Published : 14 Nov 2021 01:18 IST

బంగారం కాని బంగారం!

హాయ్‌.. నేస్తాలూ!.. మిమ్మల్ని అప్పుడప్పుడు ఇంట్లోవాళ్లు ‘మా బంగారు కన్నా.. మా బుజ్జి కన్నా..’ అని అంటుంటారు కదా.. అలాగే నన్ను కూడా బంగారం అంటారు.. కానీ నేను బంగారాన్ని కాదు. కానీ నేను మాత్రం అచ్చం బంగారం రంగులోనే ఉంటా.. బంగారంలానే మెరుస్తా.. అయినప్పటికీ బంగారాన్ని మాత్రం కాదు.. ఇంతకీ నేనెవరు? నా పేరేంటో తెలుసా..!

పైరైట్‌... ఇది నా పేరు. ఐరన్‌ పైరైట్‌ అనీ అంటారు. ‘ఫూల్స్‌ గోల్డ్‌’ అని ముద్దుగా పిలుస్తారు. నేను సల్ఫర్‌, ఐరన్‌ల మిశ్రమాన్ని. మరో విషయం ఏంటంటే ఏదైనా లోహంతో నేను రాపిడికి గురైతే నిప్పురవ్వలు కూడా వస్తాయి. అందుకే నన్ను ఒకప్పుడు ఫ్లింట్‌లాక్‌ తుపాకుల్లో స్పార్క్‌ ఉత్పత్తి చేసే పదార్థంగా వాడేవారు. గతంలో నన్ను స్పెయిన్‌ ఎక్కువగా ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఇటలీ, చైనాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. రష్యా, పెరూలో కూడా నేను ఎక్కువగానే లభ్యమవుతున్నాను.

నేనున్న చోటే బంగారమూ..!

నేను నిజమైన బంగారాన్ని కాకపోయినా.. నేనున్న చోటే చాలాసార్లు నిజమైన బంగారు నిల్వలనూ పరిశోధకులు గుర్తించారు. మరో విషయం ఏంటంటే.. అప్పుడప్పుడూ నాలో సల్ఫర్‌, ఐరన్‌తో పాటు బంగారమూ ఉంటుంది. నేను ఈ భూమి మీద దాదాపు ప్రతి చోటా ఉంటాను. ఒకప్పుడు నన్ను సల్ఫ్యూరిక్‌ ఆమ్లం తయారీలో ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో ఈ ఆమ్లం లభిస్తోంది.  

నేను రత్నంగానూ..

ప్రాచీన కాలంలో నన్ను రత్నంగానూ ఉపయోగించారు. కానీ నాలో నాణ్యత చాలా తక్కువ. అందుకే నేను త్వరగా పాడైపోయేదాన్ని. మొత్తానికి ఇవి నేస్తాలూ.. బంగారం కాని బంగారమైన నా విశేషాలు. ఇక ఉంటామరి. బై..బై!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు