Published : 24 May 2022 00:50 IST

దద్దుర్లు పోయేదెలా?

సమస్య-సలహా

సమస్య: నాకు 24 ఏళ్లు. పదేళ్లుగా దద్దుర్లతో (అర్టికేరియా) బాధపడుతున్నాను. చికిత్స తీసుకుంటే తగ్గిపోయింది. ఏడాది క్రితం నుంచి మళ్లీ కనిపిస్తోంది. రక్తంలో ఐజీఈ మోతాదులు 278.4 ఉన్నట్టు తేలింది. చాలారకాల మందులు వాడాను. పూర్తిగా నయం కావాలంటే ఏం చేయాలి?

- ఎ.మౌనిక (ఈమెయిల్‌)

సలహా: మందులు, ఆహార పదార్థాల వంటివి శరీరానికి పడనప్పుడు చర్మం విపరీతంగా స్పందిస్తుంటుంది. దీంతో ఎర్రటి, దురదతో కూడిన బొబ్బల మాదిరి దద్దుర్లు వస్తుంటాయి. దీన్నే అర్టికేరియా అంటారు. మీరు తెలిపిన వివరాలను బట్టి 12 ఏళ్ల వయసు నుంచే దీంతో బాధపడుతున్నారని అర్థమవుతోంది. ఇలాంటి దీర్ఘకాల సమస్యల విషయంలో అసలు సమస్య ఎందుకొస్తుందనేది తెలుసుకోవటం ముఖ్యం. తరచూ జలుబు చేయటం, అలర్జీ, ఆస్థమా, థైరాయిడ్‌ గ్రంథి వాపు వంటివి గలవారికి తేలికగా, మరింత తీవ్రంగా  దద్దుర్లు వచ్చే అవకాశముంది. అందువల్ల మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా? కుటుంబంలో ఎవరికైనా అలర్జీలు, ఆస్థమా వంటివి ఉన్నాయా? అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడు దద్దుర్లు వస్తున్నాయి? ఎప్పుడు ఎక్కువవుతున్నాయో నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఉదాహరణకు- కొందరికి చేపలు, గుడ్లు, కొన్ని పప్పులు, వంట రంగులు, కొన్నిరకాల మందుల వంటివి పడకపోవచ్చు. ఇలాంటి కారణాలేవైనా ఉన్నట్టు గుర్తిస్తే వాటికి దూరంగా ఉంటే సమస్యను చాలావరకు నివారించుకోవచ్చు. అలాగే యాంటీ హిస్టమిన్‌ మందులు బాగా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని దీర్ఘకాలం వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సురక్షితమైన, మత్తు కలిగించని మందులు అందుబాటులో ఉన్నాయి. వీటితో దుష్ప్రభావాలు ఉండవు. కనీసం ఆరు నెలల వరకైనా మందులు వాడుకోవాలి. కానీ కొందరు దద్దుర్లు తగ్గగానే సమస్య నయమైందనుకొని మానేస్తుంటారు. దీంతో మళ్లీ తిరగ బెడుతుంది. క్రమం తప్పకుండా మందులు వాడుకుంటే నూటికి 50 మందికి ఆరు నెలల్లోనే దాదాపుగా దద్దుర్లు నయమైపోతాయి. ఆరు నెలల తర్వాతా తగ్గకపోతే మందు మోతాదు పెంచాల్సి ఉంటుంది. వీటిని ఏడాది, ఏడాదిన్నర వరకు వాడుకోవాలి. దీంతో నూటికి 75 మందికి ఉపశమనం లభిస్తుంది. అప్పటికీ ఫలితం కనిపించకపోతే ఐదారేళ్ల వరకూ మందులు అవసర మవుతాయి. మందుల వాడకం, శరీరానికి పడని వాటిని గుర్తించి దూరంగా ఉండటం విషయంలో కౌన్సెలింగ్‌ చాలా కీలకం. పరిస్థితిని అర్థం చేసుకొని, మంచి చికిత్స తీసుకుంటే సమస్య నుంచి పూర్తిగా బయటపడొచ్చు. అలాగే వదులైన దుస్తులు ధరించాలి. వీలైనంతవరకు గోకకుండా చూసుకోవాలి. కఠినమైన సబ్బులు వాడుకోకూడదు. ఇలాంటి జాగ్రత్తలతో రోజువారీ పనులకు ఇబ్బంది కలగకుండా, హాయిగా కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవచ్చు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని