ఒత్తిడితో రోగనిరోధకశక్తి చిత్తు!

ఫ్లూ, కొవిడ్‌-19 వంటి జబ్బులతో పోరాడటంలో రోగనిరోధక ప్రతిస్పందన చక్కగా ఉండటం కీలకం. అయితే, వయసు పెరుగుతున్నకొద్దీ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం పడిపోతుంటుంది. దీంతో జబ్బుల నివారణ, ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకోవటం

Updated : 28 Jun 2022 02:34 IST

ఫ్లూ, కొవిడ్‌-19 వంటి జబ్బులతో పోరాడటంలో రోగనిరోధక ప్రతిస్పందన చక్కగా ఉండటం కీలకం. అయితే, వయసు పెరుగుతున్నకొద్దీ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం పడిపోతుంటుంది. దీంతో జబ్బుల నివారణ, ఇన్‌ఫెక్షన్ల నుంచి కోలుకోవటం, టీకాలకు స్పందించే గుణం తగ్గుతుంటుంది. కానీ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యం అందరిలోనూ ఒకేలా తగ్గాలనేమీ లేదు. వ్యాయామం వంటి మంచి అలవాట్లతో ఈ క్షీణించే వేగం నెమ్మదిస్తుంది. అదే పొగ తాగటం వంటి దురలవాట్లతో ఇంకాస్త త్వరగా తగ్గుతుంది. ఇందులో సామాజిక కారణాలతో తలెత్తే ఒత్తిడి సైతం పాలు పంచుకుంటున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. వివక్ష, ఒత్తిడితో కూడిన సంఘటనలు, దీర్ఘకాలిక ఒత్తిడి, ప్రాణాపాయ పరిస్థితి వంటివి ఎదుర్కొన్న వారి రక్త నమూనాలను పరిశోధకులు పరిశీలించారు. వీరిలో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్తకణాల సంఖ్య, సామర్థ్యం తగ్గుతున్నట్టు గుర్తించారు. ఒత్తిడిని ఎదుర్కొనేవారు పొగ, మద్యం తాగటం.. సరైన ఆహారం తినకపోవటం, అంతగా వ్యాయామం చేయలేకపోవటం వంటివి ఇందుకు ఒక కారణం కావొచ్చని అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్త ఎరిక్‌ క్లోప్యాక్‌ అంటున్నారు. వివక్ష కూడా తక్కువదేమీ కాదు.. ఇది గుండెజబ్బు వంటి దీర్ఘకాలిక జబ్బులు, మానసిక సమస్యలు, మరణం ముప్పు ఎక్కువ కావటం వంటి వాటికి దారితీస్తోందని వివరిస్తున్నారు. ఒత్తిడికి గురికావటం నిజంగానే శరీరాన్ని క్షీణింపజేస్తుందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే శరీరం ఒత్తిడిని ఎప్పటికీ మరచిపోవటం లేదన్నమాట. దీని ప్రభావాలు సుదీర్ఘకాలం కొనసాగుతుండటం, రోగనిరోధకశక్తి ప్రతిస్పందనను దెబ్బతీస్తుండటమే దీనికి నిదర్శనం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని