సైకిలెక్కిన చైతన్యం..

రోజురోజుకీ కాలుష్యం మానవాళిని కబళిస్తోంది... కరోనా సమయంలో ఆక్సిజన్‌ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు... ప్లాస్టిక్‌ అతివాడకంతో భూమి వ్యర్థాల నిలయమవుతోంది.

Updated : 02 Mar 2024 01:28 IST

రోజురోజుకీ కాలుష్యం మానవాళిని కబళిస్తోంది... కరోనా సమయంలో ఆక్సిజన్‌ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు... ప్లాస్టిక్‌ అతివాడకంతో భూమి వ్యర్థాల నిలయమవుతోంది. ఇవన్నీ నెల్లూరు యువకుడు పెంచల చైతన్యని తీవ్ర ఆలోచనల్లో పడేశాయి. వెంటనే సైకిల్‌ ఎక్కాడు..50 వేల కిలోమీటర్లు లక్ష్యంగా పర్యావరణ పరిరక్షణ యాత్ర చేస్తున్నాడు.

 కాలుష్యం తగ్గాలన్నా.. అందరికీ ఆక్సిజన్‌ అందాలన్నా.. ప్లాస్టిక్‌ వాడకాన్ని అరికట్టాలన్నా.. పర్యావరణాన్ని పరిరక్షణ ఒక్కటే మార్గమని నమ్మాడు చైతన్య. దానికి మొక్కలు నాటడం ఓ మార్గంలా కనిపించింది. ఆ ప్రయత్నాన్ని వివరిస్తూ.. 2022 మే 16న నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు 1,500 కి.మీ. సైకిల్‌ యాత్ర చేశాడు. తర్వాత 50వేల కి.మీ. సుదీర్ఘ యాత్రకు తెర లేపాడు.
చైతన్యది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం. ఎం.ఫార్మసీ చేశాక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మెడికల్‌ ఇంఛార్జిగా చేరాడు. అదేసమయంలో కరోనా విరుచుకు పడింది. రెండో దశలో ఆక్సిజన్‌ సరిపడా అందుబాటులో లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. చైతన్య తీవ్రంగా చలించిపోయాడు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యం తెలిసొచ్చింది. తనకు తోచినంతగా అందరికీ అవగాహన కల్పించాలనే నిర్ణయం తీసుకున్నాడు. ఆరోగ్యంతో పాటు కాలుష్యరహితంగా ఉంటుందనే ఉద్దేశంతో సైకిల్‌ యాత్రలకు శ్రీకారం చుట్టాడు.

ఏం చేస్తున్నాడంటే..

మొదటిసారి నెల్లూరు నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ స్థానికులతో కలిసి మొక్కలు నాటాడు. రెండో సారి ఆహార వృథాని అరికట్టాలనే నినాదం ఎంచుకున్నాడు. నెల్లూరు నుంచి గుజరాత్‌ రాష్ట్రంలోని పాకిస్థాన్‌ సరిహద్దు నడావేట్‌ వరకు 55 రోజుల పాటు 3,830 కి.మీ మేర యాత్ర సాగించాడు. ఈ రెండు యాత్రల్లో మంచి స్పందన

వడంతో ఈసారి ఏకంగా

50 వేల కి.మీ. అవగాహన పర్యటనకు శ్రీకారం చుట్టాడు. 2022 డిసెంబరు 25న యాత్ర మొదలైంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలనీ.. భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రకృతిని అందించాలని ప్రచారం మొదలు పెట్టాడు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, యువతను కలుస్తూ.. చైతన్యవంతులను చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌లలో 23వేల కి.మీ పైగా సైకిల్‌ యాత్ర ముగిసింది. మార్గమధ్యంలో ఆయా ప్రాంత విశేషాలు, అక్కడి ఆహార పదార్థాలు, పర్యాటక ప్రాంతాలు, పర్యావరణహిత కార్యక్రమాల గురించి తన యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రజలకు వివరిస్తున్నాడు.

రికార్డు దిశగా..

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బంగ, బిహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, నాగాలాండ్‌, మణిపుర్‌, మిజోరాం, త్రిపుర, మేఘాలయా, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, హరియాణా, పంజాబ్‌, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్కండ్‌, ఒడిశా, తెలంగాణల గుండా 28వేల కి.మీ.లు ప్రయాణించి ఏపీలోని నెల్లూరుకు చేరుకుంటాడు. ఇదీ పూర్తయితే గిన్నిస్‌బుక్‌లో రికార్డు నమోదు అవుతుంది. ‘ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడం కష్టం.. కానీ ప్రయత్నిస్తే వీలైనంత తక్కువగా ఉపయోగించవచ్చు. పునర్వినియోగ ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వాడటం మరో ప్రత్యామ్నాయం’ అంటున్న చైతన్య ‘యూత్‌ ఐకాన్‌’ అవార్డునూ అందుకున్నాడు.
- కావలి త్రినాథ్‌ కుమార్‌, నెల్లూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని