తీపీ కారాల భుట్టే కా కీస్‌

మధ్యప్రదేశ్‌ వాసుల వంటల్లో కొన్ని కొంచెం తియ్యగా కొంచెం కారంగా ఉంటాయి. ఆ చిత్రమైన రుచి చాలామందికి నచ్చేస్తుంది.

Published : 18 Feb 2024 00:02 IST

ధ్యప్రదేశ్‌ వాసుల వంటల్లో కొన్ని కొంచెం తియ్యగా కొంచెం కారంగా ఉంటాయి. ఆ చిత్రమైన రుచి చాలామందికి నచ్చేస్తుంది. అలా తియ్యతియ్యగా.. కారంకారంగా ఉండే వంటల్లో ‘భుట్టే కా కీస్‌’ ఒకటి. ఎలా చేస్తారంటే.. ముందుగా బేబీకార్న్‌ కండెలను కడిగి తురుముకోవాలి. పావు కప్పు శనగపిండిని కొద్దిగా వేయించి పక్కనుంచాలి. కడాయిలో కొంచెం నూనె వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సోంపూ, అల్లం తరుగు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. రెండు పచ్చి మిరపకాయలను చిన్నగా కోసి వాటిని కూడా వేయాలి. అవి వేగాక.. తురిమిన మొక్కజొన్న, పసుపు, ధనియాల పొడి వేసి నాలుగు నిమిషాల పాటు వేయించాలి. అందులో వేయించిన శనగపిండి, కప్పు పాలు పోసి మూత పెట్టి ఉడికించాలి. పాలు ఇష్టంలేని వాళ్లు నీళ్లు పోసి ఉడికించవచ్చు. చిక్కబడ్డాక.. కశ్మీరీ కారం, ఛాట్‌ మసాలా, నిమ్మరసం అర చెంచా చొప్పున, కాస్త ఉప్పు, చెంచా నెయ్యి, టేబుల్‌ స్పూన్‌ పంచదార, చారెడు కొత్తిమీర తరుగు వేసి కలియ తిప్పాలి. ఇంకో నిమిషం సన్న సెగ మీద ఉంచి, దించేయాలి. పైన కాస్త కొబ్బరి కోరు చల్లితే సరి.. ‘భుట్టే కా కీస్‌’ రెడీ. తీపీ కారాల కలయికతో ప్రత్యేక రుచీ, వాసనలతో ఆకట్టుకునే ఈ వంటకాన్ని మీరూ ప్రయత్నించండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని