ఆ స్టేటస్‌.. కథేంటి?

పడక దిగుతూనే ఓ సూక్తి ముక్తావళి.. పప్పీతో ఆడుకుంటూ ఓ సరదా చిత్రం.. పండక్కి ఊరెళ్తే వరుసపెట్టి టూర్‌ సంగతులు.. అనునిత్యం ఆన్‌లైన్‌లోనే అన్నట్టు సందర్భం ఏదైనా వాట్సప్‌లో అప్‌డేట్‌ చేసేవాళ్లు బోలెడుమంది.

Published : 30 Mar 2024 00:03 IST

డక దిగుతూనే ఓ సూక్తి ముక్తావళి.. పప్పీతో ఆడుకుంటూ ఓ సరదా చిత్రం.. పండక్కి ఊరెళ్తే వరుసపెట్టి టూర్‌ సంగతులు.. అనునిత్యం ఆన్‌లైన్‌లోనే అన్నట్టు సందర్భం ఏదైనా వాట్సప్‌లో అప్‌డేట్‌ చేసేవాళ్లు బోలెడుమంది. ఇలా చేయడం అలవాటు కాదు మనస్తత్వం అంటున్నాయి అధ్యయనాలు. వాటి ప్రకారం ఇలా మరీ ఎక్కువగా స్టేటస్‌లు పెట్టడం వెనక ఉన్న మతలబు ఏంటంటే..  

ఫలితం: సంతోషం, బాధ, ఉత్సుకత, ఈర్ష్య... ఇలా మనిషికి ఎన్నో భావోద్వేగాలుంటాయి. స్టేటస్‌ పెట్టడం ద్వారా అందులో ఏదో ఒక ఫలితం తొందరగా దక్కుతుంది.

నిర్ణయం: ఇల్లు, ఆఫీసు, రాష్ట్రం, దేశం.. మేం దేన్నీ మార్చలేం అని భావించేవారు.. ఇక నా చేతుల్లో ఏమీ లేదు.. అని అసంతృప్తికి గురయ్యేవారు ఇలాంటి స్టేటస్‌లు ఎక్కువగా పోస్ట్‌ చేస్తుంటారట. ఎవరితోనూ వాదించ లేనివారు, నేరుగా తలపడ లేనివారు.. దీన్నొక మార్గంలా ఎంచుకుంటారు.

గుర్తింపు: తమ అందాన్ని, చేసిన పనిని అంతా గుర్తించాలనీ.. పొగడాలనీ కోరుకునే వాళ్లూ ఈ కోవలోనే ఉంటారు. ఎడ్లబండి ఎక్కినా, ఎయిర్‌ బస్‌లో ప్రయాణించినా ఈ స్టేటస్‌లు పెట్టేస్తారు.

ప్రచారం: వ్యక్తిగతానికే కాదు.. తమ వృత్తిగతానికీ, వ్యాపారానికీ స్టేటస్‌ని ఓ ప్రచార వేదికలా వాడుకునేవాళ్లూ తక్కువేం కాదు. అంటే స్టేటస్‌ని ఒక మార్కెటింగ్‌ సాధనంగా మార్చేసేవాళ్లూ ఉంటారు.

కాలక్షేపం: తమలోని భావాలను పంచుకోవడం.. స్టేటస్‌ని ఎంతమంది చూశారో లెక్కలేసుకోవడం.. కామెంట్లు చదువుకోవడం.. ఇతరుల స్టేటస్‌లు చూడటం.. మొత్తానికి దీన్నొక కాలక్షేపంగా మార్చుకునేవాళ్లూ ఉన్నారు. ఇందులో సంతోషాన్నీ వెదుక్కునేవారూ లేకపోలేదు.

అభద్రత: ఫేస్‌బుక్‌ అధ్యయనం ప్రకారం తమ రిలేషన్‌షిప్‌లో అభద్రతా భావానికి గురయ్యేవారు స్టేటస్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇష్టమైన వ్యక్తుల ఫొటోల్ని తరచూ ప్రదర్శించి వాళ్ల ప్రేమ గెలవాలని భావిస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని