ఈస్టర్‌ రోజున హాట్‌ క్రాస్‌ బన్స్‌!

ఈరోజు ఈస్టర్‌ సండే.  పండుగ కనుక ప్రార్థనలు మిన్నంటుతాయి. అవయ్యాక బంధుమిత్రులతో విందులూ వినోదాలుంటాయి. ఈ ప్రత్యేకమైన రోజున మరింత ప్రత్యేకంగా ఉండే ఈ రెసిపీలు ప్రయత్నించి చూడండి!

Published : 31 Mar 2024 00:37 IST

ఈరోజు ఈస్టర్‌ సండే.  పండుగ కనుక ప్రార్థనలు మిన్నంటుతాయి. అవయ్యాక బంధుమిత్రులతో విందులూ వినోదాలుంటాయి. ఈ ప్రత్యేకమైన రోజున మరింత ప్రత్యేకంగా ఉండే ఈ రెసిపీలు ప్రయత్నించి చూడండి!


 ఈస్టర్‌ ఎగ్స్‌

కావలసినవి: జీడిపప్పు - అర కిలో, పంచదార పొడి - 600 గ్రాములు, రోజ్‌ వాటర్‌ - పావు కప్పు, ఫుడ్‌ జెల్‌ కలర్స్‌ - కొద్దిగా, ఆలివ్‌ నూనె - తగినంత
ఐసింగ్‌ కోసం: పంచదార పొడి - కాస్త, చిక్కటి పాలు - 4 టేబుల్‌ స్పూన్లు, రోజ్‌ ఎసెన్స్‌ - 2 చుక్కలు, నిమ్మరసం - అర చెంచా
తయారీ: జీడిపప్పును వీలైనంత మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఒక పాత్రలో పంచదార పొడి, జీడిపప్పు పొడి, రోజ్‌ వాటర్‌ వేసి మెత్తగా అయ్యేలా మళ్లీ మళ్లీ కలపాలి. మూత పెట్టేసి ఒక అరగంట పక్కనుంచాలి. పిండిని మీ వద్ద ఎన్ని రకాల ఫుడ్‌ కలర్స్‌ ఉన్నాయో అన్ని భాగాలుగా చేయాలి. ఒక్కో భాగం నుంచి గుడ్డు అంత పరిమాణం తీసుకుని.. ఎగ్‌ మౌల్డ్‌లో ఉంచి, చేత్తో మెదుపుతూ సరిచేయాలి. దాన్ని తీసి బేకింగ్‌ ట్రేలో ఉంచాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. ఇప్పుడు ఐసింగ్‌ కోసం పంచదార పొడి, చిక్కటి పాలు, నిమ్మరసం, రోజ్‌ ఎసెన్స్‌లను కలిపి.. పైపింగ్‌ బ్యాగ్‌లో వేసి.. ఎగ్స్‌ మీద నచ్చిన ఆకృతులను గీయాలి. అంతే.. రంగురంగుల ఈస్టర్‌ ఎగ్స్‌ రెడీ! కావాలంటే ఎడిబుల్‌ స్ప్రింకిల్స్‌ను అద్దవచ్చు.


హాట్‌ క్రాస్‌ బన్స్‌

కావలసినవి: మైదాపిండి - మూడున్నర కప్పులు, చాలా వేడిగా ఉన్న చిక్కటి పాలు - ముప్పావు కప్పు, వెన్న - పావు కప్పు, పంచదార పొడి - అర కప్పు, దాల్చినచెక్క పొడి - అర చెంచా, గుడ్లు - 2, కిస్‌మిస్‌ - ముప్పావు కప్పు, ఉప్పు - అర చెంచా, జాజికాయ పొడి - చిటికెడు, యీస్ట్‌ - ముప్పావు టేబుల్‌ స్పూన్‌
తయారీ: చిన్న పాత్రలో కిస్‌మిస్‌లు, కప్పు వేడి నీళ్లు పోసి.. పది నిమిషాల తర్వాత నీళ్లు వంపేసి, పక్కనుంచాలి. ఒక పెద్ద మెజరింగ్‌ కప్పులో పావు కప్పు వేడి పాలు, అర చెంచా పంచదార, యీస్ట్‌ వేసి కలియ తిప్పాలి, పదినిమిషాల్లో బుడగలతో రెట్టింపు పరిమాణం అవుతుంది. ఒక మిక్సింగ్‌ బౌల్‌లో అర కప్పు వేడి పాలు, పంచదార అర కప్పు, వెన్న, గిలకొట్టిన గుడ్లు, యీస్ట్‌ మిశ్రమం, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి, మైదాపిండి వేసి బాగా కలపాలి. ఈ పిండిని వెన్న- పంచదారలున్న పాత్రలోకి మార్చి, కిస్‌మిస్‌లు జతచేసి కలియ తిప్పాలి. దీనిపై శుభ్రమైన వస్త్రం కప్పి ఓ గంటన్నర పక్కనుంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని 12 భాగాలు చేసి బాల్స్‌లా చేయాలి. వాటిని బేకింగ్‌ ప్యాన్‌లో ఉంచి, మళ్లీ వస్త్రం కప్పాలి. అరగంటలో ఉబ్బి, పఫీగా అవుతాయి. ఒక గుడ్డు పగలకొట్టి, చెంచా నీళ్లు కలిపి బీట్‌ చేసి, బన్స్‌ను ఎగ్‌వాష్‌ చేయాలి. అవెన్‌ని 375 డిగ్రీల వరకూ ప్రీహీట్‌ చేసి, పావుగంట బేక్‌ చేయాలి. గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి మారాక.. ట్రేను అవెన్‌ నుంచి బయటకు తీయాలి. రెండున్నర చెంచాల పాలు, పంచదార పొడి పాలిథిన్‌ కవర్‌లో వేసి కోన్‌లా చేసి ఒక్కో బన్‌ మీద క్రాస్‌మార్క్‌ గీస్తే సరిపోతుంది.


బన్నీ బైట్‌ ఈస్టర్‌ పాప్‌కార్న్‌

కావలసినవి: పాప్‌కార్న్‌ - 5 కప్పులు, వైట్‌ చాక్లెట్‌, కాడ్బరీ మినీ ఎగ్స్‌ - అర కప్పు చొప్పున, మూడు రకాల పేస్టల్‌ రంగుల స్ప్రింకిల్స్‌ - ఒక్కోటీ టేబుల్‌ స్పూన్‌ చొప్పున
తయారీ: వైట్‌ చాక్లెట్‌ను అవెన్‌లో కరిగించాలి. వెడల్పయిన పాత్రలో పాప్‌కార్న్‌, కరిగిన వైట్‌ చాక్లెట్‌ వేసి కలియ తిప్పాలి. అందులో కాడ్బరీ మినీ ఎగ్స్‌, పేస్టల్‌ రంగుల స్ప్రింకిల్స్‌ వేసి బాగా కలపాలి. వీటిని బేకింగ్‌ ట్రేలో సమంగా సర్ది.. ఐదారు నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచితే.. చాక్లెట్‌ పాప్‌కార్న్‌కు చక్కగా పట్టుకుంటుంది. ట్రేను బయటకు తీసి.. మరీ అతుక్కున్నవాటిని విడగొట్టాలి. అంతే.. రంగురంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ.. నోరూరించే ‘బన్నీ బైట్‌ ఈస్టర్‌ పాప్‌కార్న్‌’ సిద్ధమైపోతుంది.


హోల్‌వీట్‌ డేట్‌ కేక్‌

కావలసినవి: గోధుమపిండి - రెండున్నర కప్పులు, పంచదార - కప్పు, పాలు - రెండు కప్పులు, గింజల్లేని ఖర్జూరపండ్లు - అర కిలో, నూనె - ముప్పావు కప్పు, బాదం, జీడిపప్పు పలుకులు - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, బేకింగ్‌ సోడా - అర చెంచా
తయారీ: ఖర్జూరాలను ముందురోజు రాత్రి కొన్ని నీళ్లలో వేసి నానబెట్టాలి. వీటిలో పాలు, పంచదార వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్టును ఒక పాత్రలోకి తీసుకుని అందులో నూనె వేయాలి. గోధుమపిండిని కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. ఒకేసారి వేస్తే ఉండలు కడుతుంది. బాదం, జీడిపప్పు పలుకుల్లో కొద్దిగా పక్కనుంచి, మిగిలినవాటిని ఇందులో వేయాలి. బేకింగ్‌ ట్రేలో బటర్‌ పేపర్‌ను అతికినట్లుగా పరవాలి. దానిమీద గోధుమపిండి ఖర్జూరాల మిశ్రమం వేసి.. మిగిలిన బాదం, జీడిపప్పు పలుకులను చల్లాలి. ఈ ట్రేని అవెన్‌లో ఉంచి, 180 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 40 నిమిషాలు బేక్‌ చేయాలి. బయటకు తీసి, పావుగంట చల్లారనిచ్చి తిరగేస్తే సరి.. ‘హోల్‌వీట్‌ డేట్‌ కేక్‌’ రెడీ!


కోకోనట్‌ లిచి క్రీమ్‌ క్యారమెల్‌

కావలసినవి: కొబ్బరిపాలు - అర లీటరు, పంచదార - పావు కిలో, లిచీ పండ్లు - వంద గ్రాములు, గుడ్లు - 6, కొబ్బరి తురుము - చారెడు, జాజికాయ పొడి - చిటికెడు
తయారీ: ఒక పాత్రలో కొబ్బరిపాలు, సగం పంచదార, గుడ్లు, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి. అందులో పొట్టు తీసిన లిచీలు కూడా వేసి పక్కన ఉంచుకోవాలి. మందపాటి గిన్నె తీసుకుని.. మిగిలిన పంచదార, కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. పంచదారను కలియ తిప్పకుండా, పాత్రను మధ్యమధ్యలో కదిలిస్తూ బంగారు రంగు వచ్చాక దించేయాలి. ఈ క్యారమెల్‌ను అచ్చులో పోసి.. మొత్తం పరచుకునేలా చేయాలి. ఆ కోటింగ్‌ మీద కొబ్బరిపాలు, లిచీపండ్ల మిశ్రమం వేసి డబుల్‌ బాయిలర్‌లో తక్కువ సెగలో అరగంట ఉడికించాలి. అంతే.. ‘కోకోనట్‌ లిచి క్రీమ్‌ క్యారమెల్‌’ సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని