యాసిడ్‌తో చర్మం కాలుతుందేం?

శరీరంపై యాసిడ్‌(ఆమ్లం) పడితే చర్మం కాలుతుంది. ఎందుకని?

Published : 07 Mar 2020 00:16 IST

ప్రశ్న: శరీరంపై యాసిడ్‌(ఆమ్లం) పడితే చర్మం కాలుతుంది. ఎందుకని?

- ఎ పద్మావతి, 9వ తరగతి, శ్రీసర్వోదయ స్కూలు, ఖండవల్లి

దాదాపు అన్ని ఇనార్గానిక్‌ ఆమ్లాలు ప్రమాదకరమైనవే. ఎందుకంటే వాటిని నిర్జీవ పదార్థాల నుంచి తయారు చేస్తారు.

హైడ్రోక్లోరికామ్లం, సల్ఫ్యూరికామ్లం, నత్రికామ్లంలు ఈ కోవకు చెందినవే. ఆర్గానిక్‌ ఆమ్లాలైన ఎసిటికామ్లం, సిట్రికామ్లం వంటివి సహజంగా లభిస్తాయి. ఇవి బలహీనమైన ఆమ్లాలు.

ప్రమాదకరమైన ఆమ్లం శరీర చర్మంపై పడగానే అది శరీర చర్మం దగ్గర ఉన్న కణాల్లోని నీటిని పీల్చుకుంటుంది. ఈ ప్రక్రియలో బోలెడంత ఉష్ణం విడుదల అవుతుంది. ఈ ఉష్ణం చర్మం దగ్గరున్న అనేక జీవకణాలను చంపేస్తుంది. దీంతో చర్మం కాలుతుంది.

పరిశ్రమల్లో ఆమ్లాలతో పనిచేసే వారు ప్రత్యేకమైన దుస్తులు, మాస్కులు ధరిస్తారు. ప్రయోగశాలల్లో ఆమ్లాలతో ప్రయోగాలు చేసే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొర పాటున ఆమ్లం చేతిపై పడితే ఆ ప్రదేశాన్ని నీటితో దాదాపు 5 నిమిషాలు కడుక్కోవాలి. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని సోడా ద్రావణంతో కూడా కడుక్కోవాలి.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని