నాటు నాటు కాదు నేటి వైద్యమే కావాలి!

ఒకరికి పొలంలో పాము కరిచింది. అతడి ఇల్లు ఆసుపత్రికి దగ్గరే. ఇంట్లో ఎవరికి జబ్బు చేసినా ఆసుపత్రికే వెళ్లేవారు. పాము కరిస్తే మాత్రం చుట్టుపక్కలవారు అతడిని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవటంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు.

Updated : 22 Aug 2023 06:58 IST

పాము కాటు - ప్రమాదాలు

 

  • ఒకరికి పొలంలో పాము కరిచింది. అతడి ఇల్లు ఆసుపత్రికి దగ్గరే. ఇంట్లో ఎవరికి జబ్బు చేసినా ఆసుపత్రికే వెళ్లేవారు. పాము కరిస్తే మాత్రం చుట్టుపక్కలవారు అతడిని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవటంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించి అతడు అప్పటికే మరణించాడు.
  • మరొకరికి మిరపకాయలు బస్తాల్లోకి ఎత్తేటప్పుడు పాము కరిచింది. ఆ ప్రాంతం ఆసుపత్రికి దూరంగా ఉంది. కూలీలంతా కలిసి అతడిని నాటు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. కానీ ఆయన తనను ఆసుపత్రికే తీసుకెళ్లమని పట్టుబట్టాడు. కూలీలు కాదనలేకపోయారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే పెద్ద రక్తపు వాంతి చేసుకున్నాడు. అంతా కంగారు పడ్డారు. డాక్టర్‌ వెంటనే చికిత్స చేయటంతో పూర్తిగా కోలుకున్నాడు. బతికి బట్టకట్టాడు.
  • ఈ రెండు సంఘటనలు నేర్పుతున్న పాఠం ఒకటే. పాము కరిచినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా యాంటీ స్నేక్‌ వీనమ్‌ (ఏఎస్‌వీ) ఇంజెక్షన్లు అందుబాటులో గల ఆసుపత్రికి చేర్చాలనే. సత్వరం చికిత్స ప్రారంభిస్తే ప్రాణాపాయం సంభవించకుండా చూడొచ్చనే. అయినా కూడా మనదగ్గర ఎంతోమంది పాము కాట్లకు బలవుతుండటం విచారకరం. ప్రజల్లో సరైన అవగాహన లేకపోవటం.. ఆసుపత్రికి వెళ్లటానికి నిరాకరించటం.. నాటు వైద్యులను, మంత్రగాళ్లను ఆశ్రయించటం.. అనసరంగా, అతిగా భయపడటం.. కొన్నిచోట్ల డాక్టర్లు చికిత్సకు నిరాకరించటం వంటివన్నీ దీనికి కారణమవుతున్నాయి.

మనది వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలే పెద్ద దిక్కు. వీటి ప్రభావంతో ఇప్పుడు వానలు బాగా కురుస్తున్నాయి. వ్యవసాయ పనులూ ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొందరికి పాము కాట్ల బెడద తప్పటం లేదు. మనదగ్గర వానాకాలంలోనే ఎక్కువ మంది పాము కాట్లకు గురువుతుంటారు. వ్యవసాయ పనులు పుంజుకోవటమే కాదు, పాములు ఎక్కువగా సంచరించేది ఈ సమయంలోనే. నిజానికి పాములకు భయం ఎక్కువ. చాలావరకు ఇతరుల కంట పడకుండా ఉండటానికే ప్రయత్నిస్తాయి. కానీ తమకు భంగం కలిగినా, ప్రమాదం పొంచి ఉందనుకున్నా తమను తాము కాపాడుకోవటానికి ఉగ్రరూపం ధరిస్తాయి. తమ కోరలతో కాటు వేసి, విషాన్ని వెదజల్లుతాయి. ఇది రక్తంలోకి ప్రసరిస్తే తీవ్ర ప్రమాదం వాటిల్లుతుంది. ఆయా పాములను బట్టి క్రమంగా శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలొచ్చు, రక్తస్రావం కావొచ్చు, షాక్‌లోకి వెళ్లిపోవచ్చు, అవయవాలు విఫలం కావొచ్చు. చివరికి ప్రాణాపాయమూ సంభవించొచ్చు. మనదేశంలో ఏటా 54,600 మంది పాము కాట్లతో మరణిస్తున్నారని అంచనా. వీరిలో అధిక శాతం మంది గ్రామాల్లో నివసించేవారే. మన దేశంలో చాలారకాల పాములు ఉన్నప్పటికీ మనిషిని చంపగలిగేంత విషం ఉన్నవి మొత్తమ్మీద ఐదే. మన తెలుగు రాష్ట్రాల్లోనైతే మూడే. అవే తాచు పాము, కట్ల పాము, రక్త పింజర. నిజానికి పాము కాటు మరణాలన్నీ నివారించదగినవే. పాము కరిచినవారిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చటం, ధైర్యం కల్పించటం, తగు చికిత్స చేయటం ద్వారా చాలామందిని బతికించుకోవచ్చు.


ఏ పామో గుర్తించాలి కానీ..

పాము కరిచిన వెంటనే ముందుగా చేయాల్సింది అది ఏ పామో గుర్తించటం. అయితే ఈ ప్రయత్నంలో ఎక్కువ సమయం వృథా చేయొద్దు. పామును వెంటాడి, వేటాడి, చంపి దాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పనిలేదు. ఎందుకంటే కరిచిన విష సర్పాన్ని డాక్టర్‌కు చూపించినా వెంటనే యాంటీ స్నేక్‌ వీనమ్‌ (ఏఎస్‌వీ) ఇంజెక్షన్‌ ఇవ్వరు. విష లక్షణాలు గమనించినప్పుడే వైద్యం చేస్తారని గుర్తుంచుకోవాలి.


ధైర్యం చెప్పటం ముఖ్యం

పాము కరిచిందనగానే భయాందోళనలు కలగటం సహజం. కొందరైతే చనిపోతున్నామని తమకు తామే తీర్మానించుకొని, అయిన వాళ్లకు అప్పగింతలు పెడుతుంటారు కూడా. ఇరుగు పొరుగూ ఆరున్నొక్క రాగంతో ఏడుపు లంకించుకుంటారు. ఇది తగదు. పాము కరిచినవారికి ధైర్యం చెప్పి, తాము అండగా ఉన్నామనే భరోసా కలిగించాలి. పాము విషానికి విరుగుడు ఇంజెక్షన్లు ఉన్నాయని, డాక్టర్‌ దగ్గరికి వెళ్తే ప్రమాదం నుంచి బయటపడతామని అర్థమయ్యేలా చెప్పాలి. చికిత్సతో బతికి బట్టకట్టినవారిని పదేపదే గుర్తుచేయాలి.


మరీ బిగుతుగా కట్టొద్దు

పాము కరిచిన చోటుకు కొంత పైభాగాన గట్టిగా కట్టు కట్టటం చూస్తుంటాం. అంత బిగుతుగా కట్టాల్సిన అవసరం లేదు. తాడుతోనో, ప్లాస్టిక్‌ తీగతోనో మరీ గట్టిగా లాగి బిగించి కడితే రక్తప్రసరణ ఆగిపోవచ్చు. ఆసుపత్రికి వెళ్లేసరికే ఆ శరీర భాగం కుళ్లిపోవచ్చు. తుండుతోనో, చేతి రుమాలుతోనో ఒక మాదిరిగా బిగించి కట్టాలి. కట్టులోంచి ఒక వేలు దూరేంతగా బిగించి కడితే చాలు. తలపై కరిస్తే మాత్రం కట్టు కట్టకూడదు.


కరిచిన చోట ఏంచేయాలి?

ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. పాము కాట్లను పరిశీలించి, గుర్తిస్తే చాలు. రెండు లేదా మూడు గాట్లుంటే విషసర్పమనీ, ఎక్కువ గాట్లుంటే మామూలు పామని గుర్తించొచ్చు. పాము కరిచిన భాగాన్ని కడగటం గానీ రుద్దటం గానీ చేయొద్దు. అలా చేస్తే విషం తొందరగా రక్తంలోకి వెళ్తుంది. పాము కాటు వద్ద నోరు పెట్టి, విషంతో పాటు రక్తాన్ని పీల్చి ఉమ్మేయటం సినిమాల్లో చూపిస్తుంటారు. ఇది అంత మంచి పని కాదు. ఎందుకంటే విషపూరిత రక్తాన్ని మొత్తం పీల్చేయటం అసాధ్యం. ఒకవేళ నోట్లో ఎంత చిన్న పుండున్నా పీల్చేవారికీ ప్రమాదమే.


నడిపించొద్దు, తినిపించొద్దు

పాము కరిచినవారిని నడిపించొద్దు. కారో, ఆటోనో, స్కూటరో, సైకిల్‌ మీదో ఎక్కించుకొని వీలైనంత త్వరగా ఎంబీబీఎస్‌ డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి. నడిస్తే విషం త్వరగా ఒళ్లంతా పాకుతుంది. ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పాము కరిచినవారికి నోటి నుంచి ఎలాంటి ఆహారమూ ఇవ్వద్దు.


నాటు వైద్యాలు, మంత్రాల జోలికి వెళ్లొద్దు

పసరు మందులు, మంత్రాలతో విషం తగ్గుతుందని కొందరు వాదిస్తుంటారు. ఇది నిజం కాదు. విషపు పాము కరిచినా నూటికి 30 నుంచి 50 సార్లు అవి మనిషిలోకి విషాన్ని ఎక్కించవు. ఈ కాట్లను ‘డ్రై బైట్స్‌’ అంటారు. ఇలాంటివారికి నాటు వైద్యం చేసినా, మంత్రం వేసినా, ఏ తంత్రమో చేసినా బతికి బట్టకడతారు. నిజంగా విషసర్పం కరిచినప్పుడు, ఒంట్లో విషం ప్రవహిస్తున్నప్పుడు యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఒక్కటే మందు. ఇది తప్ప ప్రపంచంలో మరేదీ విషాన్ని నిర్వీర్యం చేయలేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లటం తప్పనిసరి. సమయం మించిపోయాక చేయగలిగిందేమీ లేదు.


డాక్టర్లూ భయపడొద్దు!

కొన్నిచోట్ల డాక్టర్లకు పాము కాటు చికిత్స మీద సరైన అవగాహన లేకపోవటం, ముందే భయపడి పెద్దాసుపత్రులకు పంపటం మూలంగానూ దారిలోనే మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా తాచు పాము, కట్ల పాము కరిచినవారు శ్వాస ఆగిపోయి చనిపోతుంటారు. సత్వరం ఏఎస్‌వీ ఇంజెక్షన్లు ఇస్తే వీరిని కాపాడుకోవచ్చు. కాబట్టి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎస్‌వీ ఇంజెక్షన్లు ఉండేలా చూసుకోవాలి. పాము కరిచినవారు వస్తే విధిగా చికిత్స అందించాలి. సమస్య విషమిస్తే పెద్దాసుపత్రికి పంపించాలి. నిజానికి పాము కాటుకు గురైనవారిలో నూటికి ఒకరికే పెద్దాసుపత్రికి పంపించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వీరిని పంపించేటప్పుడు కూడా వెంటిలేటర్‌ సదుపాయం గల అంబులెన్స్‌లోనే తరలించాలి. అంబులెన్స్‌లో వెంటిలేటర్‌ సదుపాయం లేనప్పుడు అవసరమైతే గొంతులోకి గొట్టాన్ని వేసి, యాంబూ బ్యాగు సాయంతో శ్వాస కల్పించే ప్రయత్నం చేయాలి. దీంతో నూటికి నూరు శాతం పాము కాటు మరణాలను ఆపేయొచ్చు.


ఏఎస్‌వీ ఇంజెక్షన్‌ అమూల్యం

యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇంజెక్షన్‌ ప్రాణాలను కాపాడే మందు. దీని తయారీ చాలా కష్టం. గుర్రాల రక్తం నుంచి దీన్ని రూపొందిస్తారు. ముందుగా తాచు పాము, కట్ల పాము, రక్త పింజర, ఫుర్సా (సా-స్కేల్డ్‌ వైపర్‌) పాముల విషాలను తీసి.. వేర్వేరు గుర్రాలకు ఎక్కిస్తారు. కొంతకాలానికి గుర్రాల్లో ఆయా విషాలను ఎదుర్కొనే యాంటీబాడీలు పుట్టుకొస్తాయి. విడివిడిగా ఈ యాంటీబాడీలను సేకరించి, అన్నింటినీ కలిపి యాంటీ స్నేక్‌ వీనమ్‌ను తయారుచేస్తారు. దీనికి చాలాకాలం పడుతుంది. ఇంత అమూల్యమైన మందును ఎలాపడితే అలా ఇవ్వటం తగదు. అవసరమైనవారికి ఉపయోగపడేలా కాపాడుకోవాలి.


లక్షణాలేంటి?

తాచు, కట్ల పాముల విషాలు నాడుల పనితీరును దెబ్బతీస్తాయి. నాడుల నుంచి కండరాలకు సంకేతాలు అందవు. దీంతో కళ్లు మూతపడటం, చూపు రెండుగా కనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ కండరాలు పనిచేయకపోవటం వల్ల శ్వాస సరిగా తీసుకోలేకపోవచ్చు. ఫలితంగా రక్తంలో ఆక్సిజన్‌ తగ్గిపోయి గుండె, మెదడు స్తంభించిపోవచ్చు. ఇదంతా జరగకముందే చికిత్స ఆరంభించాల్సి ఉంటుంది. ఇక రక్త పింజర కరిస్తే రక్తం గడ్డకట్టే స్వభావం పోతుంది. దీంతో ఒంట్లో ఎక్కడపడితే అక్కడ రక్తస్రావమవుతుంది. కడుపులో రక్తస్రావమైతే రక్తం వాంతి కావొచ్చు, మలంలో, మూత్రంలో రక్తం పడొచ్చు. కరిచిన చోట, కళ్లలోంచి రక్తస్రావం కావొచ్చు. ఇది చాలా ప్రమాదకరం.


చికిత్స ఎలా?

పాము కరిచిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు ముందుగా స్పృహలో ఉన్నారా? నాడి ఎలా కొట్టుకుంటోంది? బీపీ ఎలా ఉంది? ఒంట్లో విషం తాలూకు లక్షణాలేవైనా ఉన్నాయా? అనేవి చూస్తారు.

  •  విష లక్షణాలు లేనప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. వీరికి రక్తనాళం ద్వారా నెమ్మదిగా సెలైన్‌ ఎక్కిస్తారు. నోటి నుంచి ఎలాంటి ఆహారమూ ఇవ్వరు.
  •  ధైర్యం కలిగించటం చాలా ముఖ్యం. పాము కరిచినా ఇప్పటివరకూ ఎలాంటి లక్షణాలు లేవు కదా, ఒకవేళ లక్షణాలు మొదలైనా కూడా మంచి చికిత్స ఉందని, ప్రాణాలకు అపాయమేమీ లేదని భరోసా ఇస్తారు.
  •  గతంలో టీటీ ఇంజెక్షన్‌ తీసుకోనివారికి ముందు జాగ్రత్తగా ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.
  •  అప్పటికే విష ప్రభావం మొదలైనా, ఆసుపత్రిలో చేరాక విష లక్షణాలు మొదలైనా యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇంజెక్షన్లు ఇవ్వటం ఆరంభిస్తారు. శరీరం లోపల ప్రసరిస్తున్న విషాన్ని వీలైనంత త్వరగా నిర్వీర్యం చేయటం చాలా ముఖ్యం. అందుకే వెంటవెంటనే 10 మోతాదులు ఏఎస్‌వీ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా సెలైన్‌లో ఏఎస్‌వీని కలిపి ఎక్కించాలని భావిస్తుంటారు. కానీ నేరుగా రక్తనాళం ద్వారా ఇస్తేనే సత్వర గుణం కనిపిస్తున్నట్టు అనుభవాలు చెబుతున్నాయి. ఎవరికైనా 10 మోతాదులతో ఫలితం కనిపించకపోతే మరో 10 మోతాదుల ఇంజెక్షన్లు అవసరమవుతాయి. రక్త పింజర కరిస్తే కొన్నిసార్లు మొత్తం 30 మోతాదులు కూడా ఇవ్వాల్సి రావొచ్చు. సాధారణంగా ఏఎస్‌వీ మోతాదులు ఇచ్చిన 24 నుంచి 48 గంటల తర్వాత పరిస్థితి కుదురుకుంటుంది. తాచు పాము కరిచినవారిలోనైతే నాలుగైదు గంటల్లోనే మంచి ప్రభావం కనిపిస్తుంది. కట్ల పాము కాటుకు గురైనవారిలో ఒకటి నుంచి మూడు రోజులు పట్టొచ్చు. రక్తపింజర కరిచినవారిలో రక్తం గడ్డకట్టే స్వభావం తిరిగి రావటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది.
  • తాచు పాము, కట్ల పాము విష లక్షణాలు కనిపించినప్పుడు ఏఎస్‌వీ ఇంజెక్షన్లు ఇవ్వటంతో పాటు ఆక్సిజన్‌ కూడా పెడతారు. ఒకవేళ శ్వాస ఆగిపోయే పరిస్థితి ఉంటే వెంటిలేటర్‌ పరికరం సాయంతో కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. వెంటిలేటర్‌ సదుపాయం లేకపోతే యాంబూ బ్యాగును చేత్తో వత్తుతూ శ్వాస కల్పించాల్సి ఉంటుంది.

    కనీస పరీక్షలు

పాము కరిచినవారికి సీబీపీ, రక్తం గడ్డకట్టే సమయం (క్లాటింగ్‌ టైమ్‌), రక్తంలో క్రియాటినిన్‌, గ్లూకోజు.. మూత్ర పరీక్షలు అవసరమవుతాయి. వీటిల్లో క్లాటింగ్‌ టైమ్‌ చాలా ముఖ్యం. రక్త పింజర కరిచినవారికి ఒంట్లో ఎక్కడపడితే అక్కడ రక్తస్రావమయ్యే ప్రమాదముంది. అందుకే గంటకోసారి క్లాటింగ్‌ టైమ్‌ పరీక్ష చేసి, పరిశీలించాల్సి ఉంటుంది. ఇది నార్మల్‌గా ఉంటే 24 గంటల తర్వాత ఇంటికి పంపిస్తారు. తాచు పాము, కట్ల పాము కరిచినవారికి పరీక్షా ఫలితాల్లో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కానీ రక్తంలో గ్లూకోజు, క్రియాటినిన్‌ వంటివి తెలుసుకోవటానికి ఈ కనీస పరీక్షలు అవసరం.


ఎప్పుడు కోలుకున్నట్టు?

తాచు పాము, కట్ల పాము కరిచినవారు తమంతట తాము శ్వాస తీసుకోలిగితే పూర్తిగా కోలుకున్నట్టే. రక్త పింజర కరిచినవారు రక్తం గడ్డకట్టే స్వభావం మామూలు స్థితికి చేరుకుంటే 90% వరకూ ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. వీరిలో కొందరికి కిడ్నీలు చెడిపోయే అవకాశముంది. అందువల్ల రెండు మూడు రోజుల వరకు రక్తంలో క్రియాటినిన్‌ పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇది నార్మల్‌గా ఉంటే పూర్తిగా బయటపడిపడినట్టే. రక్తపింజర కరిచిన చోట వాపు తలెత్తుతుంది. కొందరికి ఆ భాగం కుళ్లిపోవచ్చు. వీరికి అక్కడ కోత పెట్టి, కట్టు కట్టి, యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.  


అనవసరంగా ఏఎస్‌వీ ఇవ్వద్దు

కొన్నిచోట్ల పాము కరిచిందనగానే ముందు జాగ్రత్తగా రెండో మూడో ఏఎస్‌వీ ఇంజెక్షన్లు ఇవ్వటం గమనిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. విష ప్రభావ లక్షణాలు లేనివారికి ఏఎస్‌వీ ఇవ్వటం దండగ. ఈ ఇంజెక్షన్‌తో దద్దురు, దురద, రక్తపోటు పడిపోవటం, షాక్‌లోకి వెళ్లటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు.  అందువల్ల విషం ఎక్కినవారికి ఏఎస్‌వీతో పాటు ఇలాంటి దుష్ప్రభావాలను అడ్డుకునే మందులనూ ఇస్తూ చికిత్స చేస్తారు. అసలు విషమే లేనివారికి దీన్ని ఇవ్వటం ఎందుకు? దుష్ప్రభావాల బారినపడేయటం ఎందుకు? ఒకవేళ ఏఎస్‌వీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే 8-10 మోతాదులు ఇవ్వాల్సిందే. రెండు, మూడు మోతాదులతో ఎలాంటి ఫలితమూ ఉండదు. విష ప్రభావం నుంచి కోలుకోనివారికి కొన్నిచోట్ల 100, 120 ఇంజెక్షన్లు ఇవ్వటమూ చూస్తున్నాం. అలాంటి అవసరం ఎప్పుడూ రాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని