Updated : 07 Jun 2022 05:50 IST

ఒళ్లంతా ఇదేం వేడి?

సమస్య: నాకు 32 ఏళ్లు. ఎనిమిదేళ్ల కిందట దగ్గు తగ్గటానికి భోజనం చేసే ముందు 2 చెంచాల మిరియాల పొడి తీసుకోవాలని ఒక ఆయుర్వేద డాక్టర్‌ చెప్పారు. అలా రోజుకు మూడు సార్ల చొప్పున 2 నెలలు వాడాను. ఆ తర్వాత నెమ్మదిగా ఒళ్లంతా వేడి భావన కలగటం మొదలైంది. ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది. చెవులు, కళ్లు, పొట్ట, మలద్వారం మండినట్టు అనిపిస్తుంటుంది. పండ్లు గానీ మసాలాలు గానీ తింటే ఇంకాస్త ఎక్కువవుతుంది. చాలా ఆసుపత్రులు తిరిగాను. అన్ని రిపోర్టులు నార్మల్‌గానే వచ్చాయి. కారణమేంటో తేలలేదు. నా సమస్యకు పరిష్కారమేంటి?

- కె. మదన్‌మోహన్‌

సలహా: ఆహార పదార్థాలతో వేడి కావటమనేది ఉండదు. అయినా మీరు ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట మిరియాల పొడి వాడారు. దాని ప్రభావం ఇప్పటివరకూ ఉండటమనేది అసాధ్యం. మనదగ్గర వేడి భావనను రకరకాల సమస్యలకు వాడుతుంటారు. ఉదాహరణకు- మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లతోనో, ఒంట్లో నీటిశాతం తగ్గటంతోనో మూత్రం మంట పుట్టినా వేడి చేసిందని భావిస్తుంటారు. మలద్వారం వద్ద చీలికలు, మొలల సమస్యనూ వేడిగా అనుకుంటుంటారు. కలుషిత ఆహారం తినటం వల్ల కడుపులో మంటగా అనిపించినా వేడి చేసిందనే భావిస్తుంటారు. కాబట్టి కారణమేంటన్నది గుర్తించటం ముఖ్యం. సాధారణంగా నాడులు దెబ్బతినటం వల్ల మండుతున్న భావన కలుగుతుంది. మధుమేహుల్లో ఇలాంటిది ఎక్కువ. మీకు మధుమేహం ఉందో, లేదో తెలియజేయలేదు. ఒకవేళ మధుమేహం ఉన్నా ఇంత చిన్న వయసులో నాడులు దెబ్బతినటమనేది అరుదు. విటమిన్‌ బి12 లోపంతోనూ ఒళ్లంతా మంటగా అనిపించొచ్చు. మీరు ఇప్పటికే చాలా ఆసుపత్రులు తిరిగానని అంటున్నారు. అన్ని పరీక్షలు చేసినా సమస్యేంటో తేలలేదంటే మానసిక సమస్య ఏదైనా ఉండొచ్చని అనిపిస్తోంది. సొమాటిక్‌ సింప్టమ్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్యలో ఇదమిత్థమైన కారణం, సమస్యలేవీ లేకపోయినా నొప్పి, మంట పుడుతున్న భావన కలుగుతుంటుంది. ఇదేమీ అబద్ధం కాదు. నిజంగానే బాధలను అనుభవిస్తుంటారు. దీనికి ఆందోళన సమస్య, కుంగుబాటు వంటివి కారణం కావొచ్చు. మీరు పరీక్షల్లో ఏమీ తేల లేదని అంటున్నారు కాబట్టి ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదించటం మంచిది.


మీ ఆరోగ్య సమస్యలు, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా:
sukhi@eenadu.in


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని