నీళ్ల ఆవకాయ పట్టేస్తారా?

ఈ కాలం వస్తే రోళ్లూ, రోకళ్లకి తీరికే ఉండదు.. కారాలు దంచాలి... ఆవపిండి కొట్టాలి.. ఆవకాయ కలపాలి.. అబ్బో అదో యజ్ఞమే కొన్నిళ్లలో!

Updated : 14 May 2023 00:34 IST

ఈ కాలం వస్తే రోళ్లూ, రోకళ్లకి తీరికే ఉండదు.. కారాలు దంచాలి... ఆవపిండి కొట్టాలి.. ఆవకాయ కలపాలి.. అబ్బో అదో యజ్ఞమే కొన్నిళ్లలో! అలాగని ఆవకాయలన్నీ ఒక రుచిలో ఉండవండోయ్‌. ఒక్కో చోట ఒక్కో పద్ధతి. ఓసారి వీటిని కూడా ప్రయత్నించండి


ఉప్పావ

కావాల్సినవి: మామిడికాయ ముక్కలు- 4 కప్పులు, వేయించి పొడిచేసిన నువ్వులు- ఒకటిన్నర కప్పు, ఉప్పు- కప్పు, నూనె- కప్పు, ఆవపొడి- అర కప్పు, పసుపు, ఇంగువ- తగినంత, మెంతిపొడి- చెంచా
తయారీ: పైన చెప్పిన అన్నింటినీ చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఆపై కాసిని మెంతులు, ఆవాలు, ఇంగువతో పోపు వేసుకుని ఆ నూనె చల్లారాక.. పచ్చడిలో కలపాలి. మూత పెట్టి ఉంచి, మూడో రోజు తిరిగి కలపాలి. ఇందులో కారం వేయరు. నువ్వుల పొడి మాత్రమే వేస్తారు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేడి అన్నంలో ఉప్పావ, నెయ్యి వేసుకొని తింటే మళ్లీమళ్ళీ తినాలనిపిస్తుంది.


చక్కెర మెంతి

దీనిని బెల్లంతో కానీ చక్కెరతో కానీ పెడతారు. రుచిలో రెండూ బ్రహ్మాండంగా ఉంటాయి. రంగులో కొద్దిగా తేడా ఉంటుంది. ఆరోగ్యరీత్యా బెల్లంతో పెట్టేది మంచిది.

కావాల్సినవి: మామిడికాయ ముక్కలు- 4 కప్పులు, బెల్లం- 2 కప్పులు, లేదా చక్కెర- కప్పు, నువ్వుల పొడి- కప్పు, ఉప్పు- కప్పు, కారం- పావు కప్పు, ఆవపొడి- పావు కప్పు, నూనె- కప్పు, పసుపు, ఇంగువ- తగినంత, మెంతిపొడి- చెంచా
తయారీ: ఈమధ్యకాలంలో ఇసుక, చెత్త లేని స్వచ్ఛమైన బెల్లం దొరుకుతోంది. అలాంటి బెల్లాన్ని పొడికొట్టి నేరుగా వేసుకోవచ్చు. మామిడికాయ ముక్కల్లో బెల్లం లేదా చక్కెర కలిపి పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి కలపాలి. మెంతులు, ఆవాలు, ఇంగువతో పై తాలింపు వేసుకుంటే సరిపోతుంది. బెల్లంలో ఇసుక ఉందని అనుమానం ఉంటే కరిగించుకుని వడ కట్టుకుని వేసుకోవడమే.


ఉడికించిన తొక్కు

కావాల్సినవి: మామిడికాయ ముక్కలు- 4 కప్పులు, కారం- కప్పు, ఉప్పు- కప్పు, పసుపు- తగినంత, నూనె- కప్పు, మెంతి పొడి- చెంచా, నువ్వుల పొడి- చెంచా, ఇంగువ- తగినంత
తయారీ: మామిడికాయల్ని పప్పులోకి తరిగినట్టుగా పెద్దసైజు ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి. మూకుడులో నూనె వేసి వేడెక్కాక మామిడికాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. ముక్క ఉడికాక చల్లారనిచ్చి తగినంత ఉప్పు, కారం, మెంతిపొడి, పసుపు, నువ్వుల పొడి వేసి కలపాలి. పైనుంచి మెంతులు, ఆవాలు, ఇంగువతో పోపు వేసుకుని దానిని చల్లారాక ఉడికిన తొక్కులో కలపాలి. ఇష్టాన్ని బట్టి బెల్లం కూడా వేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.


నువ్వావ

కావాల్సినవి: మామిడికాయ ముక్కలు- 4 కప్పులు, వేయించి పొడికొట్టిన నువ్వులు- 2  కప్పులు, నూనె- కప్పు, కారం- కప్పు, ఉప్పు- కప్పు, పసుపు, ఇంగువ, మెంతులపొడి- చెంచా
తయారీ: మామిడిముక్కలకి పైన చెప్పిన అన్ని పదార్థాలు కలపాలి. మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి పోపు వేసుకోవాలి. ఆ నూనెను చల్లారాక పచ్చడిలో వేసుకోవాలి. మూత పెట్టి మూడో రోజు తిరిగి కలపాలి. ఇది ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.


నీళ్ల ఆవకాయ

నీళ్ల ఆవ అనగానే పాడైపోతుందేమో అనుకుంటారు కానీ ఏడాది నిల్వ ఉంటుంది. ఉప్పు ఒక్కటీ సరిగా ఉంటే చాలు. తెలంగాణలో పూర్వం నుంచీ ఈ ఆవకాయ పెట్టడం ఆనవాయితీనే.

కావాల్సినవి: మామిడికాయ ముక్కలు- 4 కప్పులు, ఆవపొడి- కప్పు, కారం- కప్పు, ఉప్పు- కప్పు, సున్నం- రెండు చెంచాలు, ఉప్పుబావి నీరు లేదంటే మినరల్‌ వాటర్‌- కప్పు, పసుపు, ఇంగువ- తగినంత, మెంతిపొడి- చెంచా  
తయారీ: మాములు ఆవకాయకు కలిపినట్టే ఉప్పు, కారం, ఆవపొడి, మెంతిపొడి, ఇంగువ వేసి కలపాలి. అయితే ఇక్కడ నూనెకు బదులుగా పారాణినీళ్లు వాడాలి. అంటే సున్నంలో కాసింత పసుపు వేసి మినరల్‌ వాటర్‌ కలిపితే అవే పారాణి నీళ్లు. ఈ నీళ్లని ఈ పచ్చడిలో కలపాలి. ఇందులో నూనె ఉండదు. చెంచా నూనె వేసి మెంతులు, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టి చల్లారాక పచ్చడిలో వేసి కలపాలి. మూడో రోజు కలిపినప్పుడు గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొద్దిగా పారాణి నీళ్లు పోసి కలపొచ్చు. ఉప్పు చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా కలిపితే సంవత్సరం అయినా పాడుకాదు.


* పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మూడో రోజు పచ్చడిని కలిపేటప్పుడు ఉప్పు సరిగా ఉందో లేదో చూడండి. ఉప్పు తగినంత ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.


* సున్నంలో పసుపు కలిపిన పారాణి నీళ్లని కొద్దిగా పచ్చళ్లలో వేస్తే అవి ఏడాది పొడవునా నిల్వ ఉంటాయి.
* పచ్చళ్లలో నువ్వుల పొడి కలిపేటప్పుడు వేయించి పొడికొట్టుకోవాలి.


* జాడీలు, గరిటెలు తడి లేకుండా పొడిగా ఉండాలి. ఆవాలు, మెంతులు వంటివాటిని ఎండలో పెట్టి ఆ తర్వాత వాడాలి. మామిడికాయ ముక్కలు కడిగాక తడిలేకుండా పూర్తిగా తుడవాలి.


* టెంకలోని జీళ్లని కూడా ఎండబెట్టి, నూనెలో వేయించి పచ్చళ్లలో కలుపుకోవచ్చు. రుచిగా ఉంటాయి.  


కల్యాణి శాస్త్రుల, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని