cancer: అసలే క్యాన్సర్‌ ఆపై రక్తహీనత!

శరీరంలో ప్రతి కణానికీ ఆక్సిజన్‌ అవసరం. ఇది రక్తం ద్వారానే అందుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను మోసుకొని వెళ్లి,  కణాలకు చేరవేస్తుంది.

Updated : 10 Oct 2023 01:27 IST

శరీరంలో ప్రతి కణానికీ ఆక్సిజన్‌ అవసరం. ఇది రక్తం ద్వారానే అందుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హిమోగ్లోబిన్‌ ఆక్సిజన్‌ను మోసుకొని వెళ్లి,  కణాలకు చేరవేస్తుంది. రక్తంలో ఎర్ర కణాల సంఖ్య తగ్గినా, హిమోగ్లోబిన్‌ మోతాదు పడిపోయినా రక్తహీనత(ఎనీమియా)కు దారితీస్తుంది. క్యాన్సర్‌ బాధితులకూ దీని ముప్పు ఎక్కువ. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. చికిత్స తీసుకోకపోతే పలు ఇబ్బందులు మొదలవుతాయి.

క్యాన్సర్‌ పేరు వింటేనే భయం కలుగుతుంది. ఇక దీనికి రక్తహీనత కూడా తోడైతే పరిస్థితి మరింత విషమిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. క్యాన్సర్‌లో రక్తహీనతకు చికిత్సల దగ్గరి నుంచి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.

  • దీర్ఘకాలంగా రక్తం కోల్పోవటం: జీర్ణకోశ వ్యవస్థలోని పెద్దపేగు, జీర్ణాశయం, మలద్వార క్యాన్సర్లలో రక్తస్రావం కావొచ్చు. గర్భసంచి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలోనూ ఇది తలెత్తొచ్చు. ఇలా దీర్ఘకాలంగా రక్తం పోవటం వల్ల ఐరన్‌ లోపంతో తలెత్తే రక్తహీనత పొడసూపుతుంది. ఎందుకంటే హిమో గ్లోబిన్‌లో ఐరన్‌ కీలక భాగం మరి.
  • ఎముక మజ్జ అణచివేత: ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేసే ఎముక మజ్జ మీదా క్యాన్సర్‌ ప్రభావం చూపుతుంది. కొన్ని క్యాన్సర్లు.. ముఖ్యంగా ల్యుకీమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఎముక మజ్జలోకీ ప్రవేశిస్తాయి. రక్తాన్ని తయారుచేసే కణాలను నిర్వీర్యం చేస్తాయి.
  • కీమోథెరపీ ప్రభావం: చాలా రకాల కీమోథెరపీ మందులు ఎముక మజ్జ పనితీరును అణచివేస్తాయి. ఫలితంగా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. కీమోథెరపీ తీసుకునేవారిలో రక్తహీనతకు ప్రధాన కారణం ఇదే.
  • వాపు కారకాల ఉద్ధృతి: కొన్ని క్యాన్సర్లు వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే సైటోకైన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎముక మజ్జ సామర్థ్యాన్ని అణచివేసి, ఎర్ర రక్తకణాల తయారీని దెబ్బతీస్తాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది.
  • ఎర్ర రక్తకణాల విచ్ఛిన్నం: కొన్ని క్యాన్సర్లు నేరుగా రక్త కణాలను విచ్ఛిన్నం (హిమోలైసిస్‌) చేస్తాయి. మల్టిపుల్‌ మైలోమా వంటి క్యాన్సర్లలో ఇలాంటిది కనిపిస్తుంటుంది.
  •  కిడ్నీ సమస్యలు: కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయటంతో పాటు ఎరిత్రోపోయిటిన్‌ అనే హార్మోన్‌నూ ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాల తయారీని ప్రేరేపిస్తుంది. కొన్ని క్యాన్సర్లు, క్యాన్సర్‌ మందులు సైతం కిడ్నీ సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చు. దీంతో ఎరిత్రోపోయిటిన్‌ ఉత్పత్తీ తగ్గుతుంది.
  • విటమిన్‌ బి12 లోపం: ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్‌లెట్ల తయారీలో విటమిన్‌ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని క్యాన్సర్లు, క్యాన్సర్‌ మందులు విటమిన్‌ బి12 మోతాదులను తగ్గిస్తాయి. ఇదీ పరోక్షంగా రక్తహీనతకు కారణమవుతుంది.

లక్షణాలు ఎన్నో..

  • నిస్సత్తువ
  • చర్మం పాలిపోవటం
  • ఆయాసం
  • తల తేలిపోతున్నట్టు అనిపించటం
  • చేతులు, పాదాల వాపు - తలనొప్పి
  • గుండె వేగంగా కొట్టుకోవటం
  • శ్వాస వేగంగా తీసుకోవటం

చికిత్స ఏంటి?

ఆయా కారణాలను పరిష్కరిస్తే రక్తహీనత కూడా నయమవుతుంది. అందువల్ల ముందుగా రక్తహీనతకు దారితీస్తున్న సమస్యలను తగ్గించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తారు. అవసరాన్ని బట్టి ఐరన్‌ మాత్రలు, రక్తనాళం ద్వారా ఐరన్‌ ఇవ్వటం, ఎరిత్రోపోయిటిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించే మందులు సూచిస్తారు. కొందరికి రక్త మార్పిడీ అవసరమవ్వచ్చు.

సమస్యలు ఇవీ

రక్తహీనతకు తగు చికిత్స తీసుకోకపోతే రకరకాల సమస్యలు తలెత్తుతాయి.

  • రక్తహీనత మూలంగా విషయ గ్రహణ సామర్థ్యం తగ్గొచ్చు. దీంతో ఏకాగ్రత కుదరకపోవటం, జ్ఞాపకశక్తి తగ్గటం, నిర్ణయాలు తీసుకోలేకపోవటం వంటి ఇబ్బందులు కనిపిస్తాయి.
  • కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి చికిత్సలను తట్టుకునే సామర్థ్యం తగ్గొచ్చు. ఫలితంగా చికిత్సలు ఆలస్యం కావొచ్చు. మందుల మోతాదు తగ్గించాల్సి రావొచ్చు. చికిత్స మధ్యలో ఆపేయొచ్చు. ఫలితంగా క్యాన్సర్‌ చికిత్సల ప్రభావమూ తగ్గుముఖం పడుతుంది.
  • శస్త్రచికిత్సల అనంతరం కోత నయం కావటం వంటివీ ఆలస్యం కావొచ్చు. దీంతో శస్త్రచికిత్సల నుంచి కోలుకోవటం కష్టమవుతుంది.
  • రక్తహీనత గలవారికి తల తేలిపోవటం, తల తిప్పే ముప్పు ఎక్కువ. దీంతో కింద పడిపోవచ్చు. గాయాలు కావొచ్చు. ముఖ్యంగా పెద్ద వయసువారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.

ఇంటి జాగ్రత్తలు

రక్తహీనతను నియంత్రించుకోవటమనేది క్యాన్సర్ల రకాలు, వాటి తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవటం మంచిది. అత్యవసరమైన పనులు ముందుగా చేసేలా చూసుకోవాలి. అలాగే ఆహార పరంగానూ ఐరన్‌ ఎక్కువగా లభించే పదార్థాలు తీసుకోవాలి. మాంసం, చికెన్‌, గుడ్లు, చేపలు, చిక్కుళ్లు, పప్పులు, పాలకూర, ఖర్జూరం వంటి ఎండు ఫలాల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. బత్తాయి, నారింజ, జామ వంటి విటమిన్‌ సి లభించే పండ్లూ తీసుకోవాలి. డాక్టర్‌ సూచనల మేరకు మాత్రలు వేసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు