క్రిస్మస్‌ స్నోఫ్లేక్స్‌

ఇంటి ముందు స్టార్స్‌.. ఇళ్లల్లో క్రిస్మస్‌ ట్రీ.. సందడే సందడి. ఎప్పట్లాగే శాంటాక్లాజ్‌ అనేక కానుకలు తెస్తున్నాడు. మీరూ మీ వాళ్లకోసం డోనట్స్‌, కేక్స్‌, కుకీస్‌ లాంటి వంటలతో పసందైన విందు చేసేందుకు సిద్ధమయ్యే ఉంటారు.

Published : 24 Dec 2023 00:20 IST

ఇంటి ముందు స్టార్స్‌.. ఇళ్లల్లో క్రిస్మస్‌ ట్రీ.. సందడే సందడి. ఎప్పట్లాగే శాంటాక్లాజ్‌ అనేక కానుకలు తెస్తున్నాడు. మీరూ మీ వాళ్లకోసం డోనట్స్‌, కేక్స్‌, కుకీస్‌ లాంటి వంటలతో పసందైన విందు చేసేందుకు సిద్ధమయ్యే ఉంటారు. ఈ పండుగ మరింత సంతోషాలు పంచాలంటే ఈ ప్రత్యేక రెసిపీలు ప్రయత్నించండి.


క్యారమెల్‌ పుడ్డింగ్‌

కావలసినవి: చిక్కటి పాలు - రెండు కప్పులు, కస్టర్డ్‌ పౌడర్‌ - రెండు స్పూన్లు, పంచదార - అర కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా, యోగర్ట్‌ - కప్పు, వెనీలా ఎసెన్స్‌ - అర చెంచా

తయారీ: నాన్‌స్టిక్‌ పాన్‌లో పంచదార, కొన్ని నీళ్లు పోసి, మరిగించి క్యారమెల్‌ తయారు చేయాలి. బంగారు రంగులోకి మారాక.. మరో పాత్రలోకి తీసుకోవాలి. పాలు, యోగర్ట్‌, కస్టర్డ్‌ పౌడర్‌, వెనీలా ఎసెన్స్‌లను ఒకసారి గ్రైండ్‌ చేసి ముందు సిద్ధం చేసిన క్యారమెల్‌ ఉన్న పాత్రలో పోయాలి. దీన్ని సుమారుగా అరగంట సేపు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారాక మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే నోరూరించే క్యారమెల్‌ పుడ్డింగ్‌ రెడీ.


క్రంచీ కుల్‌కుల్స్‌

కావలసినవి: మైదాపిండి - రెండు కప్పులు, ఉప్మారవ్వ - అర కప్పు, పంచదార పొడి - కప్పున్నర, కొబ్బరి పాలు - కప్పున్నర, ఉప్పు - పావు చెంచా, నెయ్యి - పావు కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, రవ్వ, కరిగిన నెయ్యి, పంచదార పొడి, కొబ్బరి పాలు, ఉప్పు వేసి కలపాలి. మెత్తగా అయ్యేదాకా మళ్లీ మళ్లీ కలిపి, శుభ్రమైన తడి వస్త్రం చుట్టి, అరగంట సేపు పక్కనుంచాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో బాల్‌నూ కుల్‌కుల్‌ రోలర్‌ మీద దొర్లించి, వెడల్పుగా అయ్యాక.. రెండు అంచులనూ మెల్లగా కలిపేసి ట్రేలో వేయాలి. రోలర్‌ లేదంటే ఫోర్క్‌, లేదా కొత్త దువ్వెన సాయంతో చేయొచ్చు. అన్నీ అయ్యాక కడాయిలో నూనె కాగనిచ్చి, బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తే సరిపోతుంది. రుచికరమైన కరకర లాడే కుల్‌కుల్స్‌ రెడీ! ఇవి చల్లారాక.. గాలి చొరబడని డబ్బాలో ఉంచితే రెండు వారాలు నిలవుంటాయి.


బెబింకా

కావలసినవి: మైదాపిండి - పావు కిలో, కోడిగుడ్లు - 10, పంచదార - అర కిలో, కొబ్బరి పాలు - గ్లాసు, జాజికాయ పొడి - చిటికెడు, నెయ్యి - పావు కప్పు

తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, కోడిగుడ్ల సొన, పంచదార, కొబ్బరి పాలు, జాజికాయ పొడి, చెంచా నెయ్యి వేసి బాగా కలపాలి. అవెన్‌లో పెట్టదగిన పాత్ర అడుగున కాస్త నెయ్యి రాయాలి. దాని మీద తయారు చేసుకున్న పిండిలో సగం వేసి, సమంగా సర్ది, గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చేదాకా బేక్‌ చేయాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే బేక్‌ చేయాలి. చల్లారాక స్లైసులుగా కట్‌ చేసి వడ్డించండి.


జింజర్‌బ్రెడ్‌ స్నోఫ్లేక్స్‌

కావలసినవి: మైదాపిండి - 2 కప్పులు, అల్లం ముద్ద - ఒకటిన్నర చెంచా, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, జాజికాయ పొడి, ఉప్పు - అర చెంచా చొప్పున, నూనె - తగినంత, పంచదార పొడి - రెండున్నర కప్పులు, సోయా మిల్క్‌, బెల్లం పాకం - పావు కప్పు చొప్పున, ఎగ్‌ రీప్లేసర్‌ - టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం - ఒకటిన్నర చెంచా, ఆల్మండ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా, పంచదార - ఐదున్నర కప్పులు, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు

తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, అల్లం ముద్ద, లవంగాల పొడి, దాల్చినచెక్క పొడి, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, జాజికాయ పొడి, ఉప్పు, నూనె, పంచదార పొడి వేసి ఎలక్ట్రిక్‌ మిక్సర్‌తో మూడు నిమిషాలు బీట్‌ చేయాలి. సోయా మిల్క్‌ పోసి మరోసారి బీట్‌ చేయాలి. ఈ పిండిని రెండు సమ భాగాలుగా చేసి.. పాలిథిన్‌ కవర్‌ చుట్టి మూడు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అవెన్‌ను 350 డిగ్రీల ఉష్ణోగ్రత వరకూ ప్రీహీట్‌ చేయాలి. పిండిని కాస్త మందమైన రొట్టెల్లా వచ్చేట్టు.. చపాతీకర్రతో రోల్‌ చేయాలి. వాటిని కుకీ కటర్స్‌తో నచ్చిన ఆకృతుల్లోకి కట్‌ చేసి.. బేకింగ్‌ షీట్‌ మీద అమర్చాలి. అలా అన్నీ సిద్ధమయ్యాక.. అవెన్‌లో బేక్‌ చేయాలి. ఫ్లేక్స్‌ సైజు, మందాలను బట్టి 8 నుంచి 12 నిమిషాలు పడుతుంది. ఇవి చల్లారేలోపు.. ఒక పాత్రలో ఎగ్‌ రీప్లేసర్‌ పొడి, కొన్ని నీళ్లు పోసి.. నాలుగు నిమిషాలు బీట్‌ చేయాలి. అందులో నిమ్మరసం, ఆల్మండ్‌ ఎక్స్‌ట్రాక్ట్‌, పంచదార, ఫుడ్‌ కలర్‌ వేసి మెత్తగా అయ్యేదాకా కలపాలి. దీన్ని కోన్‌లో వేసి కుకీస్‌ మీద నచ్చిన డిజైన్లు వేయాలి. అంతే.. సూపర్‌ స్నోఫ్లేక్స్‌ రెడీ!


గ్వావా చీజ్‌

కావలసినవి: జామకాయలు - కిలో, పంచదార - అర కిలో, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు, నిమ్మరసం - రెండు చెంచాలు, నెయ్యి - మూడు చెంచాలు

తయారీ: జామకాయలను కడిగి, తుడిచి నాలుగు భాగాలుగా కోయాలి. గింజలను తీసేసి, చిన్న ముక్కలుగా కోయాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో ఈ ముక్కలు వేసి, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. మెత్తగా మగ్గిన తర్వాత రెండు చెంచాల నెయ్యి, పంచదార, నిమ్మరసం కలపాలి. ఇంకో రెండు నిమిషాలు సన్న సెగ మీద ఉడికించి, దించేయాలి. ఒక ప్లేటులో మిగిలిన నెయ్యి రాసి జామకాయ మిశ్రమాన్ని సమంగా సర్దాలి. ముక్కలుగా కోసి గాలి చొరబడని పాత్రలో నిలవచేసుకోవాలి. ఈ గ్వావా చీజ్‌ డిజర్ట్‌ ఎంత రుచిగా ఉంటుందో, అంత ఆరోగ్యం కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని