దీర్ఘ జలుబు!

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గినా కొందరికి దగ్గు, కడుపునొప్పి, విరేచనాల వంటివి విడవకుండా వేధించటం తెలిసిందే. నాలుగు వారాలకు పైగా ఇలాంటి లక్షణాలు కొనసాగుతూ రావటాన్ని లాంగ్‌ కొవిడ్‌గా పరిగణిస్తుంటారు

Published : 17 Oct 2023 00:25 IST

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ తగ్గినా కొందరికి దగ్గు, కడుపునొప్పి, విరేచనాల వంటివి విడవకుండా వేధించటం తెలిసిందే. నాలుగు వారాలకు పైగా ఇలాంటి లక్షణాలు కొనసాగుతూ రావటాన్ని లాంగ్‌ కొవిడ్‌గా పరిగణిస్తుంటారు. దీనికి ప్రత్యేక చికిత్సలూ అందించటం చూస్తున్నాం. లాంగ్‌ కొవిడ్‌కు ప్రధానంగా కొవిడ్‌-19 తీవ్రత కారణమవుతుంటుంది. అయితే ఒక్క కొవిడే కాదు.. జలుబు, ఇన్‌ఫ్లూయెంజా వంటి సమస్యలూ దీర్ఘకాలం ప్రభావం చూపొచ్చని తాజా అధ్యయనంలో బయటపడింది. దీన్ని లాంగ్‌ కోల్డ్‌గా భావిస్తున్నారు. పరిశోధకులు 10వేల మందిని ఎంచుకొని దీర్ఘ కొవిడ్‌తో ముడిపడిన 16 వేర్వేరు లక్షణాల గురించి ఆరా తీశారు. వాళ్లు కొవిడ్‌-19 ఇన్‌పెక్షన్‌తో బాధపడ్డారా? ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డారా? ఇవేవీ రాలేదా? అని ప్రశ్నించారు. ఈ సమస్యలేవీ రానివారితో పోలిస్తే కొవిడ్‌ బాధితుల్లోనూ, కొవిడ్‌ పరీక్ష నెగెటివ్‌గా ఉండి ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డవారిలోనూ దీర్ఘకాల ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కాకపోతే లక్షణాల్లో కాస్త తేడా కనిపించింది. కొవిడ్‌ నుంచి కోలుకుంటన్నవారిలో రుచి, వాసన పోవటం, తల తేలిపోతున్నట్టు అనిపించటం, జుట్టు ఊడటం, అతిగా చెమట పోయటం, గుండె వేగం పెరగటం, జ్ఞాపకశక్తి సమస్యలు మరింత ఎక్కువగా, తీవ్రంగా ఉంటున్నట్టు తేలింది. మొత్తమ్మీద కొవిడ్‌, కొవిడ్‌ రహిత ఇతర ఇన్‌ఫెక్షన్లూ వివిధ రకాల లక్షణాలకు కారణమవుతున్నట్టు గుర్తించారు. కొందరిలో ఇవి నాలుగు వారాలకు పైగా కొనసాగుతూ వస్తున్నట్టు కనుగొన్నారు. నిజానికి జలుబు ఒకట్రెండు వారాల్లోనే తగ్గిపోతుంది. మరి దీని ఇబ్బందులు దీర్ఘకాలం కొనసాగటానికి కారణమేంటి? ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కొనే క్రమంలో మన రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపించిన వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌ తగ్గినా వాపు స్పందన అలాగే కొనసాగుతూ రావటం వల్ల దగ్గు, నిస్సత్తువ వంటివి ఎక్కువ కాలం వేధించే అవకాశముంది. వీటిపై అవగాహన లేకపోవటం వల్ల చాలామందిలో గుర్తించలేకపోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘ కొవిడ్‌తో ముడిపడినవే కాదు, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల దీర్ఘకాల ప్రభావాల మీదా తమ అధ్యయనం కొత్త విషయాలను వెలువరించిందని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని