిపోగానే టీవీల ముందు కూలబడటం. లేదంటే వీడియోగేమ్‌లతోనో, మొబైల్‌ ఫోన్లతోనో గడపటం. దీంతో ఆరుబయట ఆడుకోవటం బాగా తగ్గిపోయింది. మరోవైపు తిండి అలవాట్లూ మారిపోయాయి. బడి నుంచి వచ్చాక పిండి పదార్థాలు ఎక్కువగా గల ఆహారం తినటం.. టీవీ చూస్తూనో, వీడియోగేమ్స్‌ ఆడుతూనో చిప్స్‌ వంటి జంక్‌ఫుడ్‌ తినటం పెరిగిపోయింది. ఇలాంటివన్నీ పిల్లల్లో బరువు పెరగటానికి దోహదం చేస్తున్నాయి. ఆహారం ద్వారా అవసరానికి మించి తీసుకునే కేలరీలను శరీరం కొవ్వుగా మార్చుకుంటుంది. ముఖ్యంగా ఇది కడుపు చుట్టుపక్కల భాగాల్లో స్థిరపడిపోతుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వుతో ప్రమాదమేంటంటే ఇన్సులిన్‌ సామర్థ్యం తగ్గిపోవటం. అంటే ఇన్సులిన్‌ ఉన్నా కూడా కణాలు దానికి స్పందించవన్నమాట. దీన్నే ఇన్సులిన్‌ నిరోధకత అంటారు. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండవు. ఫలితంగా క్లోమం మరింత ఎక్కువగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయటం ఆరంభిస్తుంది. క్రమంగా ఇన్సులిన్‌ గ్లూకోజు స్థాయులను నియంత్రించలేని స్థితికి చేరుకుంటుంది. ఫలితంగా గ్లూకోజు స్థాయులు పెరిగిపోతాయి. కుటుంబంలో ఎవరైనా మధుమేహంతో బాధపడటం కూడా పిల్లలకు దీని ముప్పు పెరగటానికి కారణమవుతోంది. గర్భం ధరించినప్పుడు మధుమేహం (జెస్టేషనల్‌ డయాబెటీస్‌) బారినపడ్డ మహిళలకు పుట్టినవారికి, పుట్టిన సమయంలో తక్కువ బరువు గల పిల్లలకూ ముప్పు పొంచి ఉంటోంది.

గుర్తించటమెలా? 
టైప్‌-2లోనూ అతిగా దాహం, తరచూ మూత్రం,  నిస్సత్తువ, చూపు మసకబారటం, పుండ్లు త్వరగా తగ్గకపోవటం, తరచుగా ఇన్‌ఫెక్షన్ల వంటి లక్షణాలు కనబడతాయి. కాకపోతే టైప్‌-1 మాదిరిగా కాకుండా ఇవి క్రమంగా మొదలవుతుంటాయి.

* మెడ చుట్టూ నలుపు: ఇన్సులిన్‌ స్థాయులు పెరిగిపోతే మెడ చుట్టూ, చంకల్లో, గజ్జల్లో చర్మం నల్లబడుతుంటుంది (అకాంతోసిస్‌ నైగ్రికాన్స్‌) కూడా. చాలామంది పిల్లల్లో దీన్ని బట్టే మధుమేహాన్ని అనుమానించొచ్చు.

చికిత్స- జీవనశైలి మార్పు ప్రధానం 
రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు తొలిదశలోనే గుర్తిస్తే ఆహారంలో మార్పులు, తగినంత శారీరక శ్రమ చేయటం వంటి వాటి ద్వారానే మంచి ఫలితం కనబడుతుంది. మందుల అవసరం లేకుండానే గ్లూకోజు స్థాయులను తిరిగి గాడిలో పెట్టుకోవచ్చు. ఒకవేళ గ్లూకోజు స్థాయులు నియంత్రణలోకి రాకపోతే మందులు వేసుకోవాల్సి ఉంటుంది. వీరికి వెంటనే ఇన్సులిన్‌ ఆరంభించాల్సిన పనేమీ లేదు. పెద్దవాళ్లలో మాదిరిగా మాత్రలతోనే చికిత్స ఆరంభిస్తారు. అవసరమైతే కొంతకాలానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది.

బాల్యానికి తీపి చేదు నిర్ధరించటమెలా? 
రకమేదైనా ర్యాండమ్‌గా చేసే పరీక్షలో రక్తంలో గ్లూకోజు స్థాయులు 200 ఎంజీ/డీఎల్‌, అంతకన్నా ఎక్కువ.. అదే పరగడుపున చేసే పరీక్షలో 126 ఎంజీ/డీఎల్‌, అంతకన్నా ఎక్కువుంటే మధుమేహంగా నిర్ధరిస్తారు. మూడు నెలల కాలంలో గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ పరీక్షలో మరింత కచ్చితంగా సమస్యను నిర్ధరించొచ్చు. ఇది 6.5%, అంతకన్నా ఎక్కువుంటే మధుమేహం ఉందనే అర్థం.

దుష్ప్రభావాలు పొంచి ఉంటాయి 
రక్తంలో గ్లూకోజు స్థాయులు ఎక్కువగా ఉండటం మంచిది కాదు. ఇది రక్తనాళాలను, అవయవాలను దెబ్బతీస్తూ వస్తుంది. దీంతో మున్ముందు గుండెజబ్బుల ముప్పు పెరగొచ్చు. నాడులు, కిడ్నీలు, కళ్లు దెబ్బతిని రకరకాల సమస్యలకు దారితీయొచ్చు. ఎముక సాంద్రత తగ్గటం వల్ల ఎముకలు గుల్లబారే అవకాశమూ ఉంది. బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

చికిత్స- ఇన్సులిన్‌.. నిరంతర నిఘా 
టైప్‌ 1 మధుమేహంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి కాదు. ఒకవేళ ఉత్పత్తి అయినా అది సరిపోకపోవచ్చు. కాబట్టి బయటి నుంచి ఇన్సులిన్‌ ఇవ్వటం తప్పనిసరి. తినే ఆహారం, శారీరక శ్రమ వంటి వాటిని బట్టి గ్లూకోజు స్థాయులు మారిపోతుంటాయి. పిల్లలు రోజూ ఒకేరకం ఆహారం తీసుకోకపోవచ్చు. రోజూ అదే స్థాయిలో ఆటలు ఆడకపోవచ్చు. కాబట్టి రక్తంలో గ్లూకోజు స్థాయులను గమనిస్తూ.. ఇన్సులిన్‌ మోతాదులను మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మధుమేహాన్ని కచ్చితంగా అదుపులో ఉండేలా చూసుకోవచ్చు. అందువల్ల తరచుగా రక్తపరీక్ష చేసి, గ్లూకోజు స్థాయులను గమనించటం తప్పనిసరి. ఇందుకోసం ఇప్పుడు గ్లూకోమీటర్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. వీటితో చిక్కేంటంటే ప్రతీసారీ సూదితో గుచ్చుకోవటం. ఇలాంటి ఇబ్బందిని తొలగించటానికి ఇప్పుడు సెన్సర్‌తో కూడిన పరికరాలూ అందుబాటులో ఉన్నాయి. చిన్న రూపాయి బిళ్లలా ఉండే వీటిని చేతి మీద గానీ, కడుపు మీద గానీ అమరుస్తారు. వీటికి గల సెన్సర్‌ కొద్దిగా చర్మం కిందికి చొచ్చుకెళ్లి.. గ్లూకోజు స్థాయులను పసిగడుతుంది. చిన్న మీటరులాంటి పరికరాన్ని దీని దగ్గరికి తీసుకెళ్తే సమాచారమంతా కనబడుతుంది. వీటిని ఒకసారి అమర్చితే 10-14 రోజుల వరకు పనిచేస్తాయి. అయితే కొన్నిసార్లు ఇవి ఫలితాలను తప్పుగా చూపించే అవకాశం లేకపోలేదు. కాబట్టి సందేహం వస్తే గ్లూకోమీటరుతో పరీక్షించుకోవాలి.

తరచూ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిందేనా? 
పిల్లలకు రోజూ రెండు, మూడు సార్లు ఇంజెక్షన్లు ఇవ్వటమంటే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంటుంది. ఒకసారి ఇస్తే పోయేదేముందని చాలామంది అనుకుంటుంటారు. ఇది సరి కాదు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి పూర్తిగా నయం చేసే చికిత్సలేవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవని అంతా గుర్తించాలి. రక్తంలో గ్లూకోజు స్థాయులను బట్టి ఇన్సులిన్‌ ఇంజెక్షన్లను తీసుకోవటం తప్పనిసరి. ఇవి క్లోమం నుంచి తయారయ్యే ఇన్సులిన్‌ మాదిరిగానే పనిచేస్తూ గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. ఇంజెక్షన్లు క్రమం తప్పకుండా తీసుకునేలా, ఆరోగ్యకరమైన ఆహారం తినేలా, తగినంత శారీరక శ్రమ చేసేలా చూస్తే మధుమేహం గలవారు కూడా మిగతా పిల్లల మాదిరిగానే ఆనందంగా, హాయిగా గడపటానికి వీలుంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా దుష్ప్రభావాలు పొడసూపొచ్చు. 
* ఇన్సులిన్‌ను తేలికగా ఇవ్వటానికి పెన్‌ పరికరమూ అందుబాటులో ఉంది. అంతేకాదు.. గ్లూకోజు స్థాయులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఇన్సులిన్‌ను రక్తంలోకి పంపించే పంపులు కూడా వచ్చాయి. ఇవి చుక్కలు చుక్కలుగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తూ.. రక్తంలో తగినంత ఇన్సులిన్‌ ఉండేలా చూస్తాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగే అవకాశముండదు. ఇటీవల అమెరికాలో నోటితో పీల్చుకునే ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చింది గానీ పిల్లల్లో దీన్ని వాడటానికి ఇంకా అనుమతి రాలేదు.

దాచిపెట్టటం తగదు 
పిల్లలకు మధుమేహం ఉందని తెలియగానే ఎవరికైనా గుండె కలుక్కుమంటుంది. పెద్దవాళ్లంటే ఏమో గానీ.. పిల్లలు దీన్ని ఎలా తట్టుకుంటారో, మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని మనసు తల్లడిల్లిపోతుంది. ఇక అప్పటికే ఇంట్లో ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే ఆందోళన మరింత పెరుగుతుంది. జబ్బు ఉందని బయటికి తెలిస్తే ఇబ్బందులు వస్తాయేమోనని కొందరు తల్లిదండ్రులు సమస్యను దాచిపెడుతుంటారు కూడా. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీంతో పిల్లల మానసిక ఎదుగుదల, ఆత్మ విశ్వాసం దెబ్బతినొచ్చు. మధుమేహం రావటంలో పిల్లల తప్పు ఏమీ లేదని గుర్తించాలి. కుటుంబంతో పాటు స్నేహితులు, ఉపాధ్యాయులు అంతా మధుమేహ బాధిత పిల్లలకు అండగా నిలబడటం, భరోసా కల్పించటం ఎంతైనా అవసరం.

నివారణే ఉత్తమం 
మధుమేహం వచ్చాక బాధపడటం కన్నా అసలు పిల్లలు దీని బారినపడకుండా చూసుకోవటమే మంచిది. టైప్‌ 2 మధుమేహం మన జీవనశైలితో ముడిపడిన సమస్య కాబట్టి ముందు నుంచే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించటంపై దృష్టి సారించాలి. పండ్లు, కూరగాయలతో కూడిన సమతులాహారం తీసుకునేలా అలవాటు చేయాలి. ఆరుబయట ఎక్కువసేపు ఆడుకునేలా ప్రోత్సహించాలి. కాస్త పెద్ద పిల్లలైతే పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత కొట్టటం వంటి వ్యాయామాలు చేసేలా చూడాలి.

సాధారణంగా మామూలు బరువు గల పిల్లలకు టైప్‌-2 మధుమేహం వచ్చే అవకాశం తక్కువ. ఊబకాయం గల పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వీరికి అప్పుడప్పుడు గ్లూకోజు పరీక్ష చేయించటం మంచిది. ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే ఇది మరింత అవసరం.

ఆహారం విషయంలో జాగ్రత్త 
మధుమేహంతో బాధపడే పిల్లలకు ప్రత్యేకించి ఆహార నియంత్రణలేవీ పెట్టకపోవటమే మంచిది. కాకపోతే సమతులాహారం తీసుకునేలా చూడాలి. మనకు ప్రధానంగా పిండి పదార్థాల నుంచే శక్తి లభిస్తుంది. వీటితో పాటు ప్రోటీన్‌, కొవ్వులు తగుపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. అయితే టైప్‌-2 మధుమేహం గల పిల్లలకు.. ముఖ్యంగా ఊబకాయం గలవారికి కేలరీలు తగ్గించటం మంచిది. అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు.. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా గలవారు కొవ్వులు.. కిడ్నీలు దెబ్బతిన్నవారు ప్రోటీన్‌ తగ్గించుకోవాలి. అలాగే బ్రెడ్‌, అన్నం వంటి త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తగ్గిస్తే మేలు. ఐస్‌క్రీమ్‌లు, నూడుల్స్‌, బిస్కట్లు, మిఠాయిలు, చాక్లెట్ల వంటి వాటి విషయంలోనూ జాగ్రత్త అవసరం. అవసరమైతే పోషకాహార నిపుణుల సలహాతో ఆహార పరమైన మార్పులు చేసుకోవచ్చు.

* రక్తంలో గ్లూకోజు స్థాయులు మరీ పడిపోయినప్పుడు (హైపోగ్లైసిమియా) వెంటనే తినటానికి వీలుగా 2 మిఠాయిలు లేదా 3-4 చెంచాల చక్కెర పొడి లేదా గ్లూకోజు పొడి వంటివి వెంట తీసుకెళ్లేలా చూడాలి. అలాగే ఇంటికి రావటం ఆలస్యమైనప్పుడు తినటానికి పండ్లు లేదా బిస్కట్ల వంటివి వెంట ఉంచుకునేలా చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు