పిసినారి సొమ్ము

ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి.. అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టుకోవడమే ఇష్టం లేనివాడు ఉండేవాడు. ఇతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణేలను ఆ తోటలో రాళ్లకింద గుంతలో దాచేవాడు. దానిపైన రాళ్లు పెట్టేవాడు.

Published : 07 Jul 2020 00:19 IST

ఒక పల్లెలో ఒక ముసలి పిసినారి.. అంటే డబ్బు దాచుకోవడం తప్ప ఖర్చు పెట్టుకోవడమే ఇష్టం లేనివాడు ఉండేవాడు. ఇతని ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. తన దగ్గరున్న బంగారు నాణేలను ఆ తోటలో రాళ్లకింద గుంతలో దాచేవాడు. దానిపైన రాళ్లు పెట్టేవాడు. రోజూ నిద్రబోయే ముందు ఒకసారి రహస్యంగా ఆ బంగారు నాణేలను లెక్కబెట్టుకుని మళ్లీ అక్కడే దాచిపెట్టేవాడు.
ఒక రోజు ఈ పిసినారి రోజువారీ పనులను రహస్యంగా గమనిస్తున్న ఓ దొంగ కాపుకాశాడు. రోజులాగే బంగారు నాణేలు లెక్కబెట్టి లోపల దాచే వరకు చెట్టుపైన నిశ్శబ్దంగా ఉన్నాడు. అతను లోపలికి వెళ్లాక, గప్‌చుప్‌గా నాణేలు దొంగిలించాడు. మర్నాడు ముసలివాడు చూసుకుని గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు.
ఇంటి పక్కవాళ్లు వచ్చి ఏమి జరిగిందని అడిగి తెలుసుకున్నారు. విషయం విన్న తర్వాత.. ‘ఎవరైనా ఇంట్లో జాగ్రత్తగా సొమ్ము దాచుకుంటారు. నువ్వేమిటి ఇలా బయట పెరట్లో, అది కూడా భూమిలో పెట్టుకున్నావు. ఇందులో నీ తప్పూ ఉంది. అసలు నేలలో పాతిపెడితే నీకు ఎలా ఉపయోగపడుతుంది’ అని అన్నారు.
దానికి ఆ పిసినారి.. ‘ఉపయోగపడటమా? నేను అసలు ఆ బంగారం వాడనే వాడను. అది దాచుకోవడానికి మాత్రమే’ అన్నాడు. అది విన్న ఒక వ్యక్తి ఒక రాయిని ఆ గుంతలోకి విసిరాడు. ‘అలా అయితే. ఆ రాయే నీ సొమ్మనుకో! నువ్వు ఉపయోగించుకోనప్పుడు దానికి విలువేముంది? రాయైనా.. బంగారమైనా.. ఒకటేగా. నువ్వు వాడనప్పుడు రెండూ విలువలేనివే’అంటూ వెళ్లిపోయాడు.
పిసినారి మాత్రం ‘లబోదిబో’మంటూ ఏడుస్తూనే ఉండిపోయాడు. మిగతావారు కూడా ఎటువారు అటు వెళ్లిపోయారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని