ఆకాశంలో ‘ఆహా’రం!

హాయ్‌ నేస్తాలూ...! ఆకాశంలో వేలాడుతూ లంచ్‌ చేస్తే ఎలా ఉంటుంది.

Published : 05 Dec 2022 01:03 IST

హాయ్‌ నేస్తాలూ...! ఆకాశంలో వేలాడుతూ లంచ్‌ చేస్తే ఎలా ఉంటుంది. గాల్లో తేలియాడుతూ డిన్నర్‌ చేస్తే ఇంకెలా ఉంటుంది. ఊహాలోకంలోనే ఇవన్నీ సాధ్యం. నిజంగా అసాధ్యం.. అంటారేమో.. కానీ సాధ్యమే! అలాంటి ఓ రెస్టరెంట్‌ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్‌. అది ఎక్కడో విదేశాల్లో ఉందనుకునేరు. మన దేశంలోనే ఉంది. మరి దాని విశేషాలు తెలుసుకుందామా!

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది.. దేశంలోనే మొట్టమొదటి ఈ ‘ఫ్లై డైనింగ్‌’ రెస్టరెంట్‌. ఇక్కడ మనం భూమి నుంచి 160 అడుగుల ఎత్తులో ఉండి ఎంచక్కా భోజనం చేయవచ్చు. అంటే ఓ రకంగా ఇది కేవలం రెస్టరెంట్‌ మాత్రమే కాదు.. సాహస కృత్యాల వేదిక కూడా అన్నమాట!

వీక్షిస్తూ.. భక్షిస్తూ..

ఫ్లై డైనింగ్‌లో ఒకసారికి కేవలం 22 మంది మాత్రమే భోజనం చేయగలరు. ఎందుకంటే అక్కడ ఒకే ఒక టేబుల్‌, దాని చుట్టూ 22 సీట్లుంటాయి మరి. ఈ టేబుల్‌ను హైడ్రాలిక్‌ క్రేన్‌ సాయంతో భూమి నుంచి 160 అడుగుల ఎత్తుకు తీసుకువెళతారు. ఇక్కడ నుంచి చూస్తే పక్కనే ఉన్న చెరువు, సిటీ వ్యూ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఓ రకంగా పక్షులు ఎగిరేంత ఎత్తులో ఉండి మనం ఇవన్నీ వీక్షిస్తూ.. రుచికరమైన ఆహారమూ తీసుకోవచ్చు.

‘ఫర్లేదు.. భయం లేదు...’

అమ్మో.. అంత ఎత్తు నుంచి పడిపోతే ఇంకేమైనా ఉందా.. అనే భయం మీకు కలుగుతుంది కదూ! కానీ అతిథులను పైకి తీసుకెళ్లడానికి ముందే చాలా రక్షణ చర్యలు తీసుకుంటారు ఈ రెస్టరెంట్‌ వాళ్లు. కుర్చీలకు సేఫ్టీ బెల్ట్‌ ఉంటుంది. ఇవి అతిథులను పడిపోకుండా కాపాడతాయి. వీళ్ల రక్షణ చర్యలకు ‘జర్మన్‌ థీమ్‌ ఆఫ్‌ ఎక్స్‌పర్ట్స్‌’ కూడా సర్టిఫికెట్‌ ఇచ్చారట.

ఆహారానికి కూడా రక్షణ...

కేవలం అతిథులకే కాకుండా.. వాళ్లు తినే ఆహారానికి కూడా ఈ రెస్టరెంట్‌ వాళ్లు రక్షణ ఏర్పాటు చేశారు. అదేంటంటే డైనింగ్‌ టేబుల్‌ మీద ప్రత్యేకంగా తయారైన మ్యాట్లను వాడతారు. ఇవి గ్లాసులు, పాత్రలను ఒడిసిపట్టేలా డిజైన్‌ చేశారు. ఈ మ్యాట్లు ఆహారం ఒలికిపోకుండా కాపాడతాయి. వీటి మీద పెట్టిన స్పూన్లు కూడా అంత తేలిగ్గా జారిపోవట!

ప్రత్యేక శ్రద్ధ...

అతిథులకు వడ్డించే ఆహారం తయారు చేయడానికి డైనింగ్‌ టేబుల్‌ మధ్యలోనే వంటకు ఏర్పాట్లుంటాయి. రక్షణలో భాగంగా అక్కడ మంటలొచ్చే స్టౌవ్‌లు వాడరు. కేవలం ఇండక్షన్‌ పొయ్యిలు మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడే వండి వేడివేడిగా వడ్డిస్తారు. 160 అడుగుల ఎత్తులో ఆహారం తొందరగా తన వేడిని కోల్పోతుంది. ఈ అంశాన్నీ వాళ్లు పరిగణనలోకి తీసుకుని అతిథులకు ఏ ఇబ్బందీ రాకుండా చూసుకుంటారు. ఈ రెస్టరెంట్‌ బెంగళూరులో 2018లో ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో మరి కొన్ని నగరాల్లోనూ ఇలాంటి రెస్టరెంట్లు అందుబాటులోకి వచ్చాయి. నేస్తాలూ...! మొత్తానికి ఇవీ ‘ఫ్లై డైనింగ్‌’ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని