పార్కిన్సన్స్‌కు పరీక్ష

చేతులు, తల వణుకుతో ఇబ్బందిపెట్టే పార్కిన్సన్స్‌ జబ్బును నిర్ధరించటం కష్టం. ఇప్పటివరకు దీనికి ప్రత్యేకమైన పరీక్షేదీ లేదు. చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తిస్తుంటారు

Published : 05 Dec 2023 01:15 IST

చేతులు, తల వణుకుతో ఇబ్బందిపెట్టే పార్కిన్సన్స్‌ జబ్బును నిర్ధరించటం కష్టం. ఇప్పటివరకు దీనికి ప్రత్యేకమైన పరీక్షేదీ లేదు. చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తిస్తుంటారు. అయితే తొలిదశలో కనిపించే మలబద్ధకం, కుంగుబాటు, నిద్ర పట్టకపోవటం వంటి లక్షణాలు ఇతరత్రా జబ్బులతోనూ ముడిపడి ఉంటాయి. దీంతో పార్కిన్సన్స్‌ను పోల్చుకోవటం ఆలస్యమైపోతుంది. తల, చేతులు వణకటం.. బిగుసుకుపోవటం మొదలయ్యేసరికే సమస్య తీవ్రమై కూర్చుంటుంది. అందుకే దీన్ని తొలిదశలో, లక్షణాలు ఆరంభం కావటానికి ముందే గుర్తించటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించిన ‘అల్ఫా-సైన్యూక్లీన్‌ సీడ్‌ ఆంప్లికేషన్‌ అస్సే’ అనే పరీక్ష కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మెదడులో, నాడీ వ్యవస్థలో అల్ఫా-సైన్యూక్లీన్‌ ప్రోటీన్లు పోగుపడటం పార్కిన్సన్స్‌ జబ్బుకు దారితీస్తుంది. వణుకు, కదలికలు నెమ్మదించటం, కండరాలు బిగుసుకుపోవటం వంటి శారీరక లక్షణాలు ఆరంభం కావటానికి చాలా ఏళ్ల ముందుగానే ఈ ప్రోటీన్లు పోగుపడుతూ వస్తాయని భావిస్తుంటారు. కొత్త పరీక్షకు ఇవే ఆధారం. ఇది వెన్నుద్రవంలోని అల్ఫా-సైన్యూక్లీన్‌ ప్రోటీన్ల మోతాదులను పట్టి చూపుతుంది. దీంతో పార్కిన్సన్స్‌ జబ్బును 88% వరకు కచ్చితంగా గుర్తించే వీలుండటం గమనార్హం. అంతేకాదు.. తొలిదశలోనే జబ్బును గుర్తించటానికి, ఈ జబ్బు ముప్పును తెలుసుకోవటానికి కూడా కొత్త పరీక్ష ఉపయోగపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు