మతిమరుపు అసలా? నకలా?

జ్ఞాపకశక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, దారి తప్పటం, సరిగా ఆలోచించలేకపోవటం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది తీవ్ర మతిమరుపు సమస్య (డిమెన్షియా). అయితే కొన్నిసార్లు ఇవి నకిలీ మతిమరుపు (సూడోడిమెన్షియా) సంకేతాలూ కావొచ్చు.

Published : 17 Oct 2023 00:46 IST

జ్ఞాపకశక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, దారి తప్పటం, సరిగా ఆలోచించలేకపోవటం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా గుర్తుకొచ్చేది తీవ్ర మతిమరుపు సమస్య (డిమెన్షియా). అయితే కొన్నిసార్లు ఇవి నకిలీ మతిమరుపు (సూడోడిమెన్షియా) సంకేతాలూ కావొచ్చు. డిమెన్షియా అనేది నాడీ సమస్య. మెదడులో ప్రొటీన్‌ పోగుపడటం, మెదడు క్షీణించటంతో వస్తుంది. అదే సూడోడిమెన్షియా మానసిక సమస్య. డిమెన్షియా చాలావరకు పెద్దవయసులో తలెత్తుతుంది. నకిలీ డిమెన్షియా చిన్న వయసులోనూ కనిపించొచ్చు. దీనికి కుంగుబాటు (డిప్రెషన్‌) వంటి ఇతరత్రా సమస్యలు దోహదం చేస్తుంటాయి. కుంగుబాటుతో బాధపడుతున్నా ఎంతోమందికి ఆ విషయమే తెలియదు. క్రమంగా మతిమరుపు లక్షణాలూ మొదలవుతుంటాయి. వీటితోనే కొందరు డాక్టర్లను సంప్రదిస్తుంటారు. ‘నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. నాకు కుంగుబాటేంటి?’ అని కొందరు భావిస్తుంటారు. మెదడులోని నాడీ సమాచార వాహికలూ ఇందులో పాలు పంచుకుంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఆఫీసు-ఇంటి వ్యవహారాల మధ్య సమతుల్యత లోపించటం, మానసిక ఒత్తిడి వంటి ప్రేరకాలూ కుంగుబాటుకు దారితీయొచ్చు. ఇది క్రమంగా సూడోడిమెన్షియాగా పరిణమించొచ్చు. అప్పటికే మానసిక సమస్యలతో బాధపడేవారికి.. మాదక ద్రవ్యాలు, మద్యం వ్యసనాలు గలవారికి దీని ముప్పు మరింత ఎక్కువ. కుంగుబాటుతో.. ముఖ్యంగా వయసు మీద పడ్డవారిలో విషయ పరిగ్రహణ సామర్థ్యాలు కుంటుపడతాయి. తక్షణ విషయాలు గుర్తుండకపోవటం, హఠాత్తుగా దిక్కులు తెలియకపోవటం, ఏకాగ్రత లోపించటం వంటి డిమెన్షియా మాదిరి లక్షణాలే ఇందులోనూ కనిపిస్తుంటాయి. పైపైన లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ ఆయా విషయాలను లోతుగా పరిశీలిస్తే అసలు కారణం బయటపడుతుంది. కుంగుబాటుతో బాధపడేవారిలో ప్రతికూల ఆలోచనలు, నలుగురితో కలవటానికి ఇష్టపడకపోవటం, సరిగా తినకపోవటం, నిద్ర పట్టకపోవటం వంటివి కూడా ఉంటాయి. మరచిపోతున్నామనే విషయమూ తెలుస్తుంటుంది. డిమెన్షియా గలవారికి మరచిపోతున్న సంగతే తెలియదు. వీరిలో మూడ్‌, మానసిక సమస్యలేవీ ఉండవు. సూడోడిమెన్షియా క్రమంగా ముదురుతూ వచ్చే సమస్య కాదు. ఇందులో మెదడేమీ క్షీణించదు. కాబట్టి దీన్ని కొన్ని పరీక్షలతో గుర్తించొచ్చు. ఎవరిలోనైనా డిమెన్షియా అసలుదో, నకిలీదో గుర్తించలేని పరిస్థితి తలెత్తితే ఎంఆర్‌ఐ పరీక్ష ఉపయోగపడుతుంది. మెదడులో ప్రొటీన్లు పోగుపడటం, మెదడు క్షీణించటం వంటి మార్పులేవీ లేకపోతే సూడోడిమెన్షియాగా భావించొచ్చు. దీనికి యాంటీడిప్రెసెంట్‌ మందులతో మంచి ఫలితం కనిపిస్తుంది. వీటితో కుంగుబాటు, అలాగే మతిమరుపూ తగ్గుతుంది. కొందరికి కౌన్సెలింగ్‌, ప్రవర్తనను మార్చే చికిత్స, ఏకాగ్రతను మెరుగుపరచే పద్ధతులు సైతం అవసరమవ్వచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని