రక్షణ కట్టుదిట్టం!

మనం రోజూ తినటం, నడవటం, పడుకోవటం, ఉద్యోగాలు.. ఇలా ఎన్నో పనులు చేస్తుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు. శరీరం లోపల జరిగే ‘యుద్ధాలు’ ఒక ఎత్తు. ఇవేవీ మనకు తెలియవు.

Updated : 10 Jan 2023 04:35 IST

మనం రోజూ తినటం, నడవటం, పడుకోవటం, ఉద్యోగాలు.. ఇలా ఎన్నో పనులు చేస్తుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు. శరీరం లోపల జరిగే ‘యుద్ధాలు’ ఒక ఎత్తు. ఇవేవీ మనకు తెలియవు. కానీ బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర సూక్ష్మక్రిములు నిరంతం మనలోకి చొరపడటానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. వీటిని ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ పోరాడుతూనే ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవటం తప్పనిసరి.

మన రోగనిరోధక వ్యవస్థ కథ పెద్దదే. ఇది కోట్లాది కణాల, ప్రొటీన్ల సమ్మేళనం. ఇవి రక్తంలో, శరీరంలోని ప్రతి అవయవంలో ఉంటాయి. ఆయా సమయాలకు అనుగుణంగా.. ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే రోగనిరోధక వ్యవస్థ మారుతూ, తర్ఫీదు పొందుతూ వస్తుంది. శిశువులకు తొలి ఆర్నెల్లలో ఇన్‌ఫెక్షన్లు, తీవ్ర జబ్బుల ముప్పు ఎక్కువ. ఎందుకంటే బిడ్డ రోగనిరోధకశక్తి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ వస్తుంటుంది. పుట్టకముందు తల్లి నుంచి లభించే యాంటీబాడీలు కొద్ది నెలల వరకు ఉంటాయి. బిడ్డ రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందేంతవరకివి రక్షణ కల్పిస్తూ వస్తాయి.

దశదశలుగా..

సహజ (ఇన్నేట్‌) రోగనిరోధక వ్యవస్థ కణాలు ప్రమాదకర పరిస్థితికి ముందుగా స్పందిస్తాయి. ఇవి శరీరమంతా కలియ తిరుగుతూ హానికర సంకేతాలను లేదా ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను గుర్తిస్తాయి. తర్వాత వాటిని నాశనం చేస్తాయి. సహజ రోగనిరోధక వ్యవస్థ నుంచి వచ్చే సంకేతాలు, ఇన్‌ఫెక్షన్‌ కారక సూక్ష్మక్రిములతో ప్రేరేపితమయ్యేది సంతరిత (అడాప్టివ్‌) రోగనిరోధక వ్యవస్థ. ఇది బలమైన ప్రతిస్పందనను కలగజేస్తుంది. దీనికి సంబంధించిన కణాలు చాలాకాలం పాటు రోగ కారక క్రిములను గుర్తుపెట్టుకొని, వాటితో పోరాడతాయి. ఇవి టీకాలకూ ప్రతిస్పందిస్తాయి. అన్నిరకాల యాంటీబాడీలను తయారుచేస్తాయి. యాంటీబాడీల మాదిరిగానే కొన్ని సంతరింత రోగనిరోధక కణాలు కూడా తల్లి నుంచి పిండానికి సంక్రమిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి గతంలో తల్లి మీద దాడిచేసిన సూక్ష్మక్రిములను ఎదుర్కోవటంపై గర్భస్థ శిశువులో రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి కూడా. శైశవ, బాల్య దశల్లో రోగనిరోధక వ్యవస్థ పరిపక్వం చెందుతూ.. సొంతంగా కణాలను తయారుచేసుకుంటూ వస్తుంది.

టీకాల సాయంతో

పెద్దగా అయ్యేసరికి మనం రకరకాల సూక్ష్మక్రిముల బారిన పడతాం. అందువల్ల ఆయా ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం ముఖ్యం. టీకాలు కూడా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. చనిపోయిన లేదా బలహీన పరిచిన సూక్ష్మక్రిములు లేదూ వాటి భాగాలతో టీకాలను తయారుచేస్తారు. ఇవి హానికర సూక్ష్మక్రిములను ఎలా ఎదుర్కోవాలో నిరోధక వ్యవస్థకు తర్ఫీదు ఇస్తాయి. జబ్బులను కలగ జేయకుండానే వాటిని గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. గర్భిణులు తీసుకునే టీకాలు శిశువుకూ తొలినాళ్లలో ప్రాణాంతక జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. పుట్టిన వెంటనే వేసే టీకాలూ మేలు చేస్తాయి. కొన్ని టీకాలకు పెద్దయ్యాక బూస్టర్‌ మోతాదు సైతం అవసరమవుతుంది. ఇవి ఆయా క్రిములను మరింత ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవటానికి వీలు కల్పిస్తాయి. ఆరోగ్య స్థితి, చేసే పని వంటి వాటిని బట్టి కొందరు అదనపు టీకాలూ తీసుకోవాల్సి ఉంటుంది.

వయసుతో పాటు క్షీణత

ఇతర వ్యవస్థల మాదిరిగానే వయసు మీద పడుతున్నకొద్దీ రోగనిరోధక వ్యవస్థా క్షీణిస్తూ వస్తుంది. నిరోధక కణాల పనితీరు, సామర్థ్యం తగ్గుతుంది. పైగా వయసుతో పాటు గుండె, ఊపిరితిత్తుల వంటి శరీర భాగాలూ క్షీణిస్తూ వస్తాయి. ఇవన్నీ ఇన్‌ఫెక్షన్లతో తీవ్ర జబ్బులు తలెత్తేలా చేస్తాయి. వృద్ధుల్లో అవయవాలకు, కణజాలానికి కొద్దిపాటి హాని కలిగినా సక్రమంగా పనిచేయవు. అందువల్ల 50 ఏళ్లు పైబడినవారు కొన్ని టీకాలు తీసుకోవటం తప్పనిసరి.

కొంగొత్త పరిశోధనలు

రోగనిరోధక ప్రతిస్పందనను, టీకాలను మెరుగుదిద్దే విధానాన్ని పరిశోధకులు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. కొన్ని సూక్ష్మక్రిములు రోగనిరోధక వ్యవస్థ కంటబడకుండా తెలివిగా తప్పించుకుంటాయి. జన్యుపరంగా మార్చుకోవటం ద్వారా తమను నిరోధక కణాలు గుర్తించకుండా కాపాడుకుంటాయి. దీన్ని అధిగమించటానికి శాస్త్రవేత్తలు శరీరం ప్రతిస్పందించే తీరుపైనే.. ముఖ్యంగా సంతరింత రోగనిరోధక వ్యవస్థలో భాగమైన జెర్మినల్‌ కేంద్రాలపై దృష్టి సారించారు. ఈ కేంద్రాలు లింఫ్‌ గ్రంథుల్లో ఉంటాయి. రోగనిరోధక కణాలు ఇక్కడికి వెళ్లే మరింత సమర్థమైన యాంటీబాడీలను సృష్టించటం నేర్చుకుంటాయి మరి. ఇన్‌ఫెక్షన్లు, టీకాల ప్రతిస్పందనలో భాగంగా లింఫ్‌గ్రంథుల్లో ఈ జెర్మినల్‌ కేంద్రాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో ఉన్న క్రిములను ఎదుర్కొనే యాంటీబాడీలనే కాదు.. ఇంకా మనపై దాడిచేయని రకాలను తుదముట్టించే యాంటీబాడీలనూ పుట్టిస్తాయి! వైరస్‌ మున్ముందు ఎలా మారగలదో కూడా జెర్మినల్‌ కేంద్రాల్లోని కణాలు అంచనా వేయగలవు! అందుకే వీటిని నిరోధక వ్యవస్థలో అద్భుతమైన భాగాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉదాహరణకు- ఇప్పుడు మనం వేసుకుంటున్న కొవిడ్‌ టీకాలనే తీసుకోండి. ఇవి అసలు వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలను పుట్టించటమే కాదు.. వైరస్‌ ఇతర రకాల నుంచీ రక్షణ కల్పిస్తున్నాయి. ఇతర రకాలను ఎదుర్కొనే యాంటీబాడీలు జెర్మినల్‌ కేంద్రాల నుంచే పుట్టుకొస్తుండటం విశేషం. ఈ కేంద్రాలు ఒంట్లో ఆరు నెలల వరకు ఉంటాయి. ఆయా యాంటీబాడీల రకాలను బట్టి ఇంకా ఎక్కువకాలమే ఉండొచ్చు. అందుకే జెర్మినల్‌ కేంద్రాలను ఇంకా ఎక్కువకాలం మనగలిగేలా చేసే టీకాలను తయారు చేయాలనీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ప్రయోగాత్మక హెచ్‌ఐవీ టీకాను జంతువులపై పరీక్షించారు కూడా. ఒకేసారి పెద్ద మోతాదులో టీకా ఇచ్చినప్పటి కన్నా తక్కువ తక్కువ మోతాదులో ఎక్కువసార్లు టీకా ఇవ్వగా వైవిధ్యమైన యాంటీబాడీలు పుట్టుకురావటమే కాదు.. అవి ఎక్కువకాలమూ ఉండటం గమనార్హం. జబ్బుల నుంచి కాపాడటానికి శాస్త్రవేత్తలు ఒకవైపు కొత్త మార్గాలను కనుగొనే పనిలో ఉన్నప్పటికీ.. మన రక్షణ వ్యవస్థ సక్రమంగా, సమర్థంగా పనిచేయటానికి అందుబాటులో ఉన్న టీకాలను క్రమం తప్పకుండా తీసుకోవటం, మంచి జీవనశైలిని పాటించటం ఎంతైనా అవసరం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని