కోరికోరి కొబ్బరి..

తియ్యటి కొబ్బరిని ఇష్టంగా తింటాం. కాస్తంత కూరల్లో వేస్తే.. వాటి రుచి రెట్టింపవుతుంది. చట్నీ చేస్తే సూపర్‌ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యాన్నీ చేకూర్చే కొబ్బరితో చాలానే పిండివంటలున్నాయి. వాటిల్లో ఇవి మరింత ప్రత్యేకం.

Updated : 28 Jan 2024 02:12 IST

తియ్యటి కొబ్బరిని ఇష్టంగా తింటాం. కాస్తంత కూరల్లో వేస్తే.. వాటి రుచి రెట్టింపవుతుంది. చట్నీ చేస్తే సూపర్‌ టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యాన్నీ చేకూర్చే కొబ్బరితో చాలానే పిండివంటలున్నాయి. వాటిల్లో ఇవి మరింత ప్రత్యేకం.


కొబ్బరి బైట్స్‌

కావలసినవి: ఆల్మండ్‌బట్టర్‌ - అర కప్పు, సాల్టెడ్‌ ఆల్మండ్స్‌ - కప్పు, మినీ చాక్లెట్‌ చిప్స్‌ - అర కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా, కొబ్బరి తురుము - రెండు కప్పులు, ఉప్పు - చిటికెడు,

తయారీ: అవెన్‌ సేఫ్‌ బౌల్‌లో ఆల్మండ్‌ బట్టర్‌ను 20 క్షణాలు వేడిచేయాలి. సాల్టెడ్‌ ఆల్మండ్స్‌, మినీ చాక్లెట్‌ చిప్స్‌, వేడి చేసిన ఆల్మండ్‌బట్టర్‌లు ఫుడ్‌ ప్రాసెసర్‌లో వేసి మెత్తగా చేసుకోవాలి. అందులో కప్పున్నర కొబ్బరి తురుము, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, ఉప్పు వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత భాగాలు చేసి.. వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. అన్నీ అయ్యాక మిగిలిన కొబ్బరి తురుములో దొర్లించి తీయాలి. వీటిని పావుగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీస్తే సరిపోతుంది. తిని ఆనందించడమే తరువాయి.


కప్‌ కేక్స్‌

కావలసినవి: మైదాపిండి - రెండు కప్పులు, కొబ్బరి తురుము - కప్పున్నర, పంచదార - ఒక కప్పు, వెన్న - అర కప్పు, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా - చెంచా చొప్పున, ఉప్పు - చిటికెడు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ముప్పావు చెంచా, యోగర్ట్‌ - కప్పున్నర, నెయ్యి - తగినంత

తయారీ: ఒక గిన్నెలో మైదాపిండి, పంచదార, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపాలి. ఇంకో పాత్రలో యోగర్ట్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, వెన్న వేసి బాగా బీట్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని పంచదార, కొబ్బరి కలిపిన మైదా పిండిలో వేసి కలియబెట్టాలి. అవెన్‌ను ప్రీహీట్‌ చేయాలి. మఫిన్‌ ప్యాన్‌ లేదా పేపర్‌ కప్స్‌లో కాస్త నెయ్యి వేసి గ్రీజ్‌ చేయాలి. సిద్ధం చేసుకున్న పిండిని తగినంత కప్స్‌లో వేసి.. పైన కాస్త కొబ్బరి తురుము చల్లాలి. వీటిని సుమారు ఇరవై నిమిషాలు బేక్‌ చేయాలి. అంతే.. నోరూరించే కోకోనట్‌ కప్‌ కేక్స్‌ రెడీ!


కుకీస్‌

కావలసినవి: గోధుమపిండి - కప్పు, బెల్లం పొడి - అర కప్పు, కొబ్బరి తురుము - 3 టేబుల్‌ స్పూన్లు, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, బాదం, జీడిపప్పుల పొడి - పావు కప్పు, నెయ్యి - 2 చెంచాలు, ఉప్మా రవ్వ - 1 టేబుల్‌ స్పూన్‌, యాలకుల పొడి - అర చెంచా, శొంఠి పొడి, బేకింగ్‌ సోడా - పావు చెంచా చొప్పున

తయారీ: ఒక పాత్రలో గోధుమపిండి, బేకింగ్‌ సోడా వేసి కలపాలి. అవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్‌కు ప్రీహీట్‌ చేయాలి. ఒక పాత్రలో బేకింగ్‌ పౌడర్‌ కలిపిన గోధుమపిండి, ఉప్మా రవ్వ, బాదం, జీడిపప్పుల పొడి, యాలకుల పొడి, శొంఠి పొడి, బెల్లం పొడి, కొబ్బరి నూనె వేసి కలపాలి. కొబ్బరి పాలు జతచేసి పిండి మెత్తగా అయ్యేలా మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత భాగాలుగా తీసుకుని, కుకీస్‌ చేసి.. నెయ్యి రాసిన ట్రేలో అమర్చాలి. వీటిని 20 నుంచి 25 నిమిషాలు బేక్‌ చేయాలి. అంతే.. బంగారు రంగులోకి మారిన కోకోనట్‌ కుకీస్‌ రెడీ. చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాల్లో భద్రం చేసుకుంటే టీ టైమ్‌లో తినొచ్చు.


కోకోనట్‌ బార్‌

కావలసినవి: కొబ్బరి తురుము - రెండు కప్పులు, బెల్లం పొడి - కప్పున్నర, నెయ్యి - మూడు చెంచాలు, యాలకుల పొడి - పావు చెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - పావు కప్పు

తయారీ: బెల్లం పొడిలో పావు కప్పు నీళ్లు పోసి సన్న సెగ మీద వేడి చేయాలి. పల్చటి పాకాన్ని వడకట్టి పక్కనుంచు కోవాలి. కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేసి కొబ్బరి తురుమును వేయించాలి. అందులో బెల్లం పాకం, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి కలియ తిప్పుతుండాలి. చిక్కబడిన తర్వాత దించేయాలి. ఒక పళ్లెంలో కాస్త నెయ్యి రాసి.. కొబ్బరి మిశ్రమాన్ని సమంగా సర్దాలి. దాన్ని ముక్కలుగా కట్‌ చేసుకుంటే సరిపోతుంది.


రైస్‌ పుడ్డింగ్‌

కావలసినవి: కొబ్బరి పాలు - 4 కప్పులు, పంచదార, కొబ్బరి తురుము - పావు కప్పు చొప్పున, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా, అన్నం - కప్పు, నెయ్యి - అర టేబుల్‌ స్పూన్‌, ఎండుకొబ్బరి ముక్కలు - చారెడు, జీడిపప్పు, పిస్తాపప్పులు - పావు కప్పు

తయారీ: ముందుగా ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, పిస్తాలను వేయించుకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి పాలు, పంచదార, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌లు వేసి బాగా కలపాలి. అందులో అన్నం, ఎండుకొబ్బరి, డ్రైఫ్రూట్స్‌ వేసి మరోసారి కలిపి.. సన్న సెగ మీద సుమారు పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొబ్బరి తురుము జతచేసి ఇంకో రెండు నిమిషాలుంచి, దించేయాలి. అన్నం మెత్తబడి, కొబ్బరిపాలు చిక్కబడి, డ్రైఫ్రూట్స్‌ తేలుతూ.. ఆకర్షణీయంగా కనిపించే కొబ్బరి రైస్‌ పుడ్డింగ్‌ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని