అమ్మకు ప్రేమగా..

చిన్నతనంలో గోరుముద్దల నుంచి, కూర, చారు, పచ్చడి, స్వీటు, హాటు.. అమ్మ చేత్తో ఏం తినిపించినా అమృతమే! పంచభక్ష్య పరమాన్నాల్లాంటి విందే.

Published : 12 May 2024 00:55 IST

చిన్నతనంలో గోరుముద్దల నుంచి, కూర, చారు, పచ్చడి, స్వీటు, హాటు.. అమ్మ చేత్తో ఏం తినిపించినా అమృతమే! పంచభక్ష్య పరమాన్నాల్లాంటి విందే. ఎందుకంటే.. వాటిలో పదార్థాల్ని మించిన ప్రేమ ఉంటుంది మరి. ఇవాళ మాతృదినోత్సవం కదా! అమ్మకి నచ్చేలా ఈ కమ్మటి వంటలు చేసి.. కొసరికొసరి వడ్డిద్దామా!


సూర్యకళ చంద్రకళ

 కావలసినవి: మైదాపిండి, పంచదార, ఖోయా - 2 కప్పుల చొప్పున, నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు, బాదం, జీడిపప్పుల పొడి - పావు కప్పు, పిస్తా గింజల పలుకులు - టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - చిటికెడు, నిమ్మరసం - చెంచా, యాలకుల పొడి - అర చెంచా, కుంకుమపువ్వు - కొద్దిగా, నూనె - వేయించేందుకు సరిపడా.

 తయారీ: మైదాపిండిలో పంచదార, ఉప్పు, నెయ్యి వేసి.. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి. మెత్తగా అయ్యాక.. మూత పెట్టేసి, అర గంట ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈలోగా ఖోయాలో బాదం, జీడిపప్పుల పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి కలిపి పక్కనుంచాలి. మరో పాత్రలో పంచదారకు గ్లాసు నీళ్లు, నిమ్మరసం జత చేసి మరిగించాలి. ఏడెనిమిది నిమిషాల తర్వాత దించేయాలి. ఫ్రిజ్‌లోంచి పిండి తీసి కొంత భాగాన్ని చిన్నచిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ఒక దానిమీద నిమ్మకాయంత ఖోయా ఫిల్లింగ్‌ ఉంచి, రెండో దాంతో కప్పేయాలి. రెండు అంచులనూ కలుపుతూ.. కొంచెం కొంచెం మెలితిప్పినట్లు చేయాలి. ఇవి సూర్యకళ. ఇక చంద్రకళ కోసం.. మిగిలిన పిండితో కాస్త పెద్ద పూరీలు ఒత్తుకోవాలి. ఒక్కో పూరీ మీద.. ఖోయా ఫిల్లింగ్‌ ఉంచి, సగానికి మడిచి, అంచులనూ కలుపుతూ.. మెలితిప్పాలి. అన్నీ తయారయ్యాక.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించి, పంచదార పాకంలో వేయాలి. రెండు నిమిషాలు అందులో ఉంచి.. మరో పాత్రలోకి తీసి.. పిస్తా పలుకులు చల్లాలి. అంతే.. నోరూరించే  సూర్యకళ చంద్రకళ తయారైనట్లే.


మునగాకు పులిహోర

కావలసినవి: అన్నం - రెండు కప్పులు, మునగాకు - పావు కప్పు, నిమ్మరసం - రెండు చెంచాలు, పచ్చిబఠాణీలు - చారెడు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, నెయ్యి - చెంచా, నూనె - 2 చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు, కచ్చాపచ్చా దంచిన మిరియాల పొడి - అర చెంచా చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు - అర చెంచా చొప్పున, జీడిపప్పు - చారెడు
తయారీ: మునగాకును కడిగి, నీళ్లు వడకట్టాలి. పచ్చిబఠాణీలను ఉడికించి, నీళ్లు తీసేయాలి. అల్లం, ఉల్లి, పచ్చిమిర్చిలను తరిగి ఉంచాలి. కడాయిలో నూనె, నెయ్యి కాగనిచ్చి.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు.. ఉడికించిన బఠాణీలు, జీడిపప్పు, మిరియాల పొడి, కరివేపాకు, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి అర నిమిషం వేయించాలి. అందులో మునగాకు, పసుపు వేసి సన్న సెగ మీద రెండు మూడు నిమిషాలు వేయించాలి. చివర్లో నిమ్మరసం, ఉప్పు జతచేసి దించేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి. అంతే.. మునగాకు పులిహోర సిద్ధం. మునగాకు ఆరోగ్యానికీ మంచిది, మనం తరచూ చేసే చింతపండు పులిహోరకు భిన్నంగా ప్రత్యేక రుచితో ఉంటుంది.


పాల కాయలు

కావలసినవి: బియ్యం - 2 కప్పులు, బెల్లం - కప్పు, వెన్న - పావు కప్పు, నువ్వులు - మూడు చెంచాలు, ఉప్పు - చిటికెడు, యాలకుల పొడి - పావు చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: బెల్లంలో కొన్ని నీళ్లు పోసి మరిగించి, వడకట్టాలి. బియ్యం కడిగి ఐదు గంటలు నానబెట్టి, శుభ్రమైన వస్త్రం మీద ఆరబోయాలి. పొడిబారాక.. గ్రైండ్‌ చేయాలి. ఈ పిండిలో బెల్లం నీళ్లు, వెన్న, నువ్వులు, ఉప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా చలిమిడిలా మెత్తగా ఉండాలి. ఇందులోంచి చిన్న ముద్దను తీసుకుని అంగుళమంత పొడుగ్గా పాలకాయలు చేసుకోవాలి. ఇంకో అరంగుళం పొడవున్నా బాగానే ఉంటాయి. అన్నీ అయ్యాక.. కాగుతున్న నూనెలో దోరగా వేయించాలి. అంతే.. వహ్వా అనిపించే ‘పాలకాయలు’ తయారైపోతాయి.


మిరియాలు గారెలు 

కావలసినవి: పొట్టు మినప్పప్పు - 2 కప్పులు, మిరియాలు - నాలుగు చెంచాలు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - 2, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, జీలకర్ర - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: ముందురోజు రాత్రి మినప్పప్పును కడిగి, నానబెట్టాలి. మర్నాడు ఉదయం.. ఆ నీళ్లు తీసేసి.. ఉప్పు, మిరియాలు, జీలకర్ర, అల్లం వేసి గ్రైండ్‌ చేయాలి.  ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇందులో కలపాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండాలి. ఈ పిండితో అరిటాకు లేదా పాలిథిన్‌ పేపరు మీద గారెలు చేసి, కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయిస్తే సరి.. ఘుమఘుమలాడే మిరియాల గారెలు సిద్ధం. ఇవి మరింత రుచిగా, ప్రత్యేకంగా ఉంటాయి.


పనస తొనలు

కావలసినవి: గోధుమపిండి, బెల్లం - అర కిలో చొప్పున, నెయ్యి - అర కప్పు, ఉప్పు - చిటికెడు, యాలకుల పొడి - అర చెంచా
తయారీ: బెల్లంలో అర గ్లాసు నీళ్లు, యాలకుల పొడి పోసి మరిగించాలి. కాస్త చిక్కబడ్డాక దించేసి.. వడకట్టాలి. గోధుమపిండిలో ఉప్పు, నెయ్యి వేసి.. కొన్ని కొన్ని చొప్పున నీళ్లు పోస్తూ.. మెత్తగా అయ్యేలా కలపాలి. దాన్ని తడి వస్త్రంతో కప్పి.. అర గంట పక్కనుంచాలి. దీంతో మూడు లేదా నాలుగు మందమైన రొట్టెలు చేయాలి. రొట్టె సైజును బట్టి చతురస్రం ఆకారంలో ఆరు లేదా ఎనిమిది ముక్కలు చేయాలి. ఒక్కోదాన్ని చివరి వరకూ తెగకుండా ఐదారు చీలికలు చేసి.. పైన, కింద విడివిడిగా అంచులు కలిపేయాలి. తక్కినవాటితోనూ ఇలాగే చేయాలి. అన్నీ అయ్యాక కాగుతున్న నూనెలో వేయించాలి. వాటిని బెల్లం పాకంలో వేసి.. రెండు నిమిషాలుంచి మరో పాత్రలోకి తీస్తే సరిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని