తియ్యతియ్యటి ఛెనా పోడా

ఒడిశా వాసుల వంటల్లో ‘ఛెనా పోడా’ ప్రత్యేకమైంది. తాజా పనీర్‌తో తయారయ్యే ఈ వంటకం ఎంత ఆరోగ్యకరమో అంత రుచిగానూ ఉంటుంది.

Updated : 26 Nov 2023 03:30 IST

ఒడిశా వాసుల వంటల్లో ‘ఛెనా పోడా’ ప్రత్యేకమైంది. తాజా పనీర్‌తో తయారయ్యే ఈ వంటకం ఎంత ఆరోగ్యకరమో అంత రుచిగానూ ఉంటుంది. ఎలా చేయాలంటే.. ముందుగా బేకింగ్‌ ప్యాన్‌లో బటర్‌ పేపర్‌ వేసి.. నెయ్యి రాయాలి. లేకుంటే.. ప్యాన్‌ అంచులకు నెయ్యి రాయొచ్చు. అవెన్‌ను 180 డిగ్రీల ఉష్ణోగ్రతతో 15 నిమిషాలు ప్రీహీట్‌ చేయాలి. పావుకిలో పనీర్‌ తీసుకుని.. చిదిమి పొడిచేయాలి. అందులో అర కప్పు పంచదార నెయ్యి వేసి.. చపాతీపిండిలా కలపాలి. పిండి ఎంత మెత్తగా కలిపితే.. ఛెనా పోడా అంత రుచిగా వస్తుందన్నమాట. పిండి పొడిగా ఉందనుకుంటే కొన్ని పాలు పోయొచ్చు. అందులో అర చెంచా యాలకుల పొడి, కాస్త బియ్యప్పిండి, చిటికెడు వంట సోడా, పిస్తా, బాదం, కిస్‌మిస్‌, జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా కలపాలి. బియ్యప్పిండి బదులు ఉప్మారవ్వ కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాన్‌లో వేసి కొంచెం కదిలిస్తే సమంగా పరచుకుంటుంది. దీన్ని 30 నుంచి 45 నిమిషాలు అవెన్‌లో బేక్‌ చేయాలి. చల్లారాక ప్యాన్‌లోంచి తీసేసి.. ముక్కలుగా కట్‌ చేస్తే సరి.. బంగారు రంగులో కేక్‌లా రుచిగా ఉండే ఛెనా పోడా రెడీ. ఇది భోజనం అయ్యాక డిజర్ట్‌లా లేదా స్వీట్‌ స్నాక్‌లా ఎంతో బాగుంటుంది. మూడు రోజుల పాటు నిలవుండే ఈ వంటకం మంచి పోషకాహారం కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని